శివుడు గరళకంఠుడు ఎలా అయ్యాడు ?

 

రాక్షసులతో విసిగిపోయిన దేవతలు, శివుడు, బ్రహ్మ వెంట రాగా విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, తమ కష్టాలన్నీ మొర పెట్టుకున్నారు. అంతా విన్న విష్ణువు "ప్రస్తుతం రాక్షసులు బలంగా ఉన్నారు కనుక వారితో కలహానికి పూనుకోవద్దని, క్షీర సాగర మధనమే పరిష్కారమని" చెప్తాడు.

సముద్రాన్ని చిలికేందుకు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని తాడుగా ఉపయోగించమని సూచించాడు. క్షీర సముద్ర మధనం పూర్తయ్యాకవచ్చే అమృతాన్ని సేవించి బలాన్ని పుంజుకోమని, క్లేశాలు రాక్షసులకు మిగులుతాయని భవిష్యత్తును వారి కళ్ళకు కట్టినట్టు చెప్పాడు.

అది విని సంతోషించిన దేవతలు అమృతం కోసం క్షీరసాగర మధనానికి పూనుకుంటారు. ఈ కధ భాగవతంలో, రామాయణం బాలకాండలో, మహాభారతం ఆది పర్వంలో, కొన్ని పురాణాల్లో లిఖితమైంది. క్షీరసాగర మధనంలో అమృతం కంటే ముందు హాలాహలం ఉద్భవించింది. దాన్నేం చేయాలో బోధపడక దేవతలు ఆందోళన చెందుతున్న తరుణంలో శివుడు ఆ సమస్యను పరిష్కరించాడు.

గరళాన్ని ముద్దలా చేసి అమాంతం మింగేశాడు. పైగా గళంలోనే నిలిపాడు. అలా గరళకంఠుడు అయ్యాడు. మహాశివుడు హాలాహలాన్ని ముద్దలా చేసి సేవిస్తుండగా కొద్దిగా జారి కింద పడింది. దాన్ని తేళ్ళు, పాములు లాంటి సర్ప జాతులు మింగి కొండెము, కోరల్లో దాచుకున్నాయి. హాలాహలంలో ఇంకొంచెం భాగం సముద్రజలంలో మిగిలిపోయింది.

సాగర కెరటాల్లో కనిపించే నురుగు ఆ హాలాహల ఫలితమేనని, క్షీరసాగర ప్రభావం వల్ల సప్త సముద్రాల జలాలూ కలుషితం అయ్యాయని పురాణ కధలు వివరిస్తున్నాయి.