నవగ్రహ ఆలయం.. గౌహతి

 

నవగ్రహ ఆలయం.. గౌహతి

 


అస్సాం ఇదివరకు పేరు ప్రాగ్జోతిష్య పురం.   అస్సాంలో  నవగ్రహ ఆరాధన ప్రాచీన కాలంనుంచీ వున్నది.  పూర్వం అస్సాం జ్యోతిష్య శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికీ నెలవుగా వుండేది.  అందుకే అస్సాంకి ప్రాగ్జోతిష్యపురం అనే  పేరు వచ్చిందంటారు.  ప్రాక్ అంటే తూర్పు ప్రాంతం అని జ్యోతిష్య పురం అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రాముఖ్యాన్ని సంతరించుకుందిగనుక ప్రాగ్జోతిష్యపురం (eastern city of astrology) అన్నారు.


కాళికా పురాణం ప్రకారం బ్రహ్మ దేవుడు ఇంద్రలోకంతో సమానమైన నగరాన్ని సృష్టించాలని ప్రాగ్జోతిష్యపురాన్ని నిర్మించాడంటారు.  ఇక్కడ దేనికైనా ప్రామాణికంగా ఎక్కువ కాళికా పురాణాన్నే చెబుతారు. మానవుని జీవిత గమనాన్ని నిర్దేశించే నవగ్రహాలకి ఎంతో ప్రాముఖ్యత వున్నది.  గ్రహ సంచారాల వలన మనుష్యల జీవితాల్లో సుఖ దుఃఖాల సంఘటనలు ఏర్పడతాయని హిందువుల నమ్మకం.

 

మన దేశంలో ఏ ఆలయంలోనైనా నవగ్రహాలకి ఉపాలయాలుంటాయి.  పరిస్ధితులు బాగుండనివారు నవగ్రహాలకి నియమం ప్రకారం ప్రదక్షిణలు, పూజలు, దానాలు చేస్తారు. గౌహతిలో నవగ్రహాలకి ప్రత్యేకించి ఆలయం వున్నది.  ఉజాన్ బజార్ లో వున్న ఈ ఆలయం 18వ శతాబ్దానికి చెందినది. చిత్రాచల్, లేదా నవగ్రహ హిల్ గా పిలువబడే ఈ చిన్ని కొండ ఎక్కటానికి దాదాపు 25 మెట్లు ఎక్కాలి.

 

ఆలయం వర్తులాకారంలో ఎఱ్ఱ రంగులో వుంటుంది. సాధారణంగా ఏ ఆలయంలో చూసినా నవగ్రహాలకి ప్రత్యేక ఉపాలయం, దానిలో ఆ గ్రహాల విగ్రహాలు వుంటాయి.  చాలా కొద్ది చోట్ల నవగ్రహాలు భార్యలతోసహా, ఇంకా కొద్ది చోట్ల పరివార దేవతలతో సహా దర్శనమిస్తారు.  కానీ  ఇక్కడి విశేషమేమిటంటే నవ గ్రహాలు లింగ రూపంలో వుంటాయి.  

 

వర్తులాకారంలోవున్న గర్భ గుడిలో మధ్యలో సూర్యుడి స్ధానంలో ఒక లింగం, చుట్టూ మిగతా గ్రహాలు చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు లింగరూపంలో వాటికి నిర్దేశింపబడిన స్ధానాలలో ప్రతిష్టించబడ్డారు.  ప్రతి గ్రహానికీ ఆ గ్రహాన్ని సూచించే రంగు బట్ట కడతారు. ఇవన్నీ నేలమట్టంలోనే వుంటాయి.  వాటిమధ్య కేవలం ఒకరు నడవటానికి మాత్రమే ఖాళీ వుంటుంది. గుమ్మంలోంచి చూస్తే గర్భగుడి అంతా లింగాలతో కనబడుతుంది.

 

ఇక్కడా గర్భగుడిలో వెలుతురు వుండదు.  కరంటు వుందిగానీ, లైటు వెయ్యరు.  మాకు అస్సలు కనబడటంలేదంటే ఒక్క నిముషం లైటు వేసి తీసేశారు. ఉమానందనుంచి మేము వెళ్ళేసరికి చీకటి పడుతోంది అందుకే మాకు సరిగ్గా కనబడటంలేదని మళ్ళీ షిల్లాంగ్ వెళ్తూ ఉదయం వచ్చాము. అప్పుడూ అదే పరిస్ధితి. ఈ ఆలయాన్ని 18 వ శతాబ్దంలో అహోమ్ రాజు రాజేశ్వర సింఘ నిర్మించారు. తర్వాత 1923-45 మధ్య పునరుధ్ధరింపబడింది.

 

గ్రహ శాంతులకోసం పూజలు జరిపించుకుంటున్నారు కొందరు.  బ్రాహ్మణులు చాలామందే వున్నారు. బహుశా జపాలు వగైరా చేయించటానకి ఎక్కువమంది కావాల్సివస్తారుకదా, అందుకనేమో అనుకున్నాం.

దర్శన సమయాలు:
తెల్లవారుఝామున 4-30 నుంచీ రాత్రి 7-30 దాకా.  

తర్వాత మేము దర్శించింది స్త్రీలు ఎక్కువగా మోజుపడే చీరెల షాపు.  అక్కడ మూంగా సిల్కు వగైరా ప్రసిధ్ధి.  గవర్నమెంట్ షాపులో అయితే గ్యారెంటీ వుంటుందేమోనని అక్కడికి వెళ్ళాము.  ఎక్కువ రకాలు లేవు పైగా ధరలలో కూడా పెద్ద తేడా కనిపించక ఏమీ కొనకుండానే వచ్చేశాము

 

 

 

 

- పి.యస్.యమ్. లక్ష్మి 
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)