గోవర్థన పూజ
గోవర్థన పూజ
కార్టీక శుక్ల పాడ్యమి, అంటే దీపావళి మరునాడు గోవర్ధనపూజ ఆనాడు శ్రీకృష్ణుని పూజించి, అందరూ తమ తమ ఇళ్లలో చేసి తీసుకువచ్చిన పదార్థాలని ఒక రాశిగా పోసి, బాలకృష్ణునికి నివేదన చేసి సమంగా పంచుకుని తింటారు. ఇది ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గోవర్థన పర్వతాన్ని ఎత్తిన సందర్భాన్ని గుర్తు చేసుకుని పండుగ జరుపుకోవడం. శ్రీకృష్ణుడు సుమారుగా ఏడు సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు గోకులంలోని వారందరూ నందుని చేరి ఇంద్రయాగం చేయవలసిన సమయం ఆసన్నమయిందని గుర్తు చేస్తారు. అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు "ఇంద్రయాగం శాస్త్ర సమ్మతమా? లోకాచారమా? చేయవలసిన అవసరం ఏమి?'' అని ప్రశ్నిస్తాడు.
"ఇంద్రుడు మేఘాలకి అధిపతి అతడు సంతసించినట్లయితేనే వర్షాలు పడి, పంటలు పండుతాయి, గడ్డి పెరిగి పశుసంపద వృద్ధి చెందుతుంది, అప్పుడే మనుషులకు ఆహారం ఉంటుంది. దేవతలను యజ్ఞయాగాదులతో తృప్తి చెందించటానికి వీలవుతుంది'' అని నందుడు చెపుతాడు. దానికి కృష్ణుడు "కర్మాచరణం వలన మాత్రమే మానవుడు పుట్టటం, పెరగటం అన్నీ జరుగుతున్నాయి. మానవుల సుఖదుఃఖాలకి కర్మయే కారణము. అందువలన అందరూ కర్మాచరణం చేయాలి'' అని చెపుతాడు. ఆపైన "ఏదైనా వేడుక చేయాలనుకుంటే గిరిపూజ చేయండి. బ్రాహ్మణులకు దక్షిణలివ్వండి, గోవులను పూజించి వాటికి మంచి కసవులివ్వండి. అందరికీ మంచి ఆహారం ఇచ్చి సంతృప్తి పరచండి. గ్రామీణులు, బోయలు, జంతువులతో సహా'' అని సూచక కూడా ఇస్తాడు.
కృష్ణుడి సూచన మేరకి యాదవులు గోవర్థనపర్వతాన్ని పూజించగా ఇంద్రుడు కోపించి వాన కురిపిస్తే, ఆ ధాటికి తాళలేని బృందావన వాసులనందరినీ, గోవులనూ, వత్సములనూ, వృషభములనూ పర్వతమును గోడగా ఎత్తి రక్షించాడు ఏడు రోజులపాటు. ఇంద్రుడు కూడా తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి శ్రీకృష్ణుని శరణు కోరాడు. ఇదీ భాగవతంలోని కథ. ఇది కృష్ణుని గొప్పతనాన్ని తెలియ చెప్పే కథ అనుకుంటాం. కానీ ఇందులో సామాజిక, పర్యావరణ స్పృహ ఉండటం వల్లనే ఈ నాటికీ పండుగ చేసుకుని గుర్తించుకోవలసింది అయింది.
ఏడేళ్ళ బాలుని మాట వృద్ధులు వినటం, శాస్త్రసమ్మతం కాని ఆచారాలను మానెయ్యమనటం, సోమరితనం వదిలి కష్టపడాలనే బోధ, కర్మ - అంటే పనిచెయ్యటం - ప్రాధాన్యం ఈ నాటికీ కాదు ఏనాటికీ అందరూ గుర్తించుకోవలసిన అంశాలు. ఇంకా ... గోవర్థనము అంటే గోవులను వృద్ధి చేయునది. పర్వతం ఉండటం వల్ల మేఘాలు ఆగి వర్షాలు పడతాయి. వర్షాలతో గడ్డి పెరుగుతుంది. గో సంపద పెరుగుతుంది. వృషభాలు బాగుంటే వ్యవసాయం బాగుండి పంటలు బాగుంటాయి. అట్టి గోవర్థనమును ఉద్దరించటం అంటే పాడి, పంటలను మెరుగు పరచే పర్యావరణమును పరిరక్షించటం. బ్రాహ్మణులనే కాక అందరినీ ఆహారంతో సంతృప్తి పరచమానటం, కుక్కలు మొదలియన్ జంతువులకి కూడా రుచికరమైన పిండివంటలు పెట్టమనటం, అందరు తెచ్చిన ఆహారం రాసి పోసి సమంగా తినటం సర్వప్రాణి సమత్వాన్ని అభ్యాసం చేయటమే.
- డా. అనంతలక్ష్మీ