Read more!

గణపతి ఆరాధన

 

గణపతి ఆరాధన

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే !!

అని ప్రతికార్య ప్రారంభము నందు గణేశస్తుతిగా ఈ శ్లోకమును పఠిస్తారు. విష్ణుమూర్తిని పీతాంబరధరుడని చెప్పినట్లు గణపతిని శుక్లాంబరధరుడిగా చెప్పుకుంటారు. నీలమేఘశరీరుడు విష్ణువైతే గణపతి శ్వేతవర్ణుడు. అంతేగాక గణపత్యనిపషత్తు గణపతిని

'త్వం చిన్మయః' అని వాజ్మయ స్వరూపునిగా హవామ హే
కవిం కవీనాము పమశ్రవస్తమమ్
జ్వేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనం శృణ్వన్నూతిభి స్సీద సాదనమ్.

మహాగణాధిపతయే నమః :-
దేవగణములకు అధిపతి కనుక గణపతిగా నిన్ను స్తుతించి, ఆహ్వానిస్తున్నాము. నీవు కవులలో కవివి. ఈ ప్రార్థనలను ఆలకించి
మమ్ము వెంటనే రక్షింతువు గాక. గణాధిపతివగు నీకు నమస్కారము. ఇది ఈ మంత్రార్థము.

గణానాం పతిః గణపతిః :-
గణములకు అనగా సమూహములకు అధిపతి గణపతి.
సమూహమంటే ఏది? సమ్యగూహ్యతే ఏకత్రేతి - సహూహః ఒక దిక్కున అన్నీ లెస్సగా ఊహింపబడేది సమూహమనబడుతుంది. ఈ సమూహాన్నే 'నివహ' మని అంటారు. తన సంబంధమైన వస్తువులను మిక్కిలి ఏకత్వమును పొందించేది నివహము. కనుక ఇక్కడ సమూహములను (తన సంబంధమైన వారిని, దేవాదులను) పాలించు పరమాత్మ 'గణపతి', అనగా సర్వవిధ గణములకు సత్తా స్ఫూర్తుల నొసగే పరమాత్మయే గణపతి.

ఒక కార్యమును ఆరంభించేటప్పుడు ముందుగా గణాధిపతి పూజ చేయిస్తారు. ఒక ఆకులో పసుపును ముద్దగా చేసి, లింగాకారంలో ఉంచి అందులో గణపతిని అధిష్ఠానం చేస్తాం. ఇలా అధిష్ఠానం చేయబడిన గణపతినే 'గణానాం త్వా' అనే మంత్రంతో ఆరాధిస్తాము.

'బింబే స్మిన్ సన్నిధింకురు, స్థిరభవ, వరదోభవ' ఈ బింబమున వాసమేర్పరచుకుని, స్థిరముగా ఉండి మాకు వరములను అనుగ్రహించుమని ప్రార్థిస్తాము. తత్ఫలితంగా తలపెట్టిన కార్యము నిర్విఘ్నముగా కొనసాగుతుంది.

అధిష్ఠానమునకు ముందు ఆకులోన ఉన్నది కల్పిత వస్తువే (పసుపు ముద్ద) అధిష్ఠానమునకు తరువాత ఆ కల్పిత వస్తువునందు ఆ దేవతా శక్తి ఆవహింపబడుతున్నది. వినాయక విగ్రహమును తెచ్చి ఉనత్తాసనము పై ఉంచినప్పుడు ఆ వస్తువు కల్పిత వస్తువే. గణాధిపతి పూజచేసి, గణపతిని అధిష్ఠానము చేసినపుడే ఆ విగ్రహమునందు సత్త, స్ఫూర్తి ఏర్పడును. మనం ఉద్వాసన చెప్పునంతవరకూ సత్త స్థిరంగా ఉంటుందని భారతీయుల నమ్మకము.

కనుక కల్పిత వస్తువు తాలూకు ప్రభువు తదదిష్ఠాన దేవతే అనవచ్చు. ఆ ప్రభువే బ్రహ్మ. అట్లే శివ, విష్ణు, శక్తి మొదలైన ఏ దేవతలైనను బ్రహ్మరూపముగా చెప్పబడుతున్నారు. ఏ వస్తువు నందు ఏ దేవతను అధిష్ఠానము చేస్తామో ఆ వస్తువునందు ఆ దేవతా శక్తి స్థిరముగా ఉంటుంది. తిరుపతి క్షేత్రమున ఉన్న విగ్రహమునందు వేంకటేశ్వరుని అధిష్ఠానము చేసినందువలననే, తదధిష్ఠాన దేవతాశక్తి ఇప్పటికీ స్థిరంగా ఉంది కనుకనే నేటికిని లక్షలమంది ఆయనను ఆరాధించి ధన్యులవుతున్నారు.

అట్లే గణపతిని ఆరాధించునపుడు విఘ్నవినాశకత్వం, సిద్ధి, బుద్ధి అనే శక్తులను అధిష్ఠానము చేస్తారు. ఈ గణపతినే గజాననుడని అంటారు. గజాననుడనగా ఏనుగు ముఖము గలవాడు. ఇది లౌకికార్థము. వేదంతపరంగా చూస్తే సమాధి వలన యోగులు ఏ పరమతతత్త్వమును  పొందుతారో అది 'గ' అనే వర్ణ ప్రతిపాద్యము బింబము వలన ప్రతిబింబం ఉత్పన్నమైనట్లే కార్యకారణ స్వరూపము, ప్రణవాత్మకము అయిన ప్రపంచము దేని వలన ఉత్పన్నమగునో దానికి 'జ' అంటారు. దీనినే 'తత్త్వమసి' అనే వేదాంత మహావాక్య పరంగా అన్వయించుకొంటే 'త్వం' పదార్థాత్మకుడైన నరుడు గణపతి యొక్క పాదాదిపర్యంత దేహమనుకొంటే 'సోహం భావేన పూజయేత్' ఆ భగవంతుడే నేననే భావముతో ఆయనను అర్పించాలని చెప్పబడింది కనుక, 'తత్' పదార్థమయుడైన గణపతికి కంఠాది మస్తక పర్యంతము గజస్వరూపము. అనగా 'గజ', యోగశక్తి ద్వారా చేరుకొనడానికి ప్రయత్నించబడే బింబ ప్రతిబింబస్వరూపము అని తెలుస్తోంది. ఇక పాదాది మస్తక పర్యంతం గణపతి సమస్త దేహము 'అసి' పదార్థమగు అఖండరసము.

'శుక్లాంబరధరం' అనే శ్లోకముతో పాటుగా గణపతిని ఈ శ్లోకంతో స్తుతించడం ఆనవాయితీగా వస్తున్నది.
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం !
అనేకదంతం తం భక్తానా మేకదంత ముపాస్మ హే !!

ఇది విశేషమైన శ్లోకము. దీని భావమేమంటే - పర్వతరాజ పుత్రికయగు పార్వతి యొక్క వదన కమలమునకు సూర్యుని వంటివాడు. సూర్య కిరణాల శక్తి పద్మముల శోభకు కారణమైనట్లే గజాననుని నుండి ఉత్పన్నమగు శక్తి తల్లి పార్వతి ముఖ వర్చస్సునకు కారణమవుతున్నది. వ్యాసమహర్షి ధర్మసంస్థాపన నిమిత్తం వేదసారాన్నంతా మహాభారతమనే ఇతిహాస రూపమున అందించాలనే మహాత్కార్యమును తలపెట్టి గణపతిని లేఖకుడుగా (వ్రాయువానిగా) అంగీకరింపజేసాడు. న్యాయం, ధర్మం మొదలగువాని కొరకెంతటి త్యాగమునకైన మహాపురుషులు నిలబడతారనేది ఋజువు చేయుటకే గజాననుడు తనకు ప్రీతిపాత్రములగు రెండు దంతములలో ఒక దానిని పెరికి దానితో భారతమునంతా వ్రాసాడు. మహాభారతమున వేదసారమంతా ఉన్నందున 'పంచమవేద' అని పేరు కలిగినది.

ఏక శబ్దాత్మికా మాయా తస్యాః సర్వసముద్భవమ్ !
దన్తః సత్తాధర స్తత్ర మాయా వచన ఉచ్యతే !!

'ఏక'శబ్దము మాయా భోధకము. దంతశబ్దము 'మాయిక' బోధకమనేది మౌద్గల వచనము. మాయ, తన్మాయిక సంయోగము వలన గణపతి ఏకదంతుడని వ్యవహరింపబడుతున్నాడు. గజానునుడు 'వక్రతుండు' డని వంకరగ ఉండే తొండము కలవాడని చెప్పబడుతున్నాడు. వక్రం ఆత్మరూపం ముఖం యస్వసః వక్రతుండః, ఆత్మరూప ముఖము గలవాడు వక్రతుండుడని వ్యవహిరింపబడుతున్నాడు.

ప్రపంచమంతా మనస్సుకు, వాక్కునకు గోచరమైనది. కాని ఆత్మతత్త్వమైతే మనోవాక్కులకు గోచరము కానిది. కంఠమునకు క్రింది భాగము మాయతో కూడినది. విఘ్నేశుని వక్రమని చెప్పబడే మస్తకము బ్రహ్మవాచకము. అందుచేతనే ఇతడు వక్రతుండుడని చెప్పబడుతున్నాడు. వాగ్గేయ కారులలో ప్రసిద్ధులయిన దీక్షితులు గణపతిని 'ప్రణావస్వరూప వక్రతుండం' అని కీర్తించారు. గణపతికుండే వక్రతుండము ప్రణవస్వరూపమని చెప్పబడినది.

ఓం కారము సర్వమంగళకరము. వేదోక్తములగు సర్వకర్మలయందు, ఉపాసనాదులందు ముందుగా ఓంకారమునే ఉచ్చరిస్తారు. కాళిదాసు 'ప్రణవశ్ఛందసామి' వేదముల కాద్యము ప్రణావమని చెప్పెను. ఓంకారమును ముందుగ ఉచ్చరించి, ముందుగా గణపతిని ఆరాధించుట చేతను గణపతి ఓంకార స్వరూపుడని చెప్పవచ్చు.

'అ' కార, 'మ' కారముల కలయిక ఓంకారము. ఇందు ఆకారము బ్రహ్మ స్వరూపము, మాకారము శక్తి స్వరూపము. ఈ బ్రహ్మ శక్తిస్వరూపముల కలయిక వలన ఏర్పడే ఆనందగ్రంధి ఉకారము. ఆ ఉకార స్వరూపమే గణపతి.'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ' 'ఓం' అనే ఒక్క అక్షరమే బ్రహ్మ స్వరూపమనే ఈ మత్రార్థము నందు గణపతికి సమన్వయపరచి గణపతిని ప్రణావస్వరూపునిగా శంకరులు దర్శింపజేసారు.

గణపతిని విఘ్నేశ్వరుడు, విఘ్ననాయకుడని పూజిస్తాము. దీనిని నిరూపించే ఒక కథ ఉంది. తనకు విధించిన సత్కార్మాచరణ వలన విశుద్ధాన్తః కారణుడైన మానవునకు భగవత్తత్వ సాక్షాత్కారము కలుగుతుందనే ధర్మమును నిరూపించేది కథ. స్కన్ద, మౌద్గల పురాణములందు ఈ వినాయక మహిమను తెలుపు కథ ఇలా చెప్పబడినది. పూర్వము అభినందనుడనే ఒక రాజు ఇంద్రునకు ఆవిర్భాగము లేకుండా ఒక యజ్ఞమును చేయుట ప్రారంభించాడు. ఇది తెలిసి ఇంద్రుడు  కోపించి కాలపురుషుని పిలిపించి యజ్ఞభంగము చేయమని ఆజ్ఞాపించాడు. అప్పుడు కాలపురుషుడు విఘ్నాసుర రూపములో ఆవిర్భవించాడు.

కాలపురుషుడు అభినందునుని చంపి, దృశాదృశ్యరూపంగా అక్కడక్కడ సత్కర్మలను నాశము చేస్తుండేవాడు. వసిష్ఠాది మహర్షులప్పుడు బ్రహ్మను శరణుజొచ్చారు. బ్రహ్మ ఆదేశానుసారం వారందరు గణపతిని స్తుతించారు. కాలనాశము చేయగల సామర్థ్యము గలవాడు, విఘ్నవినాశకత్వ గుణ సంపన్నుడు అయిన గణపతి వారి ప్రార్థనను ఆలకించి కాలపురుషుని పరాజయము గావింపగా, అతడు గణపతి ఆధీనుడై ఆయనను శరణుపొంది, ఆయన ఆజ్ఞకు బద్ధుడై నడచుకొంటుండేవాడు. అప్పటి నుండి విఘ్నము గణపతి ఆధీనమై ఉంది కనుక మనం చేసే ప్రతి కార్యారంభమున విఘ్నములు కలుగకుండా ముందుగా గణపత్యారాధన చేస్తాము.

వినాయకునకు మరోపేరు 'మూషకవాహనుడు' ఎలుక వాహనముగా గలవాడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది. గణనాథుని వాహనమైన మూషికము పేరు అనింద్యుడు. అనింద్యుడనగా నిందపడనివాడు, గొప్పవాడు. అహంకారముతో కూడినవారికి మన భోగములను రహస్యంగా గ్రహించే సాధారణ మూషికంగా కనపడవచ్చు. అంటువంటి వారి అనింద్యుని గొప్పతనమును గ్రహించలేరు. భోగములందలి భోగములను భుజించేవాడుగా బ్రహ్మచే ఈశ్వరుడే మూషికరూపమున ఉండి మనుజులను నడుపుతున్నాడు. "భోక్తారం యజ్ఞతపసాం" అని అందుచేతనే చెప్పబడినది.

నారాయణ తీర్థులు కృష్ణలీలా తరంగిణి అనే గ్రంథమును 'మూషికవాహన మునిజనవంద్య' అనే తరంగముతో ప్రారంభించి ముందుగా గణపతి ధ్యానము చేసినవాడు. వాగ్గేయకారులగు దీక్షితర్ తాను రచించిన 'వాతాపి గణపతింభజేహం' అనే కీర్తనలో గణపతిని 'మూలాధార క్షేత్రస్థితం' అనగా మూలాధార క్షేత్రమున (కుండలినీ రూపమున) ఉండేవాడని వర్ణించారు.