కొడుకు లేకపోయినా కూతుళ్లు లేదా భార్య పిండ ప్రదానం చేయవచ్చా!
కొడుకు లేకపోయినా కూతుళ్లు లేదా భార్య పిండ ప్రదానం చేయవచ్చా!
మరణానికి ముందు మనిషిగా మానవ దేహంగా పరిగణిస్తారు, అదే దేహాన్ని మరణం తర్వాత మృత దేహం అని పిలుస్తారు. మరణం తర్వాత ప్రతి మతంలోనూ మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే హిందూమతంలో మరణానంతరం ఆత్మశాంతి కోసం పిండ దానం , శ్రాద్ధం అనేవి చాలా ముఖ్యమైనవిగా చెబుతారు. సాధారణంగా మరణించిన వ్యక్తి కొడుకు ఈ అంత్యక్రియలను, పిండప్రదానం, శ్రాద్దం నిర్వహించడం వంటివి చేస్తారు. కానీ కొందరికి పుత్ర సంతానం లేకపోయినా, ఒకవేళ కొడుకు ముందే మరణించినా వారికి అంత్యక్రియలు, పిండ ప్రదానం నిర్వహించే వారి గురించి చాలా గందరగోళం ఏర్పడుతుంది. కొందరు కూతురు అంత్యక్రియలు నిర్వహించడం తప్పేంటని, భార్య అంత్యక్రియలు నిర్వహించడంలో తప్పేంటని అడుగుతూ ఉంటారు. అయితే గరుడ పురాణంలో ఈ అంత్యక్రియలకు, పిండప్రదానానికి సంబంధించిన సమాచారం ఉంది. దీని గురించి తెలుసుకుంటే.. అంత్యక్రియల గురించి ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి. అవేంటో తెలుసుకుంటే..
గరుడ పురాణం ప్రకారం..
శాస్త్రాలు, గరుడ పురాణం ప్రకారం, కుమార్తెలు పిండ దానం చేయకూడదనేది ఎంతమాత్రం నిజం కాదు. ఒక కుటుంబంలో కుమారుడు లేకపోతే, కుమార్తెకు తన తల్లిదండ్రుల కోసం శ్రాద్ధం , తర్పణం చేసే పూర్తి హక్కు ఉంటుందట. సనాతన ధర్మం ఏ ఆత్మకూ మోక్షాన్ని దూరం చేయడాన్ని సమర్థించదు. గరుడ పురాణంలోని ప్రేతఖంఢం 8వ అధ్యాయంలో ఈ విషయం పేర్కొన్నారు.
మొదట పుత్రుడు, తరువాత మనవడు, మునిమనవడు, తరువాత సోదరుడు, అతని సంతానం, సపిండులు అవుతారట. వీరికి అంత్యక్రియలు, పిండప్రదానం మొదలైనవి చేయడానికి అధికారం ఉంటుందట. వీరందరూ లేకపోతే సమానోదక బంధువులు చేయాలట.
ఇరు కుటుంబాల్లో అంటే తండ్రి, తల్లి వంశాల్లో కూడా పురుషులు లేకపోతే, స్త్రీలే ఈ క్రియలను నిర్వహించాలట.
శ్లోకం..
తేషామభావే సర్వేషాం సమానోదకసంతతిః ।
కులద్వయే'పి చోచ్చిన్నే స్త్రీభిః కార్యాః క్రియాః ఖగ ॥
పైన చెప్పకున్నట్టు కొడుకులు లేకపోయినా, తల్లిదండ్రి వైపు బంధువులు లేకపోయినా, సమానోదక బంధువులు చేయాలి. తండ్రి, తల్లి వంశాలలో కూడా అర్హులైన పురుషులు లేకపోతే స్త్రీలచే ఈ క్రియలు నిర్వహించబడాలని గరుడ పురాణంలో పేర్కొన్నారు.
*రూపశ్రీ.