దధీచి మహర్షి కుమారుడు ఎవరో ఆయన వృత్తాంతమేమిటో తెలుసా

 

దధీచి మహర్షి కుమారుడు ఎవరో ఆయన వృత్తాంతమేమిటో తెలుసా..

దధీచి మహర్షి సరస్వతీ నదీ తీరాన తపస్సు చేసుకుంటూండగా ఓ రోజు కాశ్యపుని కుమార్తె 'ఆలంబున' అక్కడికి విహారానికి వచ్చి ప్రకృతి సౌందర్యానికి మైమరచి నెమలిపిల్లలా నాట్యం చేసింది. నిజానికి ఇంద్రుడు పంపగా వచ్చింది తను. దధీచిని తన ఆటపాటలతో కావాలనే కవ్వించింది. ఆయన తపస్సు కాస్తా భగ్నమయింది. అంతవరకూ అస్ఖలిత బ్రహ్మచారిగా నియమబద్ధంగా జీవితం గడిపిన దధీచి ఆలంబున అందానికి దాసుడై ఇంద్రియనిగ్రహం కోల్పోయాడు. ఆ రేతస్సు వెళ్ళి సమీపంలో వున్న సరస్వతీనదిలో పడింది.

కొన్నాళ్ళకు నదీమతల్లి గర్భం దాల్చింది. పండులాంటి బిడ్డను ప్రసవించింది. అతని పేరు సరస్వత. కొడుకును వెంటబెట్టుకుని తల్లి దధీచి దగ్గరకు వెళ్ళింది. దధీచి బిడ్డను దగ్గరకు తీసుకుని, "దేశంలో ముందుముందు పన్నెండు సంవత్సరాలు వరుసగా కరువు కాటకాలు ఏర్పడతాయి. నదుల్లోనూ, కాలవల్లోనూ నీటిమట్టం తగ్గుతుంది. వ్యవసాయ పనులు మందగిస్తాయి. పంటపొలాలు దెబ్బతింటాయి. తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొంటాయి. ప్రజలు పొట్ట చేతబట్టుకుని ఉపాధికోసం దేశాంతరం వెళ్ళవలసి వస్తుంది. ఆ పన్నెండేళ్ళూ బ్రాహ్మణులు వైదిక కర్మలు చేసే వీలుండదు. వేదాలనూ, మంత్రాలనూ పూర్తిగా మరచిపోతారు. చదువుసంధ్యలు అడుగంటుతాయి. అప్పుడు ఈ చిన్నవాడు వాళ్ళు మరిచిపోయిన వేదాలనూ, మంత్రాలనూ, వైదిక కర్మలనూ వాళ్ళకు మళ్ళీ చదివి వినిపిస్తాడు. వాళ్ళ విధులను వాళ్ళకు గుర్తు చేస్తాడు. ఇదే నా ఆశీర్వాదం" అన్నాడు దధీచి. సంతోషంగా తల్లీ కొడుకులు వెనక్కి తిరిగి వెళ్ళారు.

ఆ సమయంలోనే ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని పోగొట్టుకున్నాడు. అదే అదననుకుని రాక్షసులు దేవతలమీద తిరగబడ్డారు. వాళ్ళ ఆగడాలు పెచ్చుమీరాయి. దేవతలందరూ వెళ్ళి ఇంద్రుణ్ణి ప్రార్థించారు. ఇంద్రుడు ఆలోచించి చివరికి "దధీచి వెన్నుపూస తెస్తే రాక్షస సంహారం చెయ్యగలనని దేవతలకు హామీ ఇచ్చాడు. దధీచి వెన్నెముకతో చేసిన ఆయుధంతో దానవులు మరణిస్తారని ఇంద్రుడికి తెలుసు. దేవతలు సరేనని వెళ్ళారు.

భూలోకానికి వెళ్ళి దధీచిని అర్ధించారు. ఉత్తమకార్యం కోసం తనువు చాలించడం కన్నా కావల్సిందేమీ లేదనుకుని దధీచి ప్రాణత్యాగం చేసి ఉత్తమగతులు పొందాడు. దేవతలు దధీచి వెన్నెముకను ఇంద్రుడికి తీసుకువెళ్ళి ఇచ్చారు. ఇంద్రుడు దానితో ఆయుధాలు తయారుచేసి రాక్షసులను వధించాడు.

ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ళకి దేశంలో తీవ్రంగా కరువు ఏర్పడింది. పంటపొలాలు నిస్సారంగా తయారయ్యాయి. కార్మికులు, కర్షకులు పొట్టకూటి కోసం వలస వెళ్ళారు. బ్రాహ్మణులు దేశాంతరం వెళ్ళారు. పన్నెండేళ్ళపాటు ప్రకృతి పగబట్టింది. సరస్వత ఒక్కడే తన తల్లితో అక్కడ మిగిలాడు. తీరా కరువు కాటకాలు పోయి, ప్రజలు ఒక్కొక్కరే స్వదేశం తిరిగి చేరుకునేవేళకు ఎవరి విద్యుక్తధర్మాలు వాళ్ళు మరిచిపోయారు. బ్రాహ్మణులకు వేదాలూ, ఉపనిషత్తులూ, మంత్రాలూ స్ఫురణకు రాకుండా పోయాయి. అప్పుడు వాళ్ళంతా సరస్వతను అర్థించారు. అతను శృతిపక్వంగా, కర్ణపేయంగా వేదాలూ, మంత్రాలూ పఠించాడు. బ్రాహ్మణులు సంతోషించారు. దేశం మళ్ళీ సుభిక్షమైంది.

                            *నిశ్శబ్ద.