Read more!

పిఠాపురం స్ధిత పీఠాంబిక...నవరాత్రులు 4వ రోజు

 


పిఠాపురం స్ధిత పీఠాంబిక...నవరాత్రులు 4వ రోజు

 

 

తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురాన్ని పూర్వం పుష్కర క్షేత్రమనేవారు.  ఈ క్షేత్రం అనేక పురాతన ఆలయాలకు ప్రసిధ్ధి చెందింది.  వాటిలో ముందుగా ఇక్కడ వెలిసిన శక్తి పీఠం గురించి చెప్పుకుందాము. పిఠాపురంలో వెలసిన శక్తి పురుహూతిక.   అష్టాదశ శక్తి పీఠాలలో పదవ  శక్తి పీఠమిది.  అమ్మవారి పీఠము (పిరుదులు) పడ్డ ప్రదేశము గనుక అమ్మవారిని పీఠాంబిక అన్నారు. శక్తి పీఠాలన్నింటికీ ఒకే కధ.  దక్షయజ్ఞం, సతీదేవి ఆత్మాహుతి, శంకరుని వేదన, శ్రీమహావిష్ణువు తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఛిన్నా భిన్నం చెయ్యటం, ఆ భాగాలు పడిన చోట శక్తి పీఠాలుగా పేరుపొందటం.  ఈ శక్తి పీఠాల సంఖ్య ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పినా, వాటిలో ముఖ్యమైనవి మాత్రం పధ్ధెనిమిది అని అందరూ అంగీకరించినది. పిఠాపురంలో ప్రసిధ్ధి చెందిన పురాతన  ఆలయం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయంలోనే వున్న ఈ శక్తి ఆలయం చిన్నదే అయినా, ఆలయం బయట గోడలకి వున్న శక్తి పీఠాలలోని అమ్మవార్ల మూర్తులతో అందంగా వుంటుంది.  ఇక్కడ అమ్మవారు చతుర్భుజ.  అత్యద్భుత సౌందర్యరాశి.  అమ్మవారిని దర్శించగానే భక్తిభావం వుప్పొంగుతుంది.  అమ్మవారి దగ్గర శ్రీచక్రం వుంటుంది.

 


ఈవిడకి పురుహూతిక అనే పేరు రావటానికి ఒక కధ చెబుతారు.  పూర్వం ఇంద్రుడు, గౌతమ మహర్షి భార్య అయిన అహల్యని మోసం చేస్తాడు.  మహర్షి శాపంతో సహస్రాక్షుడవుతాడు.  ఆ శాపం పోగొట్టుకోవటానికి ఇంద్రుడు జగజ్జనని కోసం తపస్సుచేసి, ఆవిడ ఆశీర్వాదంతో తన శాపం పోగొట్టుకుంటాడు.  పురుహూతుడు (ఇంద్రుడు) ఆరాధించిన దేవి గనుక ఈవిడ పురుహూతిక అయింది.

శ్రీ కుక్కుటేశ్వరస్వామి: ఈ శక్తి పీఠం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో వున్నదని చెప్పానుకదా.   ఆ కధ కూడా క్లుప్తంగా....
పూర్వం గయాసురుడనే రాక్షసుడు మహావిష్ణువుని మెప్పించి, ఆయనతో తన శరీరం అతి పవిత్రంగా వుండే వరం పొందుతాడు.  దానితో మనుషులు ఎన్ని పాపాలు చేసినా గయాసురుని శరీరం తాకితే చాలు, మరణానంతరం సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతున్నారు.  అలాగే జీవజాలమేదైనాసరే.  దీనితో గయాసురుని అనుయాయులు దేవతలను, ఋషులను వివిధ బాధలకు గురిచేయసాగారు.  వారు త్రిమూర్తులతో మొర పెట్టుకోగా, గయాసురుణ్ణి మాయోపాయంచేత తప్ప సంహరించలేమని బ్రాహ్మణుల వేషాలలో వెళ్ళి అతి పవిత్రమైన గయాసురుని శరీరంమీద లోక కళ్యాణార్ధం ఏడు రోజులు యజ్ఞం చేస్తామని అర్ధించారు.

 

 

గయాసురుడు అందుకు అంగీకరించి, ఏడు రోజులలో ఆ యజ్ఞం పూర్తి చెయ్యాలని, ఆ సమయం పూర్తికాగానే తను లేస్తానని అంటాడు.  అంగీకరించిన త్రిమూర్తులు, ఈ ఏడు రోజులలోపు గయాసురుడు కదిలితే యజ్ఞం అసంపూర్తిగా వుంటుంది గనుక తాము గయాసురుడిని సంహరిస్తామని చెబుతారు.  దానికి అంగీకరించి గయాసురుడు  శిరస్సు భాగం బీహార్ లోని గయలోనూ, నాభి భాగం ఒరిస్సాలోని జాజ్ పూర్ లోనూ, పాదాలు ఆంధ్ర ప్రదేశ్ లోని పిఠాపురంలోనూ వుండేటట్లు తన శరీరాన్ని బాగా పెంచుతాడు.  త్రిమూర్తులు ఆ శరీరంమీద యజ్ఞం ప్రారంభిస్తారు.  ఏడవ రోజు శివుడు గయాసురుణ్ణి కదిలించటానికి తెల్లవారకముందే కోడి రూపం ధరించి కూస్తాడు.  దానితో ఏడు రోజులు పూర్తయ్యాయని గయాసురుడు కదులుతాడు.  యజ్ఞం పూర్తి కాలేదుగనుక గయాసురుడు సంహరించబడతాడు. ఈ ప్రదేశం గయాసురుడి పాదాలు పెట్టిన స్ధలం కనుక పాదగయ అయింది.  దీని గుర్తుగా చిన్న మంటపంలో ఆయన పాదాలు, పైన శివుని విగ్రహం వున్నది.

గయాసురుడి ప్రార్ధనతో  కుక్కుట రూపంతో గయాసురుణ్ణి మోసగించిన శివుడు కుక్కుటేశ్వరుడుగా అక్కడ వెలిశాడు.  అంతేకాదు, గయాసురుడు ఆ క్షేత్రాలు  తన పేరుతో ప్రసిధ్ధి చెందాలని ఆ మూడు క్షేత్రాలలో పితృదేవతలకు జరిపే పిండ ప్రదానాలు అత్యంత ఫలప్రదం కావాలని కోరాడు.  అవే శిరో గయ (బీహారు రాష్ట్రంలో గయ), నాభి గయ (ఒరిస్సా రాష్ట్రంలో జాజ్ పూర్), పాద గయ (ఆంధ్ర ప్రదేశ్ లోని పిఠాపురం),  ఈ మూడు క్షేత్రాలలో శక్తి పీఠాలున్నాయి. (గయ .. మంగళ గౌరి, జాజ్ పూర్ .. గిరిజా దేవి, పిఠాపురం .. పురుహూతిక). శ్రీపాద శ్రీవల్లభుని సంస్ధానం

 

 

దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు ఇక్కడే జన్మించారు.  ఆయనా ఈ దేవిని పూజించారు.  ఆయన జన్మించిన ఇల్లు ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభుని సంస్ధానం.  దానిలో ఆయన స్వయంభూగా వెలిసిన విగ్రహం వున్నది.  ఇంకే దత్త క్షేత్రాలలోనూ స్వామి విగ్రహం వుండదు.  పాదుకలకే పూజ జరుగుతుంది.
శ్రీ కుంతీ మాధవ ఆలయం: ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుని చంపిన తర్వాత బ్రహ్మ హత్యా పాతకం నుంచి తప్పించుకోవటానికి ఐదు క్షేత్రాలలో ఐదు మాధవ ఆలయాలు నిర్మించాడు.  ఇవి పంచ మాధవ క్షేత్రాలుగా ప్రసిధ్ధి చెందాయి.  వాటిలో శ్రీ కుంతీ మాధవ ఆలయం ఇక్కడ వున్నది.  ఈయన ఈ క్షేత్ర పాలకుడు కనుక ఈయనని దర్శిస్తేనే ఈ యాత్ర పరిపూర్ణమవుతుందంటారు.
మార్గము: రాజమండ్రినుంచి 62 కి.మీ. లు, కాకినాడ నుంచి 20 కి.మీ.లు, సామర్లకోటనుంచి 12 కి.మీ. ల దూరంలో వున్న పిఠాపురానికి రైలు, రోడ్డు రవాణా సౌకర్యం వున్నది.


   


ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో గయాసురుడు పాదాలుంచినచోట పాదగయ అయింది.  ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దైవం.  కుక్కుటం రూపంలో యజ్ఞభంగంగావించిన ఈశ్వరుడు, గయాసురుడి కోరిక ప్రకారం ఇక్కడ కుక్కుటేశ్వరుడిగా వెలిశాడు.  అష్టాదశ శక్తి పీఠాలలో ఇక్కడవున్నది 10వ  శక్తి పీఠము పురూహూతికాదేవిది.త్రిగయా క్షేత్రాలలో పాదగయ శ్రేష్టమయిందంటారు. గయాసురుడి కోరికమీద శివుడు కుక్కుటేశ్వరుడుగా ఇక్కడ విరాజిల్లుతున్నాడు.  అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి.  ఇక్కడ అమ్మవారికి ఇరుపక్కలా సుబ్రహ్మణ్యస్వామి, వినాయకుడు వుంటారు. శ్రీ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభులు సుమతి, రాజశర్మ అను బ్రాహ్మణ దంపతులకు జన్మించింది ఇక్కడే.  ఆయన జన్మస్ధానం దర్శనీయ క్షేత్రం. పాదగయాక్షేత్రానికి  క్షేత్రపాలకులు శ్రీ కుంతీ మాధవస్వామి.  ఆయనని దర్శించనిదే పిఠాపుర యాత్రాఫలితం వుండదు.  ఇంద్రునిచే ప్రతిష్టించబడిన ఈయనని శ్రీ కృష్ణుని మేనత్త కుంతీదేవి పూజించింది కనుక కుంతీమాధవస్వామి అయ్యాడు. అసురుడైనా గయాసురుడు తన భక్తి ప్రపత్తులవల్ల భారత దేశంలోని మూడు ప్రదేశాలలో తన పేరు శాశ్వతంగా నిలబెట్టుకోవటమేకాదు, భవిష్యత్తరాలకోసం త్రిమూర్తులనుంచి ఎన్ని వరాలు సంపాదించాడో చూడండి.   

 

 

 

 

 

 --- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)