108 అంకె ఎంకుకు విశిష్టమైంది? (Importance of the Number 108)
108 అంకె ఎంకుకు విశిష్టమైంది?
(Importance of the Number 108)
మనలో చాలామందికి కొన్ని అంకెలంటే మహా ప్రేమ. వాటిల్లో తొమ్మిది అంటే ఇంకా ఇంకా ఇష్టం. పెద్ద అంకెల విషయానికి వచ్చినప్పుడు అందులో ఉన్న అంకెల మొత్తాన్ని కూడగా వచ్చే సంఖ్యను పరిగణిస్తారు. అలా 108 సంఖ్యను కూడా చాలా ఇష్టపడతారు. అలాగే 3, 7, 8, 13 లాంటి కొన్ని నంబర్లు చూడగానే ముఖం చిట్లిస్తారు. అలాంటి తేదీల్లో ఏ పనీ మొదలుపెట్టరు. ఆయా నంబర్ల ఫ్లాట్లు కొనుక్కోరు. ఇలాంటి నమ్మకాలు ఉన్నవాళ్ళు ఆ నంబర్ల ఇళ్లలో అద్దెకు కూడా ఉండరు. ముఖ్యంగా ఏడు శబ్దంలో ఏడుపు ధ్వనిస్తుందని, కొందరు ఆ సంఖ్యను నోటితో పలకడానిక్కూడా ఇష్టపడక ''ఆరున్నొకటి'' అనడం వినే ఉంటారు.
ఆ సంగతి అలా ఉంచితే, 9 ని ఇష్టపడేవారు, 2 లేదా అంతకంటే ఎక్కువ నంబర్లు ఉన్నప్పుడు, వాటిని కూడగా వచ్చే సంఖ్య 9 వచ్చేట్లు చూసుకుంటారు. అలాంటి అంకెల్లో 108 ఒకటి. ఇతర నంబర్ల కంటే 108ని మరింత విశిష్టమైనదిగా భావిస్తారు. ఇంతకీ 108 ప్రత్యేకత ఏమిటో చూద్దాం.
మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. 4 దిక్కులు ఉన్నాయి. ఈ రెండింటిని హెచ్చిస్తే 108 వస్తుంది. అలాగే చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి 27 రోజులు పడుతుంది. సరిగ్గా 27రోజులు కాకున్నా 27 రోజుల పైన ఇంకొన్ని గంటలు పడుతుంది. దీన్ని 27 కిందే పరిగణిస్తారు.
108 సంఖ్యలో ఉన్న మరో విచిత్రం ఏమిటంటే, భూమికి, సూర్యుడికి ఉన్న దూరాన్ని 108తో విభాగిస్తే సూర్యుడి చుట్టుకొలత వస్తుంది. అలాగే భూమికి, చంద్రుడికి ఉన్న దూరాన్ని 108తో విభాగిస్తే చంద్రుడి చుట్టుకొలత వస్తుంది. భూమికంటే సూర్యుడు 108 రెట్లు అధికంగా ఉన్నాడు. ఆధ్యాత్మికంగా చూస్తే భక్తులు దేవునికి 108 యోజనాల దూరంలో ఉన్నారని చెప్తారు. ఆ దూరాన్ని తరిగించుకోవాలంటే ఇహలోక చింత విడిచిపెట్టాలి. ఇకపోతే మన శరీరంలో 108 లింకులతో కూడిన చెయిను జాయింట్లను కలుపుతుంది. ఇంకో విశేషం చెప్పాలంటే భారత నాట్య శాస్త్రంలో చేతులు, పాదాల కదలికలతో కూడిన 108 కరణాలు ఉన్నాయి.
కొన్ని ప్రత్యేక పూజల్లో 108 సుమాలతో పూజిస్తారు. 108 సంఖ్య విశిష్టమైందిగా భావిస్తారు కనుక ఒకే రకమైన పూలు 108, లేదా 108 రకాల పూవులు సేకరించి పూజ చేయడం ఆనవాయితీగా ఉంది.
అదీ సంగతి. 108 వెనుక ఇన్ని కారణాలు ఉండటాన ఈ సంఖ్య చాలామందికి ప్రియమైందిగా, ఆరాధ్యమైందిగా అయ్యింది.