అనేక లాభాలను చేకూర్చే విభూతి (Benefits of vibhooti)
అనేక లాభాలను చేకూర్చే విభూతి
(Benefits of vibhooti)
అగ్నికి దహించే గుణం ఉంది. కట్టెలు, పిడకలు మొదలైన వాటికి దహనమయ్యే గుణం ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించిన విభూతి, ఆ రెండు గుణాలనూ త్యజించి శాశ్వత రూపాన్ని సంతరించుకుంది. విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. నిర్గుణుడు అయిన మహాశివునికి విభూతి మహా ప్రీతికరమైంది.
హోమగుండంలో హోమం చేసినప్పుడు, ధునిలో కొబ్బరికాయలు మొదలైనవి భస్మం అయినప్పుడు వచ్చిన బూడిదను విభూతి అంటారు. హోమగుండం, ధుని - రెండూ పరమ పవిత్రమైనవి.
హోమగుండంలో మోదుగ, రావి సమిధలు, ఆవునెయ్యి ఉపయోగిస్తారు.
ధునిలో పీచు తీయని కొబ్బరికాయలు (Hairy Coconuts), పిడకలు (cakes made of cows dung), రావి, తులసి, మేడి చెట్ల కొమ్మలు (Pieces of Peepal, Tulasi and Medi), నవధాన్యాలు (Nine different grains), గంధపుచెక్కలు (Pieces of Sandal wood), నేరేడు (Camphor ), సాంబ్రాణి (Sambrani), ఆవునెయ్యి (Cows ghee ), సాంబ్రాణి sambrani powder), అగరొత్తులు (Incense Sticks) వేస్తారు. ఇవన్నీ కాలగా మిగిలిన బూడిద విభూతి.
"శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|
లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం||"
పరమ పవిత్రమైనది, అనారోగ్యాలను పోగొట్టేది, సంపదలను చేకూర్చేది, బాధలను నివారించేది, అందరినీ వశంలో ఉంచుకునేది అయిన విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను అనేది ఈ శ్లోక భావం.
కుడిచేతి మధ్యమ, అనామికా వేళ్ళ సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి. నుదుటిపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం.
"భస్మనా సజలే నైనధారయేచ్చత్రిపుండ్రకం"
అంటూ గృహస్తు భస్మాన్ని నీళ్ళతో తడిపి, నుదుటిమీద, ఉదరంపైన, చేతులమీద పెట్టుకోవాలి.
మంత్రాలు ఉచ్చరించడం చేతకానివారు ఈ చిన్న వాక్యాన్ని అయినా స్మరించాలి. లేదంటే, కనీసం "నమశ్శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించి, భస్మధారణ చేయాలి.
స్త్రీలు, స్వాములు నీళ్ళతో తడపని పొడి విభూతిని ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. "ప్రయోగ పారిజాతం"లో కూడా ఇదే సంగతి రాశారు.
ఇతర ఏ వస్తువు లేదా పదార్ధాన్ని అయినా కాలిస్తే బూడిదగా మారుతుంది. కానీ బూడిదను కాలిస్తే రూపాంతరం చెందదు. తిరిగి బూడిదే మిగులుతుంది. అంటే బూడిదకు మార్పు లేదు, నాశనం లేదు. నాశనం లేని విభూతితో నాశనం లేని శాశ్వతుడు అయిన మహాశివుని ఆరాధిస్తున్నాం. విభూతి శాశ్వతమైంది, పవిత్రమైంది మాత్రమే కాదు ఆరోగ్యదాయిని కూడా.
విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది. విభూతి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాలనుండి విభూతి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం.