గోవర్ధనగిరికి హనుమంతుడు చేసిన ఉపకారం ఏమిటి

 


గోవర్ధనగిరికి హనుమంతుడు చేసిన ఉపకారం ఏమిటి ?

 

సముద్రానికి వారధి ఏర్పడిన తర్వాత ఉత్తర సరిహద్దుల నుండి ఒక పర్వతమును తీసుకుని హనుమంతుడు వస్తుంటాడు. ఇంద్రప్రస్థం నుండి కొద్ది దూరము వచ్చేసరికి సేతు నిర్మాణము పూర్తయిపోయిందని తెలుస్తుంది.

అప్పుడు హనుమంతుడు " ఇక పర్వతము తీసుకొని వెళ్ళుటవలన ప్రయోజనమేమి? " అని అనుకుంటూ హనుమంతుడు ఆ పర్వతమును అక్కడే విడచిపెతాడు. కానీ, అది సాధారణ పర్వతము కాదు.

దాని ఆత్మ ప్రకటితమై “భక్త రాజా! నేను చేసిన అపరాధమేమి? మీ కరకమలముల స్పర్శను పొంది కూడా నేను భగవత్సేవా వంచితుడ నగుచున్నానే? నన్నిక్కడ విడువ వద్దు. భగవత్సమీపమునకు తీసుకుని వెళ్లి వారి శ్రీ చరణారవిందముల చెంత నుంచుము. లేదా నన్ను సముద్రగర్భములో పారవేయుము.భగవత్సేవ కుపయోగింపని జీవితమువలన ప్రయోజనమేమి?” అని హనుమంతుడిని వేడుకుంటుంది.

ఆ పర్వతం వేడుకలోని నిజం గ్రహించిన హనుమంతుడు “గిరిరాజా! నీవు వాస్తవమునకు గిరిరాజువే. నీ అంచంచల నిష్టను చూచుచుండ నిన్ను భగవత్సమీపమునకు తీసుకొని వెళ్ళవలె ననియె యున్నది. కానీ ఇక ఏ పర్వతమునూ తీసుకొని రావద్దని రామచంద్ర ప్రభువు ఆవాదేశించారు. అయిననూ నీ కొరకు భగవానుని ప్రార్థించెదను. వారి యాదేశానుసారము చేసెదను” అని చెప్పాడు.

అందుకు ఆ పర్వతం సంతోషిస్తుంది.

ఆలస్యం చేయకుండా అక్కడి నుండి హనుమంతుడు రాముడు దగ్గరికి వెళ్లి, పర్వతం వేడుక గురించి వివరిస్తాడు.

అది విన్న రాముడు " హనుమంతా! ఆ పర్వతము నాకు అత్యంత ప్రేమపాత్రమైనది.నీవు దానిని ఉద్ధరించినావు. ద్వాపర యుగములో నేను కృష్ణరూపములో దానిని ఉపయోగించు కొనెదనని చెప్పుము. ఏడురోజులపాటు దానిని నా వేలిమీద ఉంచుకొని ప్రజలను రక్షించెదను అని చెప్పు " అని హనుమంతుడికి చెప్తాడు.

ఆ మాట విన్న హనుమంతుడు సంతోషంగా పర్వతం దగ్గరికి చేరుకొని, రాముడు చెప్పింది చెప్పినట్టుగా వినిపిస్తాడు. అలా హనుమంతుడు వలన గోవర్ధనము భగవానునికి పరమ కృపాపాత్రమై, నిత్యలీలా పరికరమాయెను అని మనకు పురాణం తెలియజేస్తింది.