గజరాజు గణపతిగా మారిన వైనం (Lord Ganesha)
గజరాజు గణపతిగా మారిన వైనం
(Lord Ganesha)
వినాయకుడు మనందరికీ ఆరాధ్య దైవం. పూజా మందిరంలో ఇతర దేవతలతోబాటుగా గణేశుని విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. గణపతి మరో పేరు విఘ్నేశ్వరుడు. ఏ పని తలపెట్టాలన్న అందులో ఎలాంటి విఘ్నాలూ కలక్కుండా గణపతిని పూజిస్తాం. ఇంతకీ గణపతి అనే పేరు ఎలా వచ్చింది? “గణం” అంటే సమూహం లేదా గుంపు అని అర్ధం. ఇప్పట్లా ఇళ్ళు, వాకిళ్ళు, నాగరికత తెలీని ప్రాచీనకాలంలో ఆది మానవులు గుంపులుగా, వర్గాలుగా జీవించేవాళ్ళు. నీటి వనరులున్న చోట, తల దాచుకోడానికి చెట్లు, కొండలు ఉన్న ప్రాంతాలను నివాసాలుగా చేసుకునేవాళ్ళు..
ఆ అటవీ ప్రాంతాల్లో సహజంగానే విష సర్పాలు, పులులు, సింహాలు లాంటి భయానక జంతువులూ ఉంటాయి కదా! ఆ క్రూర మృగాలను చూసి ఆదిమానవులు భయపడి ఉంటారు. అయితే అనవసరంగా ఎవరికీ హాని తలపెట్టని ఏనుగులు తారసపడినప్పుడు ఆశ్చర్యంలో మునిగి ఉంటారు. మెత్తగా, సాధు జంతువుల్లా వేటి జోలికీ వెళ్ళకుండా, తమ మానాన తాము ఉంటూనే , అవసరమైనప్పుడు శత్రుమూకను గజగజలాడిస్తూ, మట్టి కరిపించే గజరాజుల గాంభీర్యం, శక్తీ సామర్ధ్యాలు అతిశయానికి లోనుచేసి ఉండొచ్చు. ఆ ఆశ్చర్యం ఆనందంగా మారి క్రమంగా ఆదిమానవులకు ఏనుగులపట్ల ఆరాధనాభావం ఏర్పడి ఉంటుంది.
ఏనుగులు తమకు హాని తలపెట్టకుండా ఉండేందుకు, ఆదిమానవులు వాటితో ప్రేమగా, అనునయంగా ఉండి ఉంటారు. ఏనుగుల సామర్ధ్యం తమకూ ప్రాప్తించాలని కోరుకుని ఉంటారు. పులులు, సింహాలు, భయానక విష సర్పాల నుండి తమకు హాని కలకూడదని, గజాలను ప్రార్థించడం ప్రారంభమయ్యుంటుంది. అలా ఆదిమానవుల గణాలు ఏనుగులను పూజించడం మొదలై ఉంటుందని, ఆవిధంగా వినాయకుడి రూపకల్పన జరిగిందని పెద్దలు చెప్తారు. గణాల చేత పూజలు అందుకున్నందువల్లనే ‘గణ’పతి అయ్యాడని అంటారు. గణపతి నామ సార్ధక్యం అదన్నమాట.
“గణా”లను “వ్రాత”లుగా కూడా వ్యవహరిస్తాం కనుక “గణపతి”కి “వ్రాతపతి” అని కూడా పేరు ఉంది. గణపతి పూజ ఉత్తర భారత దేశంలో మొదలై నెమ్మదిగా దక్షిణ దేశానికి వ్యాపించింది అంటారు. “తిరుక్కురల్”, “మణిమేకలై” తదితర తమిళ ప్రాచీన గ్రంధాల్లో గణపతి ప్రస్తావన కనిపించదు. అసలు పల్లవ రాజులకు ముందు వినాయక విగ్రహాలు కనిపించవు. అందువల్ల వినాయకుడు కేవలం ద్రావిడులకు మాత్రమే దైవం కాదని రుజువవుతోంది.