పుటం పెట్టాల్సిందే

 

 

పుటం పెట్టాల్సిందే

 

 

కాంచన వస్తుసంకలిత కల్మషమగ్నిపుటంబు బెట్టి వా

రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం

బంచిత భక్తియోగ దహనార్చిఁ దగుల్పక పాయునే కన

త్కాంచనకుండలాభరణ దాశరథీ! కరుణాపయోనిధీ!

బంగారంతో చేసిన వస్తువులలో ఉండే కల్మషాన్ని తొలగించాలంటే అగ్నిపుటం పెట్టాల్సిందే! అదే విధంగా ఆత్మకు అంటిన మూడు మలినాలనూ తొలగించాలంటే అది భక్తి యోగం చేతే సాధ్యమవుతుంది. బహుశా శతకకర్త ఈషణత్రయం అనే మూడు మలినాల గురించి ఇక్కడ చెబుతూ ఉండవచ్చు. దారేషణ (భార్య పట్ల మోహం), ధనేషణ (ధనం పట్ల మోహం), పుత్రేషణ (పిల్లల పట్ల మోహం) అన్న మూడు రకాల మోహాలను ఈషణత్రయం అంటారు.