ఇవే ఎనిమిది రకాల వివాహాలు!

 

ఇవే ఎనిమిది రకాల వివాహాలు!

 

 

వివాహం ఎన్ని రకాలు అని ఠక్కున అడిగితే జవాబు చెప్పడం కష్టం. ఒకో ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉండే వేర్వేరు ప్రజల ఆచారాలను బట్టి వివాహం జరిగే తీరు విభిన్నంగా ఉండవచ్చు. కానీ ఏ వివాహమైనా హైందవ స్మృతులలో పేర్కొన్న ఎనిమిది రకాల వివాహాలలో ఒక రీతిని తలపించక మానదు. ఇంతకీ మన స్మృతులలో పేర్కొన్న వివాహాలు ఇవీ...

బ్రహ్మం – అర్హుడైన వరుడిని ఎంపిక చేసుకుని, తన కుమార్తెని వివాహమాడవలసిందిగా అతడిని కోరి, శాస్త్రబద్ధంగా వివాహం చేయడం బ్రహ్మవివాహం.

దైవం – యజ్ఞయాగాదులు చేసే సమయంలో, ఆ క్రతువుని నిర్వహిస్తున్న రుత్విజునికి తన కన్యను ఇచ్చి వివాహం చేయడం దైవవివాహం.

అర్షం – ఒకప్పుడు సంపద అంటే గోసంపదే! అలాంటి రెండు గోవులను స్వీకరించి కూతురిని ఇచ్చి వివాహం చేయడం అర్షవివాహం.
ప్రాజాపత్యం – ఇకనుంచి గృహస్థాశ్రమంలో ఉంటూ తనకు అందించిన కన్యను కంటికిరెప్పలా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ వివాహం చేసుకోవడం ప్రాజాపత్య వివాహం.

అసురం – కన్యను ఇచ్చి వివాహం చేసేందుకు వీలైనంత కన్యాశుల్కాన్ని దండుకున్న తర్వాతే కూతురిని ఇచ్చి వివాహం చేయడం అసుర వివాహం.

గాంధర్వం – పెద్దల ప్రమేయం లేకుండా వధూవరులిద్దరూ పరస్పర అంగీకారంతో వివాహం చేసుకుంటే అది గాంధర్వ వివాహం.
రాక్షసం – తన కన్నుపడిన స్త్రీని... ఆమె ఇష్టం కానీ, ఆమె బంధువుల అభీష్టం కానీ లేకుండా బలవంతంగా ఎత్తుకువెళ్లి వివాహం చేసుకోవడం రాక్షస వివాహం.

పైశాచికం – నిద్రిస్తున్న స్త్రీ శీలాన్ని అపహరించి ఆపై ఆమెను మనువాడటం పైశాచిక వివాహం అవుతుంది.