Hanuman brings out from Shani
హనుమంతుని పూజిస్తే శని పీడ వుండదు
Hanuman brings out from Shani
లక్ష్మనాదులు మైరావణునితో యుద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో అనుకోని విధంగా లక్ష్మణుడు, కొంతమంది వానరులు మైరావణుని శరాఘాతాలకి మూర్చపోయారు. అప్పుడు ఏం చేయాలో పాలుపోక నిరుత్సాహంగా, దిగులుతో ఉన్న శ్రీరాముని వంక చూసిన హనుమంతుడు తన వంతు సహాయం కోసం, రామచంద్రుని ఆజ్ఞకోసం ఎదురుచూడ సాగాడు. అది గమనించిన రాములవారు, మునీశ్వరులు తదితరులు చెప్పిన విధంగా సంజీవని మూలికను తీసుకురమ్మని చెప్పారు. రామచంద్రుడు ఆజ్ఞాపించగానే హనుమంతుడు వాయువేగంతో ఆకాశమార్గానికేసి పయనమయ్యాడు.
దీన్ని గమనించిన రాక్షసుల కుల గురువు శుక్రాచార్యులవారు ఎలాగైనా సరే హనుమంతుని పయనాన్ని ఆపాలని నిర్ణయించుకున్నాడు.
కార్యసాధకుడు అని పేరుగల హనుమంతుడు గనుక సంజీవని మూలికను తీసుకువస్తే మూర్చపోయిన వారందరికీ తిరిగి శక్తి అపరిమితంగా వస్తుంది. ఇక వారితో తలపడటం ఎవరివల్లా కాదు అని దుర్భుద్ధితో నవగ్రహాల్లో అత్యంత భయాత్పాతకుడైన శనిని హనుమను ఇబ్బందిపాలు చేసి అతని కార్య సాధనకు భంగం కలిగించమని ఆజ్ఞ జారీ చేశాడు. గురువుగారు చెప్పడం ఆలస్యం శనీశ్వరుడు తన ప్రతాపాన్ని హనుమంతుని మీద ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా హనుమంతుడు తాను వెళ్ళిన ప్రదేశమంతా సంజీవని కోసం వెతికాడు. ఆ సంజీవని మూలిక ఏదో తెలీక మొత్తం పర్వతాన్నే పెకిలించుకుని ఆకాశ మార్గాన బయల్దేరాడు.
దీన్ని చూసిన శని హనుమంతుని మార్గమధ్యంలో ఆపి, తను రావణాసురుడు పంపగా వచ్చానని, ఈ పర్వతాన్ని తీసుకు వెళ్ళడానికి వీళ్ళేదని గొడవ చేశాడు. ఆ మాటలకు హనుమంతునికి విపరీతమైన కోపం వచ్చింది. కానీ తన ఆవేశాన్ని వెళ్ళగక్కకుండా నియంత్రించుకుంటూ రామనామజపం చేస్తూ తన పాదాలతో శనికి ఊపిరాడకుండా నొక్కి పెట్టాడు.
హనుమంతుని మహిమ తెలుసుకున్న శని చివరకు తను తప్పుగా అడ్డుకున్నానని, హనుమంతునికి క్షమాపణలు చెప్పి తనను వదిలేయమని ప్రాధేయపడ్డాడు. తప్పు తెలుసుకుని బాధ పడుతున్న శనిని హనుమంతుడు విడిచిపెడుతూ ... కొన్ని షరతులు పెట్టాడు.
ఎవరైతే ప్రతిరోజూ మూడుపూటలా రామనామ జపం జపిస్తుంటారో వారి జోలికి వెళ్ళకూడదు.
ఎవరైతే తనను ఎల్ల వేళలా పూజిస్తూ వుంటారో వారి జోలికి వెళ్ళటంకానీ, వారి మీద కనీసం శని చూపు కూడా పడటానికి వీల్లేదని ఆజ్ఞ జారీ చేశాడు. అందుకు శనీశ్వరుడు తన అంగీకారం తెలియజేస్తూ తనూ ఓ కోరిక కోరాడు.
శని ఆంజనేయుని కోరిన కోరిక ఏమిటంటే ....
హనుమంతుని దేవాలయం ఉండేచోట తన విగ్రహం ఉండాలి. ప్రతి శనివారం ఆంజనేయునితో పాటు తనకు అభిషేకాలు జరిగేలా చూడాలి. అప్పుడే భక్తుల పాలిట జాగ్రత్తగా వుంటానని తన కోరికను హనుమంతునికి చెప్పాడు.
హనుమంతుడు శని కోరికకు తధాస్తు పలికి శనీశ్వరుని ఆశీర్వదించి పంపాడు.
అప్పట్నించి శనిదశ నడుస్తున్న వారు హనుమంతునితో బాటు శనీశ్వరునికి అభిషేకాలు చేయసాగారు. మామూలుగా భక్తులు ప్రతి శనివారం ఆంజనేయస్వామికి అభిషేకాలు, పూజలు చేయడం ఆచారం. అలా హనుమంతుని ఆరాధించడంతోబాటు శనిదేవునికి పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. అలా చేస్తేనే శని దేవుడు వారిపట్ల తన తీక్షణతను విరమిస్తాడని పురాణ కథనం
hanuman and sanjeevani moolika, hanuman and sanjeevani parvatam, hanuman temple and shani mahadev, hanuman and shani abhishekam, hanuman puja and shani puja on saturdays