Read more!

ప్రాణం దక్కించుకునేకంటే పోరాడటమే మేలు!

 

 

ప్రాణం దక్కించుకునేకంటే పోరాడటమే మేలు!

 

 

 

 

వరం ప్రాణోచ్ఛేదః సమదమఘవన్ముక్త కులిశ

ప్రహారై రుద్గచ్ఛద్బహుల దహనోద్గార గురుభిః ।

తుషారాద్రేఃసూనో రహహ పితరి క్లేశ వివశే

న చాసౌ సంపాతః పయసి పయసాం పత్యురుచితః ॥

ఒకప్పుడు పర్వతాలన్నింటికీ రెక్కలుండేవట. కానీ ఆ రెక్కలతో అవి ఎగరడం చూసి ముల్లోకాలలోని ప్రజలూ భయభ్రాంతులైపోయేవారు. పర్వతాలకీ అతిశయం పెరిగిపోయింది. దాంతో స్వయంగా ఆ ఇంద్రుడే రంగంలోకి దిగి తన వజ్రాయుధంతో పర్వతాలకి ఉన్న రెక్కలని ఛేదించడం మొదలుపెట్టాడు. ఆ దండయాత్రలో హిమవంతుడు అనే పర్వతరాజు సమయం వచ్చింది. ఇంద్రుడు హిమవంతుని వెంబడించి అతని రెక్కలని కాస్తా కత్తిరించివేశాడు. ఆ హిమవంతునికి మైనాకుడు అనే కుమారుడు ఉన్నాడు. తన తండ్రి ఓటమిని చూసిన ఆ మైనాకుడు, ఇంద్రుని బారి నుంచి తప్పించుకొనేందుకు సముద్రంలో దాక్కొన్నాడు. అలా సముద్రంలో దాక్కోవడం వల్ల మైనాకుని ప్రాణం నిలిచి ఉండవచ్చుగాక! కానీ తన తండ్రిని గాయపరిచినవాడినీ, తన రెక్కలను కత్తిరించాలనుకున్నవాడినీ ఎదిరించి నిలబడటం ధీరుని లక్షణం కదా అంటాడు శతకకారుడు. అంటే తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు పారిపోవడం కంటే వీరునిలా పోరు సలిపి మరణించడం మేలన్నది కవి భావన.