ధనుర్మాసం విశిష్టత
ధనుర్మాసం విశిష్టత
కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల మహాలక్షి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువికి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.
ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత ?
ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది.
ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం, సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు.
ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు, దరిద్రం దూరమవుతుంది. ఈ నెలలో ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. సాక్షాత్తు భూదేవి అవతారమైన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురణాల్లో పేర్కొన్నారు.
ధనుర్మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి.
పెళ్లికాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు. ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా అవుతుంది. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.
శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్లు తమ స్థోమతను బట్టి విష్ణు ప్రతిమని చేయించి పూజించాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తిచేయాలి. పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి.. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెలరోజులూ చేయలేని వాళ్లు 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు.
ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మపరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు.
గోదాదేవి- కళ్యాణం
నిజానికి ఆండాళ్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమని పెద్దలు తెలియజేశారు. ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనంచేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాత్రులని కాక శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది.
ధనుర్మాసంలో వివాహాలు జరిపించరు. ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు , మీనంలో రవి ఉన్నప్పుడు, సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం శుభం.