సీతారామాంజనేయాదుల అయోధ్యా ప్రయాణం
శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సుగ్రీవ విభీషణాదులతో పుష్పక విమానముపై అయోధ్యా నగరానికి పయనమయ్యాడు. ప్రయాణం ముగిసేసరికి రాముడు హనుమంతుని పిలిచి “హనుమా! అయోధ్య వెళ్ళి భరతుడు ఏమి చేస్తున్నాడో చూడు. నా వియోగములో ప్రతి క్షణము అతనికి కల్పసదృశముగా కనిపించుచుండును. నా సమాచారం అతనికి వినిపించి అతని సమాదానం నాకు తెలియజేయి” అన్నాడు.
దాంతో హనుమంతుడు అయోధ్యకు బయలుదేరాదు. హనుమద్భరత సమాగమం అయోధ్యలో భరతుడు శ్రీరాముని కోసం ఎంతగానో వేదన చెందుతున్నాడు. మారుతి అతని స్థితినంతతినీ చూశాడు. భరతుడు జటాజూటముతో కుశాసనాసీనుడై ఉన్నాడు. అతని శరీరము శుష్కించి పోయింది. కనులనుండి అశ్రువులు ప్రవహిస్తున్నాయి. అతని పెదవులు నిరంతరం రామనామం ఉచ్చరిస్తున్నాయి. తన సమీపమున కెవరు వచ్చుచున్నదీ, ఎవరు పోవుచున్నదీ, ఏమి జరుగుచున్నదీ తెలియనంతటి తన్మయత్వములో ఉన్నాడు.
మారుతి అతని ధ్యానమునకు భంగం కలిగిస్తూ “భరతా! ఎవరి విరహముతో నీవు దుఃఖిస్తున్నావో, ఆ రామచంద్రభగవానుడు జానకీ మాతతో లక్ష్మణ సుగ్రీవ విభీషణాదులతో కలిసి క్షేమంగా వస్తున్నాడు” అన్నాడు. అపారమైన అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేయు మధురమైన మారుతి పలుకులు ఆలకించి భరతు డమందానంద భరితుడై, వెంటనే లేచి నిలిచి హనుమంతుని గాధంగా ఆలింగనం చేసుకున్నాడు. మాటిమాటికి రామచంద్రుల విషయమై ప్రశ్నించెను. హనుమంతుడు ప్రసన్న చేతనుడై అన్ని విషయములనూ వినిపించాడు. ఇక వారిద్దరి ఆనందానికి అంతు లేకపోయింది.
“సోదరా! ఇంతటి మహానందకరమైన సంతోషకర సమాచారమును వినిపించిన నీకు ఇవ్వదగిన వస్తువేముంది? నీకు ఋణపడి ఉండడంలోనే నాకు ఆనందం ఉంది” అని భరతుడనగా, హనుమంతుడు అతని పాదములపై బడి, అతని ప్రేమను అనేక విధములగా కొనియాడుచూ - “భరతా! రామచంద్రుడు నిన్ను ఎంతగానో ప్రశంసిస్తున్నాడు . నీ సద్గుణములను తలచుకుంటున్నాడు. నీ నామమునే జపిస్తున్నాడు” అని చెప్పి, భరతుని అనుమతిపై అక్కడి నుండి బయల్దేరాడు.