దయామయి గాయత్రీ దేవి

 

లోకంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఏవో కష్టాలు ఉంటాయి. అదే మొదలు కాదు. చివరిదీ కాదు. ఒకటి పరిష్కారం అయినా మరో సమస్య తలెత్తుతూనే ఉంటుంది. ఇది లోకసహజం. ఇలా సమస్యలు ఎదురైనప్పుడు, సుడిగుండాల్లో చిక్కుకున్న భావన కలిగినప్పుడు వాటినుండి గట్టెక్కించమని దేవుణ్ణి ప్రార్ధించడం మామూలే.

ముఖ్యంగా దేవీ ఉపాసకులు విపత్తుల నుండి కాపాడమని గాయత్రీ మాతను వేడుకుంటారు. గాయత్రీ దేవి భక్తులను ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటుందని, చింతలు తీర్చి, భయాలు, ఆందోళనలు పోగొడుతుందని నమ్ముతారు. సంసారాన్ని భవసాగరం అనడం మనకు తెలిసిందే. అంటే సాగరం ఎంత అల్లకల్లోలంగా ఉంటుందో, తిమింగలాల్లాంటి భయానక జంతువులకు స్థావరంగా ఉంటుందో, సంసార జీవితం కూడా అంతే జటిలంగా ఉంటుందని భావం. అందుకే అలాంటి కష్టాలు ఎదురైనప్పుడు వాటి నుండి బయట పడేయమని వేడుకోవడం పరిపాటి. గాయత్రీదేవి దయకు సముద్రం. నిత్యజీవితంలో ఎలాంటి క్లిష్ట సమస్యలు ఎదురైనా భయంతో కుంగిపోనవసరం లేదు. మన ప్రయత్నం మనం చేస్తూనే అమ్మ శరణు కోరినట్లయితే ఆ విపత్తు నుండి ఇట్టే విముక్తి కలగడం తధ్యం.

ఓం భూర్భువస్సువః

తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి

ధియోయోనః ప్రచోదయాత్

అంటూ గాయత్రీ మంత్రాన్ని జపిస్తే అంతా మంచే జరుగుతుంది. అంతులేని ప్రశాంతత లభిస్తుంది.