ఏడు తరాలు సంతోషంగా ఉండాలంటే ఈ పనులు తప్పక చేయాలట!
ఏడు తరాలు సంతోషంగా ఉండాలంటే ఈ పనులు తప్పక చేయాలట!
జీవితంలో ప్రతి మనిషి సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. పెద్దవారు చాలా వరకు తమ పిల్లలు ఎంతో సంతోషంగా ఉండటం కోసం ఎన్నో చేస్తుంటారు. చాలా వరకు పెద్దలు పిల్లల కోసం బాగా డబ్బు సంపాదించడం, ఆస్తులు కూడబెట్టడం వంటివి చేస్తుంటారు. చాలామంది తమ పిల్లల విషయంలో ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించాం అని చెబుతూ ఉంటారు. కానీ తరాలు సంతోషంగా ఉండాలంటే ఆస్తులు సంపాదించడం కాదు..కొన్ని పనులు చేయడం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెబుతోంది. గరుడ పురాణం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల ఏడు తరాలు సంతోషంగా ఉంటాయట. ఇంతకీ ఏడు తరాలు సంతోషంగా ఉండాలంటే ఏ పనులు చేయాలి? గరుడ పురాణం ఏం చెబుతోంది? తెలుసుకుంటే..
ఆహార దానం..
హిందూ మతం దానాన్ని చాలా గొప్ప కార్యంగా చెబుతుంది. ఆహారాన్ని దానం చేయడం ఒక గొప్ప దానంగా చెబుతుంది. తమ శక్తి మేరకు పేదలకు, అవసరమైన వారికి అన్నం పెట్టడం చాలా మంచిది. ఆహార దానం వల్ల కలిగే పుణ్యం కుటుంబంలోని గత పాపాలను, లోపాలను తొలగించి, ఏడు తరాల పాటు శ్రేయస్సును చేకూరుస్తుందని నమ్ముతారు.
ఇంటి దైవం ఆరాధన..
ప్రతి కుటుంబానికి కులదైవం లేదా కులదేవత ఉంటారు. గరుడ పురాణం ప్రకారం, కులదైవ పూజను ఎన్నడూ విడిచిపెట్టకూడదు. వారి అనుగ్రహమే వంశ పురోగతికి, కుటుంబ భద్రతకు కీలకం. అంతేకాకుండా మన పూర్వీకుల పట్ల గౌరవం చూపడం, వారికి దానధర్మాలు , శ్రాద్ధ కర్మలు చేయడం భవిష్యత్ తరాల శ్రేయస్సుకు అత్యవసరం.
మూగజీవుల సేవ..
గరుడ పురాణం జంతువులకు, పక్షులకు సేవ చేయడాన్ని చాలా ప్రాముఖ్యమైనదిగా చెబుతుంది. జీవితంలో కష్టాలను తగ్గించుకోవడానికి ఆహారం తయారు చేసినప్పుడు మొదటగా ఆవుక పెట్టాలి. అలాగే చివరగా కుక్కలకు ఆహారం పెట్టాలి. అలాగే పక్షులకు క్రమం తప్పకుండా ధాన్యాలు, చీమలకు పంచదార వేయాలి. వీలైతే చేపలకు పిండి ఉండలు వేయాలి. ఇలా చేయడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది.
దేవుడికి నైవేద్యం..
గరుడ పురాణం ప్రకారం జీవితంలోని అన్నీ భగవంతుని అనుగ్రహం వలనే లభిస్తాయి. అందువల్ల, ఆయనకు కృతజ్ఞత చెప్పుకోవడానికి అత్యంత సులభమైన మార్గం ఆయనకు నైవేద్యం పెట్టడమే. భగవంతుని ప్రత్యేక ఆశీస్సులు పొందాలంటే ముందుగా శుద్ధమైన, సాత్వికమైన ఇంట్లో వండిన ఆహారాన్ని భగవంతునికి నైవేద్యంగా సమర్పించి, ఆ తర్వాతే దానిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆహారానికి, సంపదకు ఎన్నడూ కొరత ఉండదు.
ధ్యానం, ఆత్మపరిశీలన..
మానసిక ప్రశాంతతకు, ఆలోచనల స్వచ్ఛతకు ప్రతిరోజూ ధ్యానం చేయడం అత్యవసరం. దైవంతో అనుసంధానమయ్యే ఈ ప్రక్రియ ఆధ్యాత్మిక బలాన్ని అందించడమే కాకుండా, ఇల్లంతా సానుకూల, ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా ఇస్తుంది.
పైన చెప్పుకున్న 5 పనులు ప్రతి రోజూ చేసే వారి ఇంట్లో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. అంతేకాదు.. ఇలా చేస్తూ ఉంటే.. ఏడు తరాలు సంతోషంగా ఉంటాయని చెబుతారు.
*రూపశ్రీ.