గంగతో వెలసిన గౌరీశుడు!

 

గంగతో వెలసిన గౌరీశుడు!


మన దేశంలో వెలసిన దేవాలయాలకు గొప్ప చరిత్ర ఉంటుంది. జాగ్రత్తగా గమనించి తెలుసుకుంటే.. ఆలయాల నిర్మాణం, అవి రూపు దిద్దుకోవడం వెనుక కూడా అద్భుతమైన సంఘటనలు ఉంటాయి. 600 సంవత్సరాల క్రితం నటి ఓ ఆలయ విశేషం ఇదీ….


విశాఖ జిల్లాలోని చోడవరంలో ప్రసిద్ధి గాంచిన అతి పురాతన దేవాలయం స్వయంభూ శ్రీ గౌరీశ్వరస్వామి దేవస్థానం. సుమారు 600 సంవత్సరాల క్రితం గౌరీశ్వరుడు అనే రాజు నిత్యం శివారాధన చేసేవాడు. ఒకరోజు రాజుగారి కలలో ఈశ్వరుడు కనిపించి, "రాజా! నీ భక్తికి సంతోషించి నీ కోటకు తూర్పున గంగాదేవితో కలసి గౌరీశ్వరుడనై వెలసి ఉంటాను. నేను ఉన్న  స్థలం ఎల్లప్పుడూ నీటితో ఉంటుంది" అని చెప్పాడు.


రాజు మరునాడు ఆ స్థలాన్ని గుర్తించి త్రవ్వించగా చుట్టూ గంగతో కూడిన 4 అడుగుల ఎత్తయిన శివలింగం కనిపించింది. అదే రోజున ఆలయానికి సుమారు మైలు దూరంలో ఒక రైతు పొలం దున్నుతుండగా నంది విగ్రహం, ద్వారపాలకుల విగ్రహాలు కనిపించాయి. రైతు వెంటనే రాజుగారికి తెలియజేశాడు. రాజు ఆశ్చర్యపడి ఈశ్వర కృప లభించిందని ఆలయం నిర్మించి, నందీశ్వరుణ్ణి, ద్వారపాలకుల్నీ ప్రతిష్ఠించి నిత్యం స్వామి వారి చుట్టూ నీరు ఉండడం వల్ల గంగా గౌరీశ్వరుడు అనే పేరుతో నిత్యపూజలు, అభిషేకాలు నిర్వహించి భూవసతి కల్పించాడు.


అప్పటి నుంచి ఈ ప్రాంత వాసులకు కల్పతరువై, నమ్మిన వారికి కొంగు బంగారమైన స్వామి వారిపేరు వారి సంతతిలో ఒకరికి పెట్టసాగారు. చోళరాజుల పరిపాలనలో తురుష్కులు దండయాత్ర చేసి ఆలయాన్ని శిథిలం చేసి ఈశ్వర లింగాన్ని ఛిన్నాభిన్నం చేశారు. అప్పుడు నందీశ్వరుడు కోపంతో ఆ తురుషుణ్ణి కాలితో తొక్కి చంపాడట. తురుష్కులు ఇక ఆలయంలోకి ప్రవేశించలేక ఆలయ స్థలాన్ని కొంత ఆక్రమించుకున్నారు.


రాజుగారు ఆలయాన్ని తిరిగి నిర్మించి మరొక శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుని శివలింగం తెప్పించారు. కానీ రాజుగారికి ఈశ్వరుడు కలలో కనిపించి, 'వేరే ప్రతిష్ఠ వద్దు. పూర్వం లాగే నాకు అభిషేకాలు, పూజలు చేయ'మని ఆదేశించాడు. ఆలయ పునః నిర్మాణంలో సింహాచల ఆలయ నిర్మాణంలో మిగిలిన శివావతారం, రామలీల, కృష్ణలీలలు ఉన్న నల్లరాతి స్తంభాలను, దేవ పురుషులు వచ్చి ఆలయంలో (మండపంలో) ప్రతిష్ఠించారు. శివకేశవులకు భేదం లేదని తెలియజేశారు.


ఆలయంలో శివలింగం చుట్టూ ప్రతి ఉదయం సర్పం పడగ విప్పి ఉండడం చూసి నాగేశ్వరస్వామి అని కూడా పిలిచేవారు. 600 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయం భక్తులను ఆకర్షిస్తూ, దినదినాభివృద్ధి చెందుతోంది.

                                 ◆నిశ్శబ్ద.