ఏకలింగ్ జీ కైలాస్ పురి రాజస్ధాన్

 

ఏకలింగ్ జీ  కైలాస్ పురి  రాజస్ధాన్...!

 


ఏకలింగ్ జీ రాజస్ధాన్ లో ప్రసిధ్ధ పుణ్య క్షేత్రం.  ఏకలింగ్ అంటే మహా శివుడు. ఆయనకాపేరు ఎలా వచ్చిందో తెలియదుగాని, బహుశా అందరినీ కాపాడే భగవంతుడు ఆయన ఒక్కడే అనే ఉద్దేశ్యంతో వచ్చి వుండవచ్చు.  ఈయన మేవాడ్ రాజ్యంలో మహారాణాల ఆరాధ్య దైవం.  వారికి ఈయనమీద అపరిమితమైన భక్తి. ఎంత భక్తి అంటే అసలు అధినేత ఆ ఏకలింగ్ జీనేనని, తాము ఆయన ప్రతినిధులుగా రాజ్యం చేసేవారు.  అందుకే వారిని రాజులు అని కాకుండా దీవాన్ లనేవాళ్ళు. యుధ్దాలకి వెళ్ళేటప్పుడు, ఇతర ముఖ్యమైన సమయాల్లో ఈ దేవుణ్ణి పూజించి, ఈయన ఆశీర్వాదం తీసుకుంటేగానీ బయల్దేరేవారు కాదు.  బహుశా ప్రపంచంలోనే శివుణ్ణి పాలించేవాడుగా భావించి, రాజులు తాము ప్రతినిధులుగా పరిపాలించిన రాజ్యం ఇది ఒకటే కావచ్చు.  

 

ప్రస్తుతం రాజకుటుంబీకులు ..  ఏకలింగ్ జీ ట్రస్టు .. అని ఒక ప్రైవేట్ ట్రస్టు ఏర్పాటు చేసి దాని ద్వారా ఆలయ నిర్వహణ చేస్తున్నారు.  ఇది రాజ కుటుంబీకుల వ్యక్తిగత ఆలయం.  రాజ్యాధికారాలు పోయినా, ఇప్పటికీ ఈ ఆలయం వారి స్వంతమే.  ఈ ఆలయానికి, దేవుడికి  సంబంధించిన ప్రతి ఖర్చూ మహారాణానే పెట్టుకుంటారు.  వీరు భక్తులనుంచి ఎటువంటి సహాయమూ ఆశించరు.  భక్తులు ఎవరైనా, వారి సంతోషంకొద్దీ కానుకలు ఏమైనా హుండీలో వేసినా వాటిని వేరే ధార్మిక కార్యక్రమాలకి ఖర్చు పెడతారుగానీ, ఈ గుడి కోసం, దేవుడి కోసం ఖర్చు పెట్టరు.  వీటికి లెక్కలు కూడా వేరే వుంటాయిట.

 

అందుకే ఇక్కడి పూజలు కూడా మహారాణా చేసినట్లే జరుగుతాయి.  గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం వగైరా చెయ్యటానికి రాజ కుటుంబీలకు, అక్కడి పురోహితులకు మాత్రమే అవకాశం వున్నది.  మిగతావారంతా బయట మండపంలోంచే దర్శనం చేసుకోవాలి.  ముఖ్యమైన రోజుల్లో రాజకుటుంబీకులు స్వయంగా పూజల్లో పాల్గొన్నా, నిత్య పూజలు వారిచే నియమించబడిన  అర్చకులు చేస్తారు.  అప్పుడు కూడా పూజ ప్రారంభించటానికి ముందు తాము పూజలు మహారాణా పేరుమీద ఆయన తరఫున చేస్తున్నామని సంకల్పంలో చెబుతారు.  పూజ చివరలో మహారాణా కోసం శివుడి ఆశీర్వాదం  తీసుకుంటారు.  

ఆలయం:
ఆలయం బయటనుంచి ఎక్కువ ఏమీ కనిపించదు.  చుట్టూ ఎత్తయిన ప్రహరీ గోడ వున్నది. రాజద్వారం దాటగానే సెక్యూరిటీ.  లేడీస్ హేండి బేగ్ కూడా తీసుకెళ్ళనివ్వలేదు  లోపలకి .. ఇంక కెమేరాలు, సెల్ ఫోన్ల మాటే వుండదు.  అక్కడే లాకర్లు వున్నాయి.  వాటిలో పెట్టి తాళం వేసి, తాళం చెవి మనం తీసుకెళ్ళాలి.  కాళ్ళకి వేసుకున్న సాక్స్ కూడా తీసెయ్యమన్నారు.

 

ఈ ప్రాంగణంలో చిన్న చిన్న ఆలయాలన్నీ కలిపి 108 వున్నాయిట.  ప్రదక్షిణ మార్గంలో ఉపాలయాలు చిన్నవీ, పెద్దవీ చాలా వున్నాయి.  అన్నింటికీ గోపురాలు.  ప్రహరీకి ఆనుకుని వున్న ఉపాలయాల్లో నవదుర్గ, గంగేశ్వర్, ఉజ్జనేశ్వర్ జీ, ఇంకా చాలా వున్నాయి.  కొన్నింటికి పేర్లున్నాయి, కొన్నింటికి లేవు.  2వ వరస ఉపాలయాలు బయటకి వచ్చేటప్పు డు చూశాను.  ముందు వాటికన్నా కొంచెం పెద్దవి.  ఆలయంలో స్వామికి కుడి వైపు వున్నవాటిలో శివుడు, గణేష్ వగైరా వున్నాయి. ఎడమవైపు అడ్డుకట్టారు.  అందుకు వెళ్ళలేదు.  కానీ ముందువైపునుంచీ దోవ వున్నదిట.  

ఆలయ శిఖరం ఎత్తు 50 అడుగులు, చుట్టు కొలత 60 అడుగులు వున్నదట.  ఆలయానికి నాలుగువైపులా నాలుగు గేట్లు.  మేము వెళ్ళినప్పుడు ఒకటే తీసి వున్నది.  ఆలయ నిర్మాణానికి చలువ రాయి, ఇసుక రాయిలు ఉపయోగించబడ్డాయి.   ఆలయం పక్కనే రెండు చెరువులు ..  కర్జ్ కుండ్, తులసీ కుండ్ .. వున్నాయి.  వీటి నీటినే స్వామి సేవలకి ఉపయోగిస్తారు.

 

ఆలయానికి ముందున్న మండపంలో పెద్ద ఇత్తడి నంది వున్నది.   ఈ నంది మీద ఆభరణాలు వగైరా శిల్ప చాతుర్యం లేదుగానీ, ఒక విశేషం కనిపించింది.  నంది మెడలో కొంచెం పెద్ద గంట వుంది.  అది ముందున్న పళ్ళెంలోని ఫలాల మీద పెట్టబడి వున్నది.  ఆ ఇత్తడి నంది ముందు నల్లరాతి నంది వున్నది. కానీ దానిని అంతా మెష్ తో కప్పి వుంచారు.  ఇత్తడి నంది వెనుక నిలువెత్తు విగ్రహం  ఆలయ నిర్మాత బప్పా రావల్ దిట.

ఆలయానికి వున్న వెండి తలుపుల మీద గణేష్, కార్తికేయుడి మూర్తులు చెక్కబడ్డాయి.  గర్భ గుడికి రెండు మండపాల ఇవతల వెండి గేట్ వున్నది.  దానికి ఇవతలనుంచే ఏ భక్తులయినా దర్శనం చేసుకుని వెళ్ళాలి.  లోపలకి ఎవరికీ ప్రవేశం లేదు.  భక్తులు దర్శనం చేసుకునే మండపం గుండ్రంగా ఎత్తుగా వున్నది.  పై కప్పు మధ్యలో నాట్యగత్తెల శిల్పాలు చెక్కబడ్డాయి.

 

మూల విరాట్ నల్ల రాతి విగ్రహం.  ఇక్కడ శివుడు లింగ రూపంలో వుండడు.  నాలుగు ముఖాలతో వుంటాడు.  నాలుగు ముఖాలూ నాలుగు దిక్కులు చూస్తూ వుంటాయి.  ఉత్తరం వైపు ముఖం విష్ణు, తూర్పు వైపు సూర్యుడు, దక్షిణం రుద్రుడు, పశ్చిమం  బ్రహ్మ స్వరూపాలు.   గర్భగుడిలో ఇంకా శివ లింగం, దానిని చుట్టుకుని వెండి పాము, పార్వతి, గణేష్, యమున, సరస్వతి విగ్రహాలు వున్నాయి. వీటన్నింటినీ నేను వివరంగా చూడలేక పోయాను దర్శనానికి తక్కువ సమయం వుండటంవల్ల. తర్వాత వివరాలు సేకరించాను.

బయటకి వచ్చాక స్వామి కుడివైపు కొంచెం పెద్ద ఉపాలయం కనబడితే వెళ్ళాము అమ్మవారిదనుకుని. అది జగదీష్ మందిర్.  అంటే విష్ణు మందిరం.  ఆలయంలో జగదీష్ చతుర్భుజుడు.  కుడి చేతిలో పైన గద, కింద చేతిలో ఉధ్ధరిలాంటిదేదో వున్నది .. సరిగ్గా తెలియలేదు, ఎడమ చేతిలో పైన చక్రం, కింద శంఖం వున్నాయి.  దాదాపు 5 అడుగుల సుందర విగ్రహం.  ముందు గరుక్మంతుడికి చక్కని మండపం. స్వామి ఆలయం, ఈ మండపం మీద చక్కని శిల్పాలు చెక్కబడి వున్నాయి.  గరుక్మంతుడు కూర్చున్నట్లు పెద్ద విగ్రహం.  కాళ్ళకింద పాములున్నాయి.  (ఇలాంటి విగ్రహాలు మనవైపు వుండవు) ఇలాంటి గరుక్మంతుడి విగ్రహం ఇంకొంచెం పెద్దది ఉదయపూర్ లో జగదీష్ మందిర్ లో చూశాను. ఫోటో తీశాను.  

 

బయటకి వచ్చేస్తుంటే గుడిముందు (ఆలయ ప్రాంగణంలోనే) ఇంకొక ఆలయం.  ముందు చిన్న ఆలయంలో గణేష్, వెనుక పెద్ద ఆలయంలో దేవేశ్వర్ జీ మహాదేవ్.  ఈయనకి కూడా నాలుగు తలలు, రాతి శిల్పం.

భక్తుల రద్దీ చాలా ఎక్కువగా వున్నది.  దర్శనం సమయాలు తక్కువ అవటం వల్లనేమో.  అక్కడి వారందరికీ సమయాలు తెలుసుగనుక దానికి తగ్గట్లు వస్తారు.  ఇలాంటి సమయాలు మనకి తెలియదు.  ముందే తెలుసుకుని వెళ్తే ఇబ్బంది వుండదు.

దర్శనానికి ఆడవారికి, మగవారికి వేరు వేరు క్యూలు.  క్యూలో గుంపులుగా వెళ్తారు ఒకరి వెనక ఒకరు కాదు.  పైగా అక్కడివారు ఎక్కువ సేపు దేవుడి ముందు వుండరు.  అందుకని క్యూ తొందరగానే కదిలి దర్శనం తొందరగా అవు తుంది.  

ఆలయ చరిత్ర:
ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవటానికి ముఖ్యమైన ఆధారం 15వ శతాబ్దంలో రచించబడిన ఏకలింగ మహాత్మ్య.  దీని ప్రకారం ఏకలింగ్ జీ ఆలయం ప్రప్రధమంగా 8 వ శతాబ్దంలో రాజపుత్ రాజు బప్పారావల్ చే నిర్మించబడింది.  అయితే అప్పటి ఆలయం,  ప్రతిష్టించబడిన మూర్తి, ఢిల్లీ సుల్తాన్ల దాడిలో ధ్వంసమయ్యాయి.  తర్వాత 14వ శతాబ్దంలో రాజా హమీర్ సింగ్ ఆలయాన్ని పునరుధ్ధరించి విగ్రహ ప్రతిష్ట చేశారు.  15వ శతాబ్దంలో రాణా కుంభ ఈ ఆలయాన్ని పునర్నిర్మించటమేగాక విష్ణు ఆలయం కూడా నిర్మించాడు.  1460 లో ఈయన వేయించిన శాసనం ప్రకారం ఆయన తనని ఏకలింగ్ జీ సేవకుడినని చెప్పుకున్నాడు.

 

15వ శతాబ్దంలోనే మాల్వా సుల్తాను ఘియత్ షా మేవాడ్ రాజ్యం మీద దండెత్తి ఏకలింగ్ జీ ఆలయాన్ని తిరిగి ధ్వంసం చేశాడు.  రాణా కుంభ కుమారుడు  రాణా రాయ్ మల్, సుల్తానుని ఓడించి, బందీగా పట్టుకుని అతనిని విడిచి పెట్టటానికి సొమ్ము తీసుకున్నాడు.  దానితో ఆలయం పునరుధ్ధరించి ప్రస్తుతం వున్న మూర్తిని ప్రతిష్టించాడు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం అసలు 8వ శతాబ్దంలో నిర్మింపబడి అనేక దండ యాత్రలనెదుర్కొని, 15వ శతాబ్దంలో పునర్నిర్మింపబడింది.

దర్శన సమయాలు:
ఉదయం 4-30నుంచి 7-00 గంటల దాకా, 10-30 నుంచీ 1-30 దాకా, తిరిగి సాయంత్రం 5గం. నుంచి 7 గం.ల దాకా.  ఈ సమయాలు మారే అవకాశాలు వున్నాయి.  వెళ్ళదల్చుకున్నవారెవరన్నా దర్శన సమయం గురించి ముందు తెలుసుకోవటం మంచిది.

మార్గం:
ఉదయపూర్ కి సుమారు 20 కి.మీ. ల దూరంలో వున్న ఈ ఆలయానికి ఉదయపూర్ నుంచి బస్ లు వున్నాయి.

ఫోటోలు:
కెమేరా అసలు అనుమతించరు.  మిత్రులు శ్రీ అనిల్ రావుగారు పక్కనే వున్న గుట్ట ఎక్కి ఆక్కడికి కనిపించిన ఆలయం ఫోటోలు తీసుకొచ్చారు మరి మీకు చూపించాలిగా.

 

 

 

 

 

 

పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)