Hanuman in Rama Ravana Battle

 

రామ రావణ యుద్ధంలో హనుమంతుడు

Hanuman in Rama Ravana Battle

 

లంక నుండి వచ్చిన హనుమంతుడు శ్రీరాముని వద్దకు వెళ్ళాడు. సీతమ్మవారి జాడను తెలియజేసి, ఆమె సందేశాన్ని వివరంగా వినిపించాడు. అలా హనుమంతుడు చేసిన మహోపకారానికి సంతోషించిన రాముడు "ఇంత క్లిష్టమైన పనిని వేరెవ్వరూ సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు . నీ వంటి దూత మరొకరు లేరు. గాఢ ఆలింగనం కంటే నీకు నేనేం బహుమానము ఇవ్వగలను'' అని హనుమను కౌగిలించుకున్నాడు.

కొద్దిసేపు అందరూ చర్చించిన తర్వాత యుద్ధమునకు నిశ్చయించారు. లంకానగర స్వరూపాన్ని, భద్రతా ఏర్పాట్లను వివరంగా రాముడికి హనుమంతుడు చెప్పాడు.

శరణు జొచ్చిన విభీషణుని మిత్రునిగా ఆదరించమని హనుమంతుడు సలహా ఇచ్చాడు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకున్నది. వానరవీరులకు, రాక్షస సేనకు మధ్య మహాభీకరమైన యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేకమంది రాక్షసులు హనుమంతుని చేతిలో మరణించారు. అలా హనుమ చేత నిహతులైన రాక్షసులలో దూమ్రాక్షుడు, అకంపనుడు, దేవాంతకుడు, త్రిశిరుడు, నికుంభుడు వంటి మహావీరులున్నారు.

రావణుని శక్తితో మూర్చిల్లిన లక్ష్మణుని హనుమంతుడు జాగ్రత్తగా పక్కకు తీసికుని వచ్చాడు. తరువాత రాముడు హనుమంతుని భుజాలమీద ఎక్కి రావణునితో యుద్ధం చేశాడు. కుంభకర్ణుడు కూడా హతమైన తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధాటికి చాలామంది వానరులు హతులయ్యారు. రామ లక్ష్మణులు, మిగిలిన వానరసేన వివశులయ్యారు. వారిని విభీషణుడు, హనుమంతుడు వెదకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకుని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?'' అని అడిగాడు.

అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే గనుక వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్న మాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికియున్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమములో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది'' అని జాంబవంతుడు హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతము మీది సంజీవని ఓషధులను తీసుకురమ్మని హనుమను కోరాడు.

జాంబవంతుని కోరికపై హనుమతుడు రామచంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్ళి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్ని సమూలంగా ఎత్తిపట్టుకుని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామలక్ష్మణులూ, మిగిలిన వానరులూ స్పృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితు లయ్యారు. ఆపైన మళ్ళీ పర్వతాన్ని తీసుకుని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.

అనంతరం జరిగిన యుద్ధంలో లక్ష్మణుని చేతిలో ఇంద్రజిత్తు మరణించాడు. మరునాడు కూడా యుద్ధం కొనసాగింది. ఆ యుద్ధంలో రావణుని శక్తికి లక్ష్మణుడు మూర్చిల్లాడు.

రాముడు దుఃఖితుడయ్యాడు. సుషేణుని కోరికపై హనుమంతుడు మరలా హిమాలయ పర్వతాల్లోని ఔషధ మొక్కలతో కూడిన సంజీవనీ పర్వతాన్ని పెకిలించుకుని తీసుకువచ్చాడు. అప్పుడా ఔషధులను ప్రయోగించి సుషేణుడు లక్ష్మణుని స్వస్థునిగా చేశాడు.

ఆపై జరిగిన భీకర సంగ్రామంలో రామునిచేత రావణుడు అంతమయ్యాడు.

యుద్ధానంతరం రాజ్యాభిషిక్తుడైన విభీషణుని ఆజ్ఞతో హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతకు విజయ వార్త చెప్పాడు. సీత అగ్ని ప్రవేశానంతరం సీతారామ లక్ష్నణులు అయోధ్యకు వచ్చారు. వైభవంగా పట్టాభిషేకం జరిగింది.

శ్రీరాముడు సీతకొక నవరత్నాలు పొదిగిన ముత్యాల హారాన్ని ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒక జత గొప్ప నిలువైన వస్త్రాలు, గొప్ప ఆభరణాలను హనుమంతునికి ఇచ్చింది. అంతటితో తృప్తి తీరక సీతమ్మ శ్రీరాముడు ఇవ్వగా తన మెడలో వేసుకున్న ముత్యాలహారాన్ని తీసి చేతబట్టుకుని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలుసుకున్న శ్రీరాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరాన్ని బహుమతిగా ఇవ్వు'' అన్నాడు

శ్రీరాముడు అలా అనగానే, మరుక్షణం, సీతమ్మతల్లి ఆ ముత్యాలసరాన్ని హనుమంతుని చేతిలో పెట్టింది. ఆ హారాన్ని చేతబట్టిన హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్లమబ్బులా ప్రకాశించాడు.


hanuman fights in rama ravana war, rama bhakta hanuman, rama bantu hanuman, hanuman and srirama, sita presents pearl chain to hanuman, hanuman and mutyalasaram