నవరాత్రులు 5వ రోజు : దక్షారామం దాక్షాయణి
నవరాత్రులు 5వ రోజు : దక్షారామం దాక్షాయణి
మనం పుట్టి పెరిగిన వూళ్ళు, మనకు తెలిసిన ప్రదేశాలు ఎన్నో పురాణ గాధలకు, చారిత్రిక విశేషాలకూ నిలయమంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది..ఎంతో ధ్రిల్లింగ్ గా కూడావుంటుంది కదా. మీలో చాలా మంది ద్రాక్షారామం పేరు వినే వుంటారు. అదేనండీ. తూర్పు గోదావరి జిల్లాలో వున్న పుణ్య క్షేత్రం. పంచారామాల్లో ఒకటి. ఈ ప్రదేశంతో ముడిపడి అనేక పౌరాణిక కధలు వున్నాయి.ముందుగా మనం దసరా సందర్భంగా అమ్మవారి ఆలయాల గురించి చెప్పుకుంటున్నాము గనుక ఇక్కడ వున్న శక్తి పీఠం మాణిక్యాంబ ఆలయం గురించి చెబుతాను.
అష్టాదశ శక్తి పీఠాలలో 12వది అయిన మాణిక్యాంబ శక్తి పీఠం ఇక్కడ భీమేశ్వరస్వామి ఆలయంలో వున్నది. పూర్వం దక్షప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశాడు. అందుకే దాక్షారామం అయింది. అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ వుండేవి, అందుకని ద్రాక్షారామం అన్నారు. దక్షుడు చేసిన యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు కానీ, తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు. కారణం అంతకు ముందెప్పుడో ఈయనగారిని చూసి ఆయన పలకరించలేదనీ, అభివాదం చేయలేదని కోపం వచ్చి. ఈ అలకలూ, కోపాలూ ఈ కాలంలోనే అనుకున్నాము, ఆ కాలంలోనూ వున్నాయా అనకండి. ఏ కాలమైనా గుణాలు తమ సహజత్వాన్ని కోల్పోవుకదండీ. అందుకని వాదోపవాదాలకు దిగకుండా ముందుకు సాగుదాం.
ఈ యజ్ఞం గురించి పార్వతీ దేవికి తెలిసింది. పుట్టింట్లో యజ్ఞం జరుగుతోంది, ఆసంబరం, ఆ హడావిడి తను మిస్ అయిపోతోందే అనుకుంది. శివుడి దగ్గర పుట్టింటికెళ్ళే ప్రపోజల్ పెట్టింది. కానీ శివుడు జగదీశ్వరుడు కదా. ఆయన పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, వద్దు అని నీతి చంద్రిక తిరగేశాడు. కానీ ఆడవారు ఏదైనా తలచుకుంటే, అందులోనూ, పుట్టింటి విషయంలో దాన్ని సాధించకుడా వుండరుగా. మొత్తానికి పరమేశ్వరుడిని ఒప్పించి, పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ ఏమయింది. ఎవరూ ఆవిడని పలకరించలేదు. ప్రేమాదరాలు చూపించలేదు. దానితో పార్వతీదేవికి కోపం వచ్చింది. భర్త మాట వినకుండా వచ్చినదానికి పశ్చాత్తాప పడింది. ఇటు పుట్టింట్లోనూ వుండలేక పోయింది, అటు శివుడి దగ్గరకెళ్ళి జరిగిన విషయం చెప్పలేక పోయింది. పాపం. ఆ అవమానం భరించలేక తనని తను కాల్చుకుని బూడిద అయింది. ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు. తన జటాజూటంనుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆయన వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు.
పత్నీ వియోగాన్ని భరించలేని శివుడు పార్వతి సూక్ష్మ శరీరాన్ని భుజంమీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయ తాండవం చేశాడు. శివుణ్ణి ఆపటానికి విష్ణువు పార్వతీ దేవి సూక్ష్మ శరీరాన్ని తన చక్రాయుధంతో ముక్కలు చేశాడు. ఆ శరీరం ముక్కలయి అనేక చోట్ల పడ్డాయి. ఆ ప్రదేశాలన్నీ శక్తి పీఠాలయినాయి. వాటిలో ముఖ్యమైనవి 18 అష్టాదశ శక్తి పీఠాలు. వీటిని జగద్గురువు శంకరాచార్యుల వారు పునః ప్రతిష్టించి అన్ని చోట్లా శ్రీ చక్రాలను కూడా స్ధాపించారు.
దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలో వెలసిన శక్తి పీఠం ఇది. మిగతా శక్తి పీఠాలకు ద్రాక్షారామంలోని మాణిక్యాంబ శక్తి పీఠానికి ఒక భిన్నమైన విశిష్టత వుంది. దాదాపు అన్ని శక్తి పీఠ క్షేత్రాలలో అమ్మవారి విగ్రహం శ్రీచక్ర యంత్రం వేరుగా వుంటాయి. కానీ ద్రాక్షారామంలో మాణిక్యాంబదేవిని శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్టించడం వల్ల శ్రీచక్రయంత్రానికి, అమ్మవారికీ ఏకకాలంలో పూజలు జరుగుతాయి.
ఈ శక్తి పీఠం వెలసిన క్షేత్రం గురించి ఇంకొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాము.... మన దేశంలో దాక్షారామం, శ్రీ శైలం, శ్రీ కాళహస్తి మధ్య వున్న ప్రదేశాన్ని త్రిలింగ దేశమన్నారు. త్రిలింగ దేశానికి ఉత్తర సరిహద్దుగా దాక్షారామం ప్రసిధ్ధికెక్కింది. తారకాసురుని మెడలోని శివ లింగాన్ని కుమారస్వామి ఛేదించగా ఐదు చోట్ల పడ్డ ఆ లింగం ముక్కలను వివిధ దేవతలు ప్రతిష్ఠ చేశారు. వాటినే పంచారామాలు అంటారు. వాటిలో ఒక ముక్క ఇక్కడ పడింది. ఇది వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠిత లింగం. ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది.
ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఇక్కడ వెలసిన భీమేశ్వరునికి అభిషేకం చేయటానికి సప్త ఋషులు సప్తగోదావరులను తీసుకువచ్చారు. ఇవి అంతర్వాహినులు. పూర్వం కాశీ విశ్వనాధుడు వేదవ్యాస మహర్షిమీద కోపగించి కాశీ విడిచి వెళ్ళమనగా, తన తప్పు తెలుసుకున్న వ్యాసుణ్ణి అన్నపూర్ణాదేవి, దక్షిణ కాశీ అయిన ద్రాక్షారామానికి వెళ్ళి అక్కడ వుండమని చెబుతుంది. వ్యాసుడు తన 300మంది శిష్యులతో ఇక్కడకొచ్చి కొంతకాలం నివసించాడుట.
వింధ్య పర్వతం గర్వమణిచే కార్యక్రమంలో అగస్త్య మహర్షి ఇక్కడకొచ్చి కొంతకాలం ఇక్కడ నివసించాడు. ఇక్కడ క్షేత్ర పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి. ఈయన్ని శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించాడు. గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది. అందుకే ఆ పేరు. గద లేదు. నమస్కార ముద్రలో వుంటాడు. తుష్కరులు ఈ విగ్రహం కాళ్ళ దగ్గర కొట్టేశారు. ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి. దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట. ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్ట దిక్పాలకులకూ మండపం వుంది. బహుశా దీన్ని ఇక్కడే చూస్తామేమో. ఇంకా శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి, రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి, కైలాస గణపతి దర్శనీయ దేవతా మూర్తులు. ఏక శిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు.
అష్టదిక్పాల మండపానికి ఎదురుగా వున్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు. ఇందులో మూడు ప్రాకారాలున్నాయి. అందులో మొదటి రెండు ప్రాకారాలలో గోడలకి బొడిపలు కనబడతాయి. పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి వుండటంవల్ల ఆ ప్రదేశమంతా కాంతిమయంగా వుండేదట. 9—10 శతాబ్దాలలో నిర్మింపబడిన ఈ ఆలయ కుడ్యాలపై 832 శాసనాలు చెక్కబడివున్నాయి. మనకి వీటిలోని వ్రాత అర్ధంకాకపోయినా చారిత్రిక పరిశోధకులకు ఇవి పెన్నిధి వంటివి. ఇలాంటి శాసనాల ఆధారంగా చేసిన పరిశోధనల ద్వారానే మనకు మనదేశ పూర్వ చరిత్ర తెలుస్తుంది. ఆలయాభివృధ్ధికి ఏ ఏ రాజులు ఎలా తోడ్పడ్డారు, ఏ మండపాలు, ప్రాకారాలు ఎవరు కట్టించారు, ఆలయ నిర్వహణకి ఏ రాజులు ఎంత దానాలిచ్చారు వగైరా వివరాలన్నీ ఈ శాసనాలలో లభ్యమవుతుంది. వాడ్రేవు జమీందారులిచ్చిన 125 ఎకరాల భూమిమీద ఆదాయం నేటికీ ఆలయాభివృధ్ధికి తోడ్పడుతోంది.
భీష్మ ఏకాదశినాడు భీమేశ్వరస్వామి, లక్ష్మీ నారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామిల కళ్యాణం ఒకే వేదికపై జరపడం కూడా ఇక్కడి విశేషమే. ఇన్ని విశేషాలున్న ఆలయాన్ని మరి మీరూ దర్శిస్తారుగా. దర్శన వేళలు గుర్తు పెట్టుకోండేం. ఉదయం 6-00 గం. లనుండి 12-00 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3-00 గం. లనుండి 8-00 గం. ల వరకు. వుండటానికి దేవస్ధానంవారి వసతి గృహాలు, ఉచితంవి, డబ్బు చెల్లించేవి వున్నాయి. దేవస్ధానం వారు మధ్యాహ్నం 12 గం.లకు ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఈ ప్రదేశం చేరటానికి కాకినాడ దాకా వెళ్ళి అక్కడనుంచి ఉదయం 9-30 కి. పాసెంజరులో వెళ్ళవచ్చు. గోదావరి జిల్లాలో ముఖ్య పట్టణాలన్నింటినుంచీ బస్సు సౌకర్యం బాగా వుంది. బస్సు స్టాండు గుడికి 1/2 కి.మీ. దూరంలో వుంది.
--- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)