ఆధ్యాత్మికత గురువు ఉపదేశించిన మంత్రాన్ని ఇతరులకు చెప్పవచ్చా.!
ఆధ్యాత్మికత గురువు ఉపదేశించిన మంత్రాన్ని ఇతరులకు చెప్పవచ్చా.!
గురుశిష్యుల మధ్య సంబంధం అమూల్యమైనది, గురువే శిష్యుడికి సరైన మార్గాన్ని చూపిస్తారు. కష్టాల నుండి గట్టెక్కించాలన్నా, చీకట్లో ఉన్న వాడికి వెలుగు చూపించాలన్నా గురువే సరైన మార్గాన్ని చూపించగలడు. నేటికాలంలో ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ఎంతోమందికి గురువులు మార్గం చూపించడం వల్లే సాధన అనేది సాధ్యమవుతోంది. అయితే గురువును ఆశ్రయించిన ప్రతి శిష్యుడికి ఏదో ఒక సందర్భంలో గురువు నుండి మంత్రోపదేశం అనేది అందుతుంది. ఇలా గురువు తన శిష్యుడికి వ్యక్తిగతంగా ఉపదేశించిన మంత్రాన్ని ఇతరులతో పంచుకోవడం మంచిదేనా? దీని గురించి చాలా మంది సందేహ పడుతుంటారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
గురురు శిష్యుడికి మంత్రాన్ని ప్రసాదించడానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది, శిష్యుడు గురువు ఉపదేశించిన మంత్రానికి సంబంధించిన నియమాలను తప్పక పాటించాలి. ఒకసారి శిష్యుడు గురువును అంగీకరించి, గురు మంత్రాన్ని స్వీకరించిన తర్వాత, ఎప్పుడూ గురువు ఆజ్ఞను పాటించాలి. గురువు ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ, సత్ప్రవర్తనను పాటిస్తూ, భగవంతుడిని ఆరాధించే వ్యక్తి విజయవంతమైన జీవితాన్ని పొందుతాడట.
గురు మంత్ర ఉపదేశం..
గురువు శిష్యునికి దీక్ష ఇచ్చేటప్పుడు, వారి చెవిలో ఒక మంత్రాన్ని చాలా చిన్నగా, నెమ్మదిగా చెబుతారు. హిందూమతంలో, శరీరంలోని కుడి భాగాన్ని పవిత్రమైనదిగా చెబుతారు. అందువల్ల, గురువు శిష్యుని కుడి చెవిలో మంత్రాన్ని మెల్లిగా చెబుతారు. మంత్రాన్ని మెల్లగా చెప్పడానికి కారణం, ఈ ప్రక్రియను రహస్యంగా ఉంచి, దాని ప్రభావాన్ని గరిష్ఠ స్థాయికి చేర్చడమే. ఆ మంత్రం శక్తి గురువు , శిష్యునికి మాత్రమే పరిమితం.
మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు..
గురువు మంత్రాన్ని శిష్యుని చెవిలో మెల్లగా చెబుతారు, , శిష్యుడు దానిని ఎప్పుడూ తనలోనే ఉంచుకోవాలట. దీని అర్థం గురు మంత్రాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. మంత్రాన్ని ఇతరులతో పంచుకోవడం, ఇతరులకు చెప్పడం వల్ల మంత్రం శక్తి తగ్గిపోతుందట, ఎవరితో అయినా మంత్రాన్ని పంచుకున్నప్పుడు.. ఆ మంత్ర జపం ఏకాగ్రతగా సాగదని, తద్వారా వారు దాని పూర్తి ప్రయోజనాలను పొందలేరని చెబుతారు.
గురువు ఉపదేశించే మంత్రం ప్రాముఖ్యత..
హిందూ నమ్మకాల ప్రకారం గురురు ఉపదేశించే మంత్రం సాధకుడికి ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఏకాగ్రత , ఆత్మపరిశీలన వైపు మార్గనిర్దేశం చేస్తుంది. గురువు మార్గదర్శకత్వంలో మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే సాధకుడి మనస్సును ప్రశాంతంగా మారుతుంది. వారు తమ దైవం పట్ల భక్తి, ఆధ్యాత్మిక సాధనపై మరింత దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. అయితే, గురు మంత్రం , ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన నియమాలు వివిధ శాఖలు , గురు సంప్రదాయాలలో వేర్వేరుగా ఉంటాయి.
*రూపశ్రీ.