జాతి రత్నాలంటే ఏవి? (Precious Stones)

 

జాతి రత్నాలంటే ఏవి?

(Precious Stones)

 

మనలో చాలామందికి రత్నాల ప్రాముఖ్యత ఏమిటో తెలీదు. అవి గొప్ప ఫలితాలను ఇస్తాయని తెలిసినప్పటికీ వాటి నాణ్యత గురించి అవగాహన ఉండదు. ఎవరికి, ఏ రత్నాలు అనుకూలమైనవో తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, సరైన జాతి రత్నాలను ఎంచుకోవడం మరో ఎత్తు. మన రాశి, రత్నాల వాశి రెండూ అనుకూలంగా గనుక ఉంటే గొప్ప ఫలితాలు వస్తాయి.

జాతిరత్నాలలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఎంతో మహత్తు ఉంది. ఇవి రాజును పేదగా, నిరుపేదను రాజుగా మార్చగలవు. ఆరోగ్యవంతులను జబ్బు మనుషులుగా, రోగములతో బాధపడుతున్నవారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చగలవు. జాతిరత్నాలను ధరించడం వల్ల దుష్ప్రభావాలు తొలగిపోతాయి. శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రాచీనుల దగ్గరినుండీ ఇప్పటి ఆధునికుల వరకూ మహారాజులు, ధనవంతులు మొదలు మామూలు వ్యక్తుల వరకూ ఎందరెందరో జాతిరత్నాలను ధరిస్తున్నారు.

జాతిరత్నాలను ధరించడమే కాదు, వాటిని భస్మం చేసి తినేవారు కూడా ఎందరో ఉన్నారు. అనుపాన బేధాలతో రత్నాలను ఉపయోగించి, శరీరం "కాయకల్ప సిద్ధి" పొంది మరింత బలవంతులు అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, దివ్యమైన తేజస్సు, మహా శక్తి సమకూరుతుంది.

మహర్షులు ఎంతో పరిశోధన చేసి అమూల్యమైన జాతి రత్నాలు గ్రహాలను అనుకూలంగా ఉండేలా చేస్తాయని, నిరంతరం ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు. పాశ్చాత్యులు సైతం జాతిరత్నాల గురించి చాలా పరిశోధన చేశారు. మేలిమి జాతి రత్నాలను ఎంచుకుని ధరించడం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా గొప్ప మేలు జరుగుతుందని తేల్చి చెప్పారు.

ముఖ్యమైన జాతి రత్నాలు

వజ్రం

వజ్రం కఠినంగా ఉంటుంది. ఇది చాలా ఖరీదైన, precious stone. వజ్రం స్వచ్చమైన తెల్లటి సూర్యకాంతితో తళుకులీనుతుంది. తెల్లటి వజ్రం ప్రసిద్ధమైనప్పటికీ, గులాబి, నారింజ, పసుపు, ఆకుపచ్చ, బూడిదరంగు, నీలం మొదలైన రంగుల వజ్రాలు కూడా ఉంటాయి.

పుష్యరాగం

పుష్యరాగంలోనూ రకాలు ఉన్నాయి. నీలం, పసుపు, గులాబి, నారింజ రంగుల పుష్య రాగాలు ఉన్నాయి.

కాంచనలత

ముదురు పసుపు రంగులో ఉంటాయి.

మరకతం

ఇందులో ఆకుపచ్చగా ఉంటే ఎమెరాల్డ్ అని, నీలాద్రిపచ్చలో ఉంటే అక్వామెరీన్ అని అంటారు.

వైడూర్యం ఇది పిల్లి కన్నును పోలి ఉంటుంది. కనుకనే కాట్స్ ఐ అంటారు.

తోరమల్లి

ఇవి గులాబీ ఎరుపులో ఉంటాయి. చాలా ఖరీదైనవి.

కురివిందం

వజ్రంలాగే కఠినంగా ఉంటుంది. ఇందులో కెంపు, మహా నీలం రకాలు ఉన్నాయి.

గరుడపచ్చ

ఆకుపచ్చ, పసుపుపచ్చ కలిసిన చిత్రమైన గరుడపచ్చతో ఆకర్షణీయంగా ఉంటుంది.

గోమేధికం

ఇందులో పద్మగంది రంగు, ముదురు కాషాయ రంగు ఉంటాయి.

విమలకం

ఇందులో సూర్యకాంతం అమూల్యమైంది.

సౌగంధిక

ఊదారంగులో ఉంటాయి.

రాగమాలిక

వీటిల్లో గులాబీ ఎరుపులో ఉండే రూబీ స్పైనెల్ విలువైనది.