ఈ నెల 31న ఆకాశంలో అద్భుతం..

 

ఈ నెల 31న ఆకాశంలో అద్భుతం!

 

జాబిల్లి అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. చల్లటి వెలుగులు పంచే ఆ చందమామ వెన్నెలలో తడిసి ముద్దయి పోవాలని ఎవరికి మాత్రం ఉండదు. అలాంటి తెల్లటి చందమామ ఎర్రటి ఎరుపు రంగులోకి మారిపోతే! రోజూ కనిపించే దానికంటే పెద్దగా, మరింత కాంతివంతంగా కనిపిస్తే... అచ్చు సూర్యుడిలాగే ఉంటాడు కదా! ఇలాంటి విశేషాలన్నీ ఈ నెల 31న జరగబోతున్నాయి. అంతేకాదు... ఆ రాత్రి కనిపించే అద్భుతాల జాబితా ఇంకా చాలానే ఉంది.


సాధారణంగా నెలలో ఒకటే పౌర్ణమి ఉంటుంది. చాలా రేర్‌గా మాత్రమే రెండో పౌర్ణమి కూడా వస్తుంది. ఇలా ఒకే నెలలో రెండు పున్నములు వస్తే... ఆ రెండో పౌర్ణమిని ‘బ్లూ మూన్’ అని పిలుస్తారు. అంతేకానీ... ఆ రోజు చంద్రడు నీలం రంగులో ఏం ఉండడు. సుమారు ప్రతి రెండున్నర ఏళ్లకు ఓసారి ఇలా బ్లూమూన్ కనిపిస్తుంది. అలా ఈ నెల 31న వచ్చే పౌర్ణమి బ్లూమూన్ అన్నమాట.


బ్లూమూన్ సంగతి అలా ఉంచితే- ఈ నెల 31న వస్తున్న పౌర్ణమినాడు సూపర్‌మూన్‌ కూడా వస్తోంది. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు... ఒకోసారి కొన్ని వేల మైళ్ల దగ్గరగా వచ్చేస్తాడు. అదే సమయంలో పౌర్ణమి కూడా ఏర్పడితే, ఆ చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు. సూపర్‌మూన్‌ సమయంలో చంద్రుడు దాదాపు 15 శాతం పెద్దగా, 30 శాతం మరింత కాంతివంతంగా ఉంటాడు.


ఈ నెల 31న వచ్చే చంద్రుడు బ్లూమూన్‌, సూపర్‌మూన్ మాత్రమే కాదు... ‘బ్లడ్‌ మూన్’ కూడా! బ్లూమూన్‌ వచ్చిన రోజునే చంద్రగ్రహణం కూడా ఏర్పడితే... ఆ చంద్రుడిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. చంద్రగ్రహణం రోజున భూమి మీద సూర్యకాంతి పడి, అది చంద్రుడి మీద ప్రతిఫలిస్తుంది. ఫలితంగా, చంద్రడు ఎర్రగా కనిపిస్తాడు. అందుకే ఆ రోజు చంద్రుడిని ‘బ్లడ్‌ మూన్’ అని పిలుస్తారన్నమాట.


ఇలా ఒకే రోజున సూపర్‌మూన్, బ్లూమూన్, బ్లడ్ మూన్‌ ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది. మన దేశంలో అయితే ఇలా ఏర్పడి దాదాపు 150 ఏళ్లకు పైనే గడిచిపోయిందట. అందుకే ఈ నెల వస్తున్న పౌర్ణమి కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు... చంద్రుడు పెద్దగా కనిపించే సూపర్‌మూన్‌ రోజునే చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల... గ్రహణాన్ని చాలా దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. మరెందుకాలస్యం ఈ నెల 31న రాత్రి 6.30 నుంచి 7.30 మధ్యకాలంలో వచ్చే చంద్రగ్రహణాన్ని చూడండి.   https://www.youtube.com/watch?v=UAluJppsdL8