శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
ప్రారంభం
ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంలో గురువారం ఉదయం నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి మహా శివరాత్రి ఉత్సవాలు సోమవారం ఉదయం విశేష పూజలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటలకు యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ చేసిన తరువాత ఉత్సవాల ఆరంభ సూచకంగా అర్చకస్వాములు విశేష పూజలు నిర్వహించారు. తరువాత పుణ్యాహవాచనం, శివసంకల్పం, చండీశ్వర పూజ, ఋత్విగ్వరణం, 11 గంటల నుంచి అఖండ స్థపన, వాస్తు పూజ, వాస్తుహోమం, పంచావరణార్చన, మండపారాధన, రుద్ర కలశస్థాపన జరిగాయి.
శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో మొత్తం పదకొండు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పదకొండు రోజులూ స్వామి అమ్మవార్లకు ప్రతి రోజు వాహనసేవలు నిర్వహిస్తారు. 20న అంకురార్పణ, ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 21 రాత్రి హంస వాహనసేవ, 22 రాత్రి మయూర వాహన సేవ, 23 రాత్రి భృంగి వాహన సేవ, 24 రాత్రి రావణ వాహన సేవ, ఏకాదశి అభిషేకం, 25 రాత్రి కైలాస వాహనసేవ, 26 రాత్రి గజ వాహనసేవ, అదే రోజు రాష్ట్ర్ర ప్రభుత్వం పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది.
27 మహా శివరాత్రి పర్వదినం రోజున నందివాహనసేవ, ఎదురుకోలు ఉత్సవం ఉంటుంది. రాత్రి 10 గంటల నుంచి లింగోద్భవ కాల మహా రుద్రాభిషేకం, పాగాలంకరణ, శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల కల్యాణ మహోత్సవం, 28న రథోత్సవం వైభవోపేతంగా జరుగుతాయి. మార్చి 1న పూర్ణాహుతి, వసంతోత్సవం, కలశోద్వాసన, త్రిశూల స్నానం, ధ్వజావరోహణం, 2న అశ్వ వాహనసేవ, అదే రోజు రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, ఏకాంత సేవ, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి.
67 సంవత్సరాల పృథ్వి వెంకటేశ్వరులు, చీరాల మండలంలోని దేవంగర్ పురి దగ్గరలోని హస్తినాపురం నివాసి అయిన చేనేత కార్మికుడు 27 రాత్రి జరిగే శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల కల్యాణ మహోత్సవం సందర్భంగా శివుడిని అలంకరించేందుకు సిద్ధపడుతున్నారు. గత 45 ఏళ్ళుగా వీరే బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల కల్యాణ మహోత్సవానికి స్వామివారిని వీరే అలంకరిస్తున్నారు. వీరి వంశస్థులు 3 తరాలుగా స్వామివారికి అలంకరణ చేస్తున్నారు. వీరి తాతగారు కందస్వామి, తండ్రి సుబ్బారావు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని కొద్ది నెలల ముందుగానే అడవులలో ప్రయాణిస్తూ తాము నేసిన బట్టలను తీసుకుని శ్రీశైలం చేరుకునేవారని వెంకటేశ్వరులు తెలిపారు. ప్రస్తుతం తన కుమారుడి సహాయంతో మల్లన్నను, తొమ్మిది నందులను లింగోద్భవ కాలం అయిన రాత్రి 10-12 మహాశివరాత్రి రోజు అలంకరిస్తానని తెలిపారు. ఉత్సవాలు ముగిసిన తరువాత వెంకటేశ్వరులు స్వామికి అలంకరించిన వస్త్రాలను తీసివేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారే కాకుండా వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన భక్తులు ఈ వస్త్రాలను వేలంపాటలో సొంతం చేసుకుంటారు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ అప్పుడే పెరిగిపోయింది. క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తు రద్దీ దృష్ట్యా ఈ నెల 19 వరకూ మాత్రమే స్వామి వారి స్పర్శ దర్శనాన్ని ఆలయం అధికారులు అనుమతించారు. 20వ తేదీ నుంచి మల్లన్న అలంకార దర్శనాన్ని దూరదర్శన్ ద్వారా కల్పిస్తారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం నుంచి మార్చి 2 వరకూ ఆలయ ప్రాంగణంలో జరిగే అభిషేకం, అర్చనలు, హోమాలు, కల్యాణోత్సవం తదితర ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశారు.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయాలను సర్వాంగసుందరంగా అలంకరించారు. ఈ ఉత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రాన్ని సుమారు 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేసిన ఆలయం అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం మంచినీరు, పారిశుద్ధ్యం, వైద్య, ఆరోగ్యం, విద్యుదీకరణ పనులు పూర్తి చేశారు.