కోరిన వరాలిచ్చే కామాఖ్య
కోరిన వరాలిచ్చే కామాఖ్య
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అసోం రాష్ట్రంలోని గౌహతిలో కొలువు తీరిన కామాఖ్యా దేవి. ఇవాళ ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాము.
ఈ ఆలయానికి వెళ్ళటానికి గౌహతిలోని అసోం టూరిజం వారి ఆఫీసులోనే పక్కనే వున్న ఆఫీసులో (వారిదే) మినీ టాక్సీ బుక్ చేసుకోవచ్చు. మేము దానిలోనే వెళ్ళాము. మన ఆటోలాగానే పెద్దది. ముందు డ్రైవరుగాక ఒకరు, వెనుక ముగ్గురు చాలా విశాలంగా కూర్చోవచ్చు. అన్నింటికన్నా మాకు నచ్చిందేమిటంటే దానిలో మీటరు. చక్కగా పని కూడా చేసింది (హైదరాబాదు ఆటోలు అలవాటయి ఎంత రిలీఫ్ గా అనిపించిందో. ఆ మీటరులో మనం ఎన్ని గంటలు ప్రయాణం చేశాం, వేచి వున్న సమయం ఎంత (దానికి వేరే రేటు మరి) ఎన్ని కిలో మీటర్లు ప్రయాణం చేశాం, దేనికది, మొత్తం అంతా రేట్లు వస్తాయి. మనం వీటికోసం లెక్కలు వేసుకుంటూ కూర్చోనక్కరలేదు. మేము రాత్రి 8 గం. లదాకా తిరిగి వస్తే మీటర్ రీడింగ్ 73 కి.మీ.లు తిరిగాం, వేచి వున్న సమయం 7 గం. ల 35 ని. లు. మొత్తం అయింది రూ. 1370. నిన్నటి టాక్సీకన్నా చాలా చౌక అనుకున్నాం. ఈ మినీ టాక్సీలు హాజో దాకా కూడా వస్తాయిట. కానీ కొంచెం కుదుపులు ఎక్కువ వుంటాయి. ఆటోలో కూర్చుని వెళ్ళగలిగిన వాళ్ళు దీనిలో వెళ్తే డబ్బు ఆదా అవుతుంది. ఇంకో ఉపయోగం .. టాక్సీల్లో ముందు మాట్లాడుకున్నవే చూపిస్తారు. వేరే ఏదన్నా చూడాలంటే మళ్ళీ ఎక్కువ ఛార్జీ. దీనిలో అలాంటిదుండదు. దోవలో మీకింకేదన్నా చూడాలన్నా వెళ్ళచ్చు. మీటరు వుంటుందిగనుక ఇబ్బంది వుండదు. అయితే ఛార్జీల వివరాలు ముందే మాట్లాడుకోండి. 12 గం. లు దాటితే బహుశా ఎక్కువ ఛార్జీ చెయ్యవచ్చు.
కామాఖ్య కొండపైకి చేరి, నెమ్మదిగా అటూ ఇటూ చూసుకుంటూ, వున్న కొంచెం మెట్లు ఎక్కేసరికి ఉదయం 8-30 అయింది . ఇక్కడ ఆలయ ప్రవేశం 3 విధాలుగా వుంటుందని ముందే తెలుసుకున్నాము. ఉచిత దర్శనం క్యూ, రూ. 100 దర్శనం క్యూ, రూ. 501 దర్శనం క్యూ. ఇవాళ కూడా దర్శనీయ స్ధలాలు చాలా వున్నాయని, సమయం తక్కువగా వుందని, ముందే రూ. 501 టికెట్ తీసుకుందామని డిసైడయిపోయాం. పైగా ముందు రోజు మా స్నేహితురాలు వాళ్ళు వెళ్ళారుట. శుక్రువారం రష్ గా వుంటుందని మేము వెళ్ళలేదు. ఆ రోజు సాయంత్రం వాళ్ళు వెళ్ళి 501 రూ. టికెట్ తీసుకున్నారుట. 10 ని. ల్లో దర్శనమయిందని మర్నాడు బాలాజీ ఆలయంలో కలిసి చెప్పారు. మేమూ అత్యుత్సాహంగా 501 రూ. టికెట్లు తీసుకున్నాం, తొందరగా దర్శనం చేసుకుందామని. ఎవరి అదృష్టాలు వారివికదండీ. మాకు రెండు గంటలు పట్టింది. అయితే ఒక విషయం మాత్రం మెచ్చుకోకుండా వుండలేక పోయాము. నిర్ణీత సమయం ప్రకారం ఒక క్యూ తర్వాత ఇంకొక క్యూలో వారిని పంపిస్తారు. అందరికీ ఒకటే సమయం. క్యూలో వున్న భక్తులనిబట్టి మనకి దర్శనం. సమయం తక్కువ వున్నవారు రూ. 501 టికెట్ తీసుకుంటే క్యూ తక్కువగా వుండవచ్చు. మనం తీసుకెళ్ళిన పూజా సామగ్రితో అమ్మవారి పీఠాన్ని అర్చించవచ్చు. అయితే సాధారణంగా ఎప్పుడూ భక్తులుంటూ వుంటారుగనుక గర్భగుడిలో సమయం చాలా తక్కువ వుంటుంది.
ఇంక మనవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా కొలిచే కామాఖ్యాదేవి ఆలయం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇక్కడివారు దీనిని 51 శక్తి పీఠాలలో ఒకటిగా చెబుతారు. ఈ దేవి దర్శనం కోసమే మన దగ్గరనుంచి కూడా చాలామంది భక్తులే వస్తారు. స్ధల పురాణం దక్షయజ్ఞం, సతీదేవి ఆహుతి, మహా విష్ణు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేయటం, అవి పడ్డచోట శక్తి పీఠాలుగా మహిమాన్వితం కావటం మీకు తెలుసుగదా. సతీదేవి శరీర భాగాలలో యోని ఇక్కడ పడిందంటారు. అందుకే ఇక్కడ దేవీ ఆలయాలన్నీ పీఠ రూపంలోనే పూజలందుకుంటాయిగానీ గర్భగుడిలో విగ్రహాలుండవు.
తర్వాత సతీదేవి హిమవంతుడికి పార్వతిగా పుట్టి శివుని కోసం తపస్సు చేస్తుంది. తారకాసురుణ్ణి చంపే కొడుకుకి పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు కావాలని, లోక కళ్యాణార్ధం, మన్మధుడు తపస్సు చేసుకుంటున్న శివుడిమీద పుష్పబాణాలను ప్రయోగించటం, దాని ఫలితంగా మాడి బూడిదవటం కూడా మీకు తెలుసు. తర్వాత రతీదేవి మహాశివుణ్ణి పరిపరివిధాల ప్రార్ధించగా, ఆయన కరుణించి మన్మధుణ్ణి పునరుజ్జీవితుణ్ణి చేస్తాడు. కానీ మన్మధుడి పూర్వం రూపం, అందం తిరిగి రాలేదు. దానికోసం తిరిగి శివుణ్ణి ప్రార్ధించారు.
ఇక్కడ చెప్పుకునే కధల ప్రకారం, తన పూర్వ రూపం పొందటంకోసం మన్మధుడు సతీదేవి దేహ భాగాలు పడ్డ ప్రదేశం వెతికి, ఈ ప్రదేశాన్ని కనుగొని, ఇక్కడ దేవ శిల్పి అయిన విశ్వకర్మ సహాయంతో ఆలయం నిర్మించాడు. దానితో కామదేవునికి పూర్వ రూపం వచ్చింది. అప్పటినుంచి ఈ ప్రదేశం కామరూప, ఇక్కడి దేవి కామాఖ్య అయింది.
తర్వాతి కధ…అస్సాం ప్రాంతానికి ఇదివరకు పేరు ప్రాగ్జోతిష్యపురం అనేవారు. ప్రాగ్జోతిష్యపురం ఎవరి రాజధానో మీకు తెలుసా. ప్రతి సంవత్సరం దీపావళి పండగనాడు ఆయన్ని తలచుకుంటూనే వుంటాముకదా. రాక్షస రాజు నరకాసురుడు పేరు తెలియనివారు వుండరు. మరి ఆయన్ని చంపితేనేకదా దీపావళి పండగ చేసుకున్నది. ఆ నరకాసురుడు పాలించిన ప్రాంతమే ఇది. అంతేకాదు తాంత్రిక వజ్రయాన బౌధ్ధమతానికి ఇది ప్రముఖ పీఠం. ఇప్పటికీ తాంత్రిక పూజలు విరివిగా జరుగుతాయి. జంతు బలులుకూడా వున్నాయి.
నరకాసురుడు రాక్షస ప్రవృత్తికలవాడైనా సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడి కొడుకే. రాక్షస సంహారం కోసం శ్రీమహావిష్ణువు అనేక అవతారాలెత్తాడు కదా. వాటిలో ఒకటి భూదేవిని రక్షించటానికి ఎత్తిన శ్వేత వరాహ అవతారం. ఆ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షించాడు. అది తామస గుణాలు కలిగిన అవతారం. ఆయన భూదేవిని వివాహం చేసుకుని భూమి మీద కొంత కాలం గడిపారు. సంధ్యా సమయాలలో కామవాంఛలు వుండకూడదంటారు. వరాహ రూపంలో వున్న కారణంగా ఆ నియమాన్ని పాటించని వారికి కలిగిన పుత్రుడు అసుర లక్షణాలు కలిగినవాడయ్యాడు. మహావిష్ణు అతనికి నరకుడు అని పేరుపెట్టి, అతను లోక కంటకుడు అవుతాడని, లోక రక్షణకు అతనిని చంపటం అనివార్యమవుతుందని చెప్పాడు. భూదేవి పుత్ర ప్రేమతో మహావిష్ణువును అనేక విధాల ప్రార్ధించి, తన పుత్రుడు కేవలం తన చేత మాత్రమే సంహరింపబడాలనే వరం తీసుకుంది. తల్లిగా తన పుత్రుడిని తానెటూ చంపలేదుగనుక తన పుత్రుడు చిరంజీవిగా వుంటాడనుకుంది. వరాహావతారాన్ని వీడి మహావిష్ణువు వైకుంఠం చేరాడు.
నరకుడికి మహావిష్ణువు ప్రాగ్జోతిష్యపురాన్నిచ్చి, సత్ప్రవర్తనతో వున్నంతకాలం సకల శుభాలతో తులతూగుతాడని చెబుతాడు. నరకుడు చాలాకాలం సత్ప్రవర్తనతోనే వున్నాడు. కామాఖ్యాదేవిని పూజిస్తూ అనేక శక్తులు పొందాడు. అనేక సంవత్సరాలు రాజ్యం చేశాడు. నరకుడు బలి చక్రవర్తి కుమారుడైన బాణాసురుడితో స్నేహం చేశాడు. బాణాసురుడు నరకుణ్ణి దేవతా పూజలకి, సత్ప్రవర్తనకి దూరం చేశాడు. అతని స్నేహంలో నరకుడు అనేక విధాల లోక కంటకుడుగా తయారయ్యాడు. 16 వేలమంది రాకుమార్తెలను బందీలను చేశాడు. బాణాసురుడు నరకుణ్ణి కామాఖ్యాదేవి పూజలనుంచి దూరంచేసి ఆవిడ కన్య అని, నరకుడు కావాలంటే ఆమెని పెళ్ళి చేసుకోవచ్చని ప్రోత్సహించాడు.
ఒకసారి నరకుడు కామాఖ్య దేవి తన ఆలయములో విహరిస్తుండగా గమనించి, ఆవిడని తనని వివాహం చేసుకోమని కోరాడు. తల్లికి తెలుసుగా తానెవరో. ఫక్కున నవ్వి ఒక్క రాత్రిలో తానున్న నీలాచలం కింద నుంచి ఆలయం దాకా నాలుగు వైపుల నుంచి మెట్లు, కొండపైన విశ్రాంతి గృహం నిర్మించినట్లయితే వివాహం చేసుకుంటానంటుంది. అంగీకరించిన నరకుడు అతి శీఘ్రంగా ఆ పనిని పూర్తి చేయసాగాడు. మరి కామాఖ్య దేవిని పూజించటంవల్ల అనేక శక్తులు కలిగినవాడుకదా. అది గ్రహించిన మహా విష్ణు తెల్లవారకుండానే ఒక మాయ కోడిని సృష్టించి వేకువ ఝామును తెలుపుతూ కూత కూయించాడు. పరాభవంపాలయిన నరకుడు ఆ కోడిని తరిమి తరిమి చంపేశాడు. నరకుడికి కామాఖ్య మీద కూడా చాలా కోపం వచ్చింది. కామాఖ్య అక్కడ నుంచి అదృశ్యమయి పోయింది. అసంపూర్తిగా మిగిలిన మెట్ల దోవని మెఖెలాడా దోవ అంటారు. నరకుడు మాయ కోడిని చంపిన ప్రదేశాన్ని కుకురకాటాచకీ అంటారు. ఇది దర్రాంగ్ జిల్లాలో వుంది.
మేము వెళ్ళిన దోవలో ఒక మండపం పైన కోడి బొమ్మ వుంది. అది అదేనేమో తెలియదు. సాధారణంగా టూరిస్టు ప్లేసుల్లో వుండే ఆటో, టాక్సీ డ్రైవర్లు కొంచెమైనా ఆ ప్రదేశం గురించి తెలుసుకుని ప్రయాణీకులకి చెబుతూ వుంటారు. మా టాక్సీ డ్రైవర్ కి భాష ఇబ్బందివల్ల, ఆడిగినా, ఆలయాల పేర్లు తప్ప చరిత్రలు ఏమీ చెప్పలేకపోయాడు. కొంతకాలం తర్వాత నరకుడు ఇంద్రుడి మీదకి దండెత్తి ఇంద్రుడి తల్లి అయిన అదితి కర్ణకుండలాలని అపహరించాడు. ఆ సమయంలో విష్ణువు, భూదేవి, కృష్ణ, సత్యభామలుగా అవతారాలెత్తి వున్నారు. కృష్ణుడు సత్యభామా సమేతంగా నరకాసురుడి మీదకు యుధ్ధానికి వెళ్ళటం, నరకాసురుడిని సంహరించటం మనకి తెలిసిన కధేకదా. తర్వాత కృష్ణుడు నరకాసురుడి కొడుకైన భగదత్తుని ప్రాగ్జోతిష్యపురానికి రాజుని చేశాడు. భగదత్తుడి తర్వాత ఆ రాజ్యం ముక్కలయ్యింది. ఆ ప్రాంతమంతా, కామాఖ్య ఆలయంతో సహా శిధిలమై, కీకారణ్యం పెరిగింది. నీలాచల్ మీద అక్కడక్కడా ఆటవికుల గుడిసెలు మాత్రం వుండేవి. వారు ఆ గుట్టని కామాఖ్యాదేవి స్ధానంగా భావించి పూజించేవారు. దేవి కూడా వారి కోరికలు తీర్చేది. అలా ఆలయం శిధిలమైనా, దేవి మహిమ ఏమాత్రం తగ్గలేదు.
క్రీ.శ. 1490లో మహారాజా బిశ్వ సింగ్ అహోం రాజులమీద దండెత్తి, ఒక రోజు రాత్రి తన తమ్ముడు సిబా సింగ్ తో తనవారికి దూరమై దోవతప్పి ఆకలి దప్పులతో నీలాచల్ పర్వతం మీదకి నరకుడు నిర్మించిన మెట్ల ద్వారా చేరుకున్నారు. అక్కడ ఎవ్వరూ కనిపించకపోయేసరికి, నిరాశా నిస్పృహలతో వెను దిరిగి వెళ్ళబోయి అక్కడ ఒకచోట ఒక వృధ్ధ మహిళ పూజ చేస్తూవుండటం చూశారు. ఆ వృధ్దనారి వారికి మంచినీరిచ్చి అక్కడ చెట్టుకింద విశ్రాంతి తీసుకోమని చెప్పింది. అక్కడి దేవి మహత్యంగురించి కూడా చెప్పింది. దేవిని మనస్పూర్తిగా శరణు వేడితే కోరిన కోరికలు తీరుతాయని చెప్పింది. అది విన్న మహారాజు దేవికి నమస్కరించి తాము తమవారిని కలవాలనీ, తమ రాజ్యానికి ఏ విధమైన కష్టాలు లేకుండా వుండాలనీ, అలాగైతే అమ్మవారికి బంగారు గుడి కట్టిస్తానని, నిత్య పూజలు జరిగేటట్లు చూస్తాననీ మొక్కుకున్నాడు.
అమ్మవారి దయవల్ల మహారాజు సైన్యం వారిని చేరుకుంది. సంతోషంతో రాజు దేవిని ఎలా పూజించాలని ఆ స్త్రీని అడిగారు. ఆవిడ దేవికి పసుపు, పూలు, ఎఱ్ఱ గుడ్డ, ఆభరణాలు, గొఱ్ఱెలు సమర్పించమని చెప్పింది. రాజు తన రాజ్యానికి తిరిగి వచ్చి జరిగిన విషయాలు చెప్పగా పండితులు పురాణ గ్రంధాలు, శాస్త్రాలు తిరగేసి ఆ ప్రదేశం 51 శక్తి పీఠాలలో ఒకటని, మహిమాన్వితమైన కామాఖ్య పీఠమని చెప్పారు. మహారాజు తన వాగ్దానం పూర్తి చెయ్యటానికి ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. కానీ అన్న మాట ప్రకారం బంగారు ఇటుకలతో ఆలయాన్ని నిర్మించలేక మామూలు ఇటుకలతో నిర్మాణం ప్రారంభించాడు. కట్టిన గోడలు కట్టినట్లు కూలిపోసాగాయి. ఒక రోజు రాత్రి రాజుకి కలలో ఒక యువతి కనిపించి బంగారు ఆలయాన్ని నిర్మిస్తానన్న రాజు వాగ్దానాన్ని గుర్తు చేసింది. దానికి ఆయన అంత బంగారం తీసుకు రాలేని తన అసమర్ధతని వ్యక్తం చేసి మార్గాంతరం చెప్పమన్నాడు. ఆవిడ ఇటుకకీ ఇటుకకీ మధ్య ఇసుక రేణువంత బంగారం పెట్టి ఆలయం నిర్మించమన్నది. ఆలయం ఆవిధంగానే నిర్మింపబడిందిట. రాజు దేవి నిత్య పూజలకు బ్రాహ్మణులను ఏర్పాటు చేశాడు.
ఈ క్షేత్ర పురాణానికి సంబంధించిన ఇంకొక కధ బ్రహ్మ దేవుడు సృష్టి చేసిన తర్వాత తానే ఈ సృష్టికి మూల కారణమని గర్వించాడు. ఇది గమనించిన జగన్మాత మహాకాళి బ్రహ్మ దేవుడి గర్వం అణచాలనుకున్నది. కేశి అను పేరుగల రాక్షసుణ్ణి సృష్టించింది. ఆవిర్భవించిన వెంటనే కేశి బ్రహ్మ దేవుణ్ణి మింగటానికి వెళ్ళాడు. భీతిల్లిన బ్రహ్మ మహా విష్ణువు దగ్గరకెళ్ళి రక్షించమని అడిగాడు. మహావిష్ణు బ్రహ్మ దేవుణ్ణి ఆపద నివారణ కోసం మహాకాళిని ప్రార్ధించమని సలహా ఇచ్చాడు. ఈ లోపల కేశి కేశిపుర అనే పట్టణాన్ని నిర్మంచుకుని, అందులో నివాసమేర్పరుచుకుని, ప్రజలందరినీ నానా హింసలూ పెట్టసాగాడు.
బ్రహ్మదేవుడు తన అపరాధం తెలుసుకుని మహా కాళిని పరిపరి విధాల ప్రార్ధించగా జగజ్జనని సంతసించి తన హుంకారంతో ఆ రాక్షసుణ్ణి సంహరించింది. మహాకాళి బ్రహ్మదేవుడితో కేశి బూడిదతో ఒక కొండని చేసి దానిమీద పశువుల మేతకు పనికి వచ్చే గడ్డి మొలిపించమని పశువులు ఆ గడ్డిని ఎంత తింటే బ్రహ్మ పాపం అంత తగ్గుతుందని వరమిచ్చింది. మాత ఒక వృత్తాన్ని సృష్టించి, బ్రహ్మని దానిని ఆరాధించమని చెప్పింది. బ్రహ్మదేవుని పాపంవల్ల ఆయనకి భగవతి దర్శనం కాలేదు. బ్రహ్మ తపస్సు చేసి ఆకాశంనుంచి అద్భుతమైన వెలుగుని తెచ్చి అమ్మ సృష్టించిన వృత్తంలో ప్రతిష్టించాడు. ఆవిడే కామాఖ్య. అప్పటినుంచి సకల దేవతలు కామాఖ్య దేవతని ఆరాధించసాగారు.
క్షేత్ర పురాణం తెలుసుకున్నాం కదా. ఇంక ఆలయం గురించి చెబుతాను. కొండపైకి వాహనాలు వెళ్ళేందుకు అనువుగా 1956 – 58 మధ్య రోడ్డునిర్మించారు. దానిని అప్పటి కేంద్ర మంత్రి గోవింద వల్లభ్ పంత్ ప్రారంభించారు. ఆయన కృషి వల్లనే ఆ రోడ్డు వచ్చింది అంటారు. ఈ రోడ్డు కొండమీద అన్నింటికన్నా ఎత్తులో వున్న భువనేశ్వరీ ఆలయందాకా వున్నది. కనుక ఎక్కువ కష్టం లేకుండా దర్శనం చేసుకోవచ్చు. కొండపైదాకా వాహనం వెళ్ళినా, ఇంకా కొన్ని మెట్లు ఎక్కాలి.
ఈ ఆలయానికి పూర్వం అనేక మార్గాలున్నా ప్రస్తుతం ఉపయోగంలో వున్నవి రెండు. వాహనాలలో వెళ్ళినవారు తూర్పు వైపునుంచి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ గేటుపై రెండు పులుల బొమ్మలు వుంటాయి. లోపలకి ప్రవేశిస్తే గుండ్రని ఆలయం కనువిందు చేస్తుంది. ఏడు గుండ్రని శిఖరాలతో విరాజిల్లుతున్న ఈ ఆలయం శిఖరాలమీద బంగారు త్రిశూలాలున్నాయి. ఆవరణలో పడమరలోవున్న పెద్ద దీర్ఘ చతురస్రాకార హాల్ లో నాగమాత విగ్రహం వుంటుంది. ఇక్కడికి మామూలు యాత్రికులు వెళ్ళరు (బలులు ఇక్కడే ఇస్తారు). ఆలయంలో మధ్యలో వున్న హాల్ లో కామాఖ్య దేవి, ఉమానంద చిన్న విగ్రహాలుంటాయి. ఇక్కడకూడా పూజలు చేస్తారు. ఈ హాల్ నుంచి గర్భగుడిలోకి వెళ్ళాలి.
గర్భాలయం చిన్న గుహ. దీపారాధనల వెలుతురే వుండటంతో కొంచెం చీకటిగా వుంటుంది. దాదాపు 10 మెట్లు దిగి కిందకి వెళ్తే కొంచెం లోతుగా వున్న ప్రదేశంలో అమ్మవారి పీఠం వుంటుంది. సతీదేవి శరీరంలోని వివిధ భాగాలు పడ్డ ప్రదేశాలు శక్తి పీఠాలుగా వెలిశాయికదా. వీటిలో అమ్మవారి యోని పడ్డ ప్రదేశం ఇది. విగ్రహం వుండదు. పీఠంలో ఎప్పుడూ నీరు ఊరుతూ వుంటుంది. భక్తులు ఆ నీటిని తమ శిరస్సుమీద జల్లుకుంటారు. ఈ గుహ లోపలే లక్ష్మి, సరస్వతుల విగ్రహాలున్నాయి. ఆలయంలో బయట గోడలకి విఘ్నేశ్వరుడు, విశ్వకర్మల విగ్రహాలతోబాటు ఇంకా అనేక విగ్రహాలు చూడవచ్చు.
దశ మహా విద్యల ఆలయాలు కూడా ఈ కొండపైనే వున్నాయి. ఇవి 51 శక్తి పీఠాలలోవి అంటారు. కామాఖ్యని దర్శించినవారు వీటినికూడా దర్శించవచ్చు. అవి 1. కాళి, 2. తార, 3. భువనేశ్వరి, 4. త్రిపురసుందరి, 5. భైరవి, 6. చిన్నమస్త, 7. దామువతి, 8. బగళ, 9. మాతంగి, 10. కమల. ఈ ఆలయాలన్నింటిలోనూ గర్భగుడిలోకి వెళ్ళటానికి కొంచెం మెట్లు దిగాలి. వెలుతురు ఎక్కువ వుండదు. అన్ని చోట్లా పీఠాలే .. విగ్రహాలు వుండవు. మేము వెళ్ళినప్పుడు చాలా చోట్ల తాంత్రిక పూజలు జరుగుతున్నాయి. ఒక చోటయితే బలికోసం అనుకుంటా 6 చిన్న చిన్న మేక పిల్లలు స్తంభాలకు కట్టబడ్డాయి. లోపల పూజచేసే పూజారి దగ్గర వైన్ బాటిల్స్ వున్నాయి. అవి దేని కంటే, పూజ తర్వాత పూజారులు తీర్ధంలా సేవిస్తారుట.
వీటిలో కొన్ని ఆలయాలు కామాఖ్యాదేవి గుడి ముందే వున్నాయి. అక్కడ ఎవరినడిగినా చెబుతారు. బగళాదేవి ఆలయానికి 72 మెట్లు, భువనేశ్వరి ఆలయం (అన్నింటికన్నా పైన వుంటుంది) 28 మెట్లు ఎక్కాలి. మిగతావాటికి అన్ని మెట్లుండవు.
దర్శనమయి బయటకి వస్తుండగా ఒకతను ప్రసాద్ లేలో అని పెద్దగా అందరికీ చెప్పటం చూశాం. అమ్మవారి ప్రసాదం అమ్ముతున్నారేమోననుకుని వెళ్ళాము. అక్కడ ఉచిత భోజనాలు .. ఆలయంవారే ఏర్పాటు చేశారనుకుంటా .. బియ్యం, పెసలు కలిపి వండిన వేడి వేడి పొంగలి (కొంచెం పలచగా), ఆలూ కూర, పాయసం .. అన్నీ వేడి వేడిగా చాలా బాగున్నాయి. సంతృప్తిగా అమ్మవారి ప్రసాదం తీసుకుని బయల్దేరాము.
ఉత్సవాలు
ఇక్కడ జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది అంబువాచి. ఆషాఢమాసంలో సప్తమినుంచి 3 రోజులు (జూన్ చివరలో వస్తుంది) జరుగుతుంది. అమ్మవారు బహిష్టుసమయం అది. అమ్మవారి పీఠంమీద ఒక గుడ్డ కప్పి ఆ మూడు రోజులూ ఆలయం మూసివేస్తారు. ఆ సమయంలో నేలను దున్నటంగానీ విత్తనాలు నాటటంగానీ చెయ్యరు. 4వ రోజు గొప్ప ఉత్సవం జరుగుతుంది. అమ్మవారి కుంకుమ, పీఠంపైన కప్పిన గుడ్డ ముక్కలు అమ్మవారి ప్రసాదంగా తాంత్రిక పూజలలో ఉపయోగిస్తారు. ఆశ్వీయుజ మాసంలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ జరిగే ఇంకొక గొప్ప ఉత్సవం దేవధ్వని. జ్యేష్ట, ఆషాఢ, శ్రావణ, భాద్రపద మాసాల్లో జరిగే ఈ ఉత్సవం మానసాదేవి గురించి జరుగుతుంది. ఆ సందర్భంలో ఉపయోగించే డ్రమ్, డోల్ మొదలగు వాయిద్యాల ఘోషతో వచ్చే బ్రహ్మాండమైన శబ్దాలతోనే ఈ ఉత్సవానికా పేరు వచ్చింది.
కామాఖ్యాదేవి పూజలు వామాచార పధ్ధతిలో జరుపబడతాయి. ఇక్కడ దున్నపోతులు, మేకలు, కోతులు, తాబేళ్ళు, పావురాలు మొదలగు జంతువుల బలి ఇస్తారు. కాళికా పురాణంలోను, యోగినీ తంత్రంలోను ఈ దేవి గురించి వున్నది. మనవారు పురాణ కధలు చెప్పటానికి స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణం, వగైరాలను పేర్కొన్నట్లు వీరు కాళికా పురాణం, యోగినీ తంత్రాలను పేర్కొంటారు.
ఉత్సవాలలో చాలా ఎక్కువ జన సందోహం వుండే ఈ ఆలయంలో మామూలుగా కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే వుంటుంది.
-పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)