మహిషాసుర వధ
దేవీ మాహాత్మ్యాన్ని సమాధి సురధులకు విశదీకరిస్తూ మేథా ఋషీన్ద్రుడు ఇలా చెప్పసాగాడు.... భక్తులారా ! అసంఖ్యాకంగా సంహరింపబడ్డ రాక్షసులను చూసి కోపోద్రిక్తుడైన చిక్షురుడు జగదంబతో యుద్దానికి తలపడ్డాడు.
మేరు పర్వత శిఖరాగ్రాన్ని మేఘం జలధారలతో కప్పివేసినట్లు - బాణవర్షంతో చిక్షురుడు శ్రీదేవిని ఆచ్చాదితం చేశాడు. ఆ కౄర రాక్షసుని బాణపరంపరను శ్రీదేవి క్షణంలో వ్యర్ధం చేసింది. వాని రథాశ్వాలనూ, సారధినీ నేలపాలు చేసింది. దానితో ఆగక వాని ధనుస్సును ఖండించి నిశిత శరాలతో వేధించసాగింది. దానితో చిక్షురుడు ఖడ్గ వేత్ర చర్మాదులు అందుకుని శ్రీదేవితో తలపడ్డాడు. నిశిత ఖడ్గంతో దేవీ వాహన మస్తకంపై ఓ వ్రేటువేసి, ఆపై జగన్మాత వామహస్తాన్ని ఖండించాలని కరవాలాన్ని ప్రయోగించాడు. కాని, ఆ ప్రయత్నం విఫలమైంది.
దానితో వాని నేత్రాల నుండి క్రోధానల జ్వాలలను వెడల గ్రక్కుతూ శూలాన్ని చేబూని దేవికి గురిపెట్టి విసిరాడు. ఆ శూలం ఆకాశంలోకి ఎగిరి జ్వాజ్వల్యమానమైన భానుమండల సద్రుశ్యంగా ప్రకాశించింది. తనను వేధించవస్తూన్న ఆ శూలానికి సమాధానంగా మహాశక్తి కూడా శూలాస్త్రాన్నే ప్రయోగించింది. ఆ శూలాస్త్రం చిక్షురుడు విడిచిన శూలాన్ని ముక్కలు చేస్తూనే ఆ దురాత్ముని కూడా ఖండించి వేసింది.
చామర సంహారం
అది చూసిన చామరుడు మహాశక్తిపై శక్త్యాయుధాన్ని ప్రయోగించాడు. ఒక్క హుంకారంతోనే జగదంబ దానిని నేలపాలు చేసింది. దానితో చామరుడు శూలాస్త్రాన్ని ప్రయోగించగా శ్రీదేవి శరప్రహారంతో దానిని మధ్య మార్గంలోనే రెండుగా ఖండించివేసింది. అనంతరం శ్రీదేవి వాహనమైన సింహం గజారూఢుడై యున్న చామరుని మీదికి దూకి తలపడింది. అలా యుద్ధం సాగుతుండగా చామరాసురుడు సింహంతో పాటు నేలమీద కురికాడు. సింహం భయంకర గర్జనలు చేస్తూ గాయపరచింది. ఒక్కసారిగా పైకి ఎగిరి చామరుని శిరస్సును నోట కరచుకుంది.