Read more!

మనిషి శరీరాన్ని ధర్మక్షేత్రం అని కృష్ణుడు ఎందుకు చెప్పడు!

 

మనిషి శరీరాన్ని ధర్మక్షేత్రం అని కృష్ణుడు ఎందుకు చెప్పడు!

కురుక్షేత్ర మహా సంగ్రామానికి ముందు కృష్ణుడు అర్జునుడి విషాదం, భయం పోగొట్టి యుద్దానికి సన్నద్ధం చేయడానికి బోధ చేస్తాడు. అదే గీతాసారంగానూ, భగవద్గీతగానూ ప్రాచుర్యం పొందింది. అయితే ఈ గీతాసారంలో కృష్ణుడు అర్జునుడితో మనిషి శరీరమే ధర్మక్షేత్రం అని చెబుతాడు. ఇలా అనడానికి కారణం ఏమిటి?? దీని అర్థం ఏమిటి?? తెలుసుకుంటే..

క్షేత్రం అంటే పొలం, భూమి అనే 5 అర్థాలున్నాయి. భూమిని నాగలితో దున్ని రైతు పంట పండిస్తాడు. సకల సాధనలకు ఈ శరీరమే సాధనం. శరీరం అంటే అస్థి మజ్జ రక్త మాంసాల పిండమైన 'స్థూల శరీరం' ఒక్కటే కాదు. పంచప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రి యాలు, మనస్సు, బుద్ధి కలిసి 'సూక్ష్మశరీరం' అంటారు. కారణ శరీరం అంటే సుషుప్తిలో (గాఢ నిద్ర) ఆనందం అనుభవించేది.

శరీర మాద్యం ఖలు ధర్మసాధనం, దేహే సరోగే తు న చా ర్థసిద్ధిః|
 అరుగతాం దార్ఘ్య మపీహ లబ్ధ్యం, సదౌషధం కాయపటుత్వసాదకమ్ || 
సంపాద్య వైద్యానుభవేన శాస్త్ర, కల్పాది సంసేవనయా రాసాయనమ్ | 
భుక్త్యాహికం పుత్రఫలం చ లబ్వా, దేహం త్యజే ద్యోగవశేన ముక్యై || 

"శరీరమే ధర్మసాధనం, రోగ భూయిష్ఠమైన శరీరంతో ఏ కోరికలూ నెరవేరవు. రోగాలు లేని బలమైన శరీరం కోసం ఔషధాలనూ, ఆయుర్వేద శాస్త్రానుభవంతో తయారు చేసిన రసాయనాదులనూ సేవించాలి. ఇహలోకంలో భోగాల్ని అనుభవించి, పుత్రులను బడసి, మోక్షం కోసం యోగాన్ని ఆశ్రయించి దేహాన్ని త్యజించాలి” అంటున్నారు శాస్త్రకారులు. గృహస్థులు దీన్ని ఆచరించాలి.

అత్యంత శ్రద్ధ, భక్తి, వైరాగ్యాలు కలిగేలా కులశేఖరాళ్వారులు 'ముకుందమాల'లో ఇలా బోధించారు..

ఇదం శరీరం పరిణామ పేశలం 
పతత్యవశ్యం శతసంధి జర్ఘరం,
 కిమౌషధైః క్లిత్యసి మూఢదుర్మతే 
నిరామయం కృష్ణ రసాయనం పిబ

"ఓ మూఢుడా! దుర్మతీ! ఈ శరీరం అనేక సంధులు కలిగి స్వాభావికంగా దుర్బలమైంది. వయస్సు మళ్ళినప్పుడు మరింత దుర్బల మవుతుంది. వృద్ధావస్థలో కీళ్ళనొప్పుల లాంటి ఎన్నో రోగాలతో కృశించి నశించక తప్పదు. దీని చికిత్స కోసం ఎన్ని ఔషధాలు సేవించినా రోగమరణాలు లేకపోతాయా? అందువల్ల ఇలాంటి ఉపద్రవాలు కలుగకుండా ఉండడానికి 'శ్రీకృష్ణనామ' మనే ఉత్తమ ఔషధాన్ని పానం చేయి”. సంసార సాగరాన్ని దాటడానికి ఉపయోగించే సాధనం ఈ మానవ దేహం. యోగ సాధనలను అభ్యసించి ముక్తిని సాధించడం ద్వారానే ఈ మానవ దేహానికి సార్థకత  చేకూరుతుంది.

                                           *నిశ్శబ్ద.