అలంపూర్ లో వెలిసిన ఐదవ శక్తి పీఠం నవరాత్రులు 3వ రోజు
అలంపూర్ లో వెలిసిన ఐదవ శక్తి పీఠం నవరాత్రులు 3వ రోజు
విష్ణుమూర్తి చక్రాయుధంతో ఛేదించబడిన సతీదేవి శరీర భాగాలు పడ్డ ప్రదేశాలు శక్తి పీఠాలుగా వెలుగొందాయనీ, వాటిలో ముఖ్యమైనవి 18 అనీ అంటారు కదా. ఈ అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవది తెలంగాణా రాష్ట్రంలో, మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ లో వున్నది. ఇక్కడి శక్తి పేరు జోగులాంబ. సతీదేవి పై దవడ, దంతాలు ఇక్కడ పడ్డాయంటారు. ఈ తల్లి రౌద్ర స్వరూపిణి అయినా భక్తులయందు దయగలది. వారి గృహఛ్ఛిద్రాలను తొలగించేది. ఈవిడకి తలపై జుట్టులో బల్లి, తేలు, గుడ్లగూబ, పుఱ్ఱెల ఆకారాలు చిన్న సైజులో వుంటాయి. (అమ్మవారివి మనకంతగా కనిపించవుగానీ, గర్భగుడి బయట కాపలాగా వున్న చండి, ముండి విగ్రహాలలో వాటిని చూడవచ్చు.) ఇవ్వన్నీ గృహఛ్ఛిద్రాలు కలిగించేవి. వీటన్నింటినుంచీ భక్తులకు రక్షణనిచ్చి, సదా వారి గృహాలను కాపాడే దేవతగా, తమ ఇళ్ళ వాస్తు దోషాలను పోగట్టే గృహ చండిగా, దుష్టదృక్కులనుంచీ, దుష్ట శక్తులనుంచీ మనని కాపాడే దేవతగా ఈ అమ్మవారిని కొలుస్తారు. వాస్తు దోష నివారణకు కూడా ఈ దేవిని పూజిస్తారు.
7వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మింపబడిందనీ, 9వ శతాబ్దంలో జగద్గురువు శ్రీ శంకరాచార్యులవారు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారంటారు. అయితే 14వ శతాబ్దంలో ముస్లింల దండయాత్రలలో ఈ ఆలయం నేలమట్టమయింది. స్ధానికులు అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోనే వున్న బాల బ్రహ్మేశ్వర ఆలయంలో ఒక చిన్న గదిలో వుంచి పూజించారు. మిగతా దేవాలయాలు నాశనం కాకుండా విజయనగర చక్రవర్తి, రెండవ హరిరహరాయల కొడుకు – మొదటి దేవరాయలు రక్షించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇది క్రీ.శ. 1390 లో జరిగింది. 600 సం. ల తర్వాత ఇదివరకు అమ్మవారి ఆలయం వున్న ప్రదేశంలోనే నూతన ఆలయం నిర్మింపబడింది. పాత విగ్రహాన్ని తిరిగి ఇక్కడ ప్రతిష్టించి నిత్య పూజలు చేస్తున్నారు. ఈ ఆలయానికి ముందే (కొన్ని మెట్లు ఎక్కి దిగాలి) తుంగభద్రా నది వున్నది. భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించి ఇక్కడి ఆలయాలను దర్శిస్తారు. ఇక్కడ కుంకుమార్చనలు బాగా చేయిస్తారు. ఆసక్తి, అవకాశం వున్నవారు చేయించుకోవచ్చు. పూలు బాగా దొరికేచోటునుంచి వెళ్ళేవాళ్లు పూల దండలు తీసుకువెళ్తే అమ్మవారికి వేస్తారు. అక్కడ పూలు ఎక్కువ దొరకవు.
దక్షిణాపధంలో ప్రసిధ్ధికెక్కిన ప్రాచీన శైవ క్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా కూడా అలంపురం పేరుగాంచింది. అలంపురంలో శ్రీ జోగులాంబ దేవాలయమేగాక ఇంకా అనేక దేవాలయాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి నవ బ్రహ్మల ఆలయాలు. వీటిని నిర్మించినవారు బాదామీ చాశుక్యులు. అయితే ఇవ్వన్నీ ఒకేసారి నిర్మించబడ్డవి కావు. ఇక్కడ లభ్యమయ్యే శాసనాలు వగైరా ఆధారాలవలన అలంపురం ప్రాంతం క్రీ.శ. 566 – 757 వరకు బాదామీ చాళుక్యుల పరిపాలనలో వుంది. ఈ సమయంలో నిర్మింపబడ్డ ఆలయాలివి. వీరి తర్వాత రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, కుతుబ్ శాహీ నవాబులు, అసఫ్సహీలు వగైరాల పాలనలో వున్న అలంపురం ఒకప్పుడు గొప్ప విద్యాపీఠం. నవ బ్రహ్మల ఆలయాలలో ప్రధానమైనది బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయం. పూర్వం బ్రహ్మ దేవుడు ఇక్కడ తపస్సు చేసి శివ లింగాన్ని ప్రతిష్టించినందువల్ల ఆ లింగానికి బ్రహ్మేశ్వరుడని పేరు వచ్చింది. చిన్న లింగం కనుక బాల బ్రహ్మేశ్వరుడన్నారని పూజారిగారు చెప్పారు. ఈ ఆలయం రస సిధ్ధులైన శిల్పాచార్యులచేత నిర్మించబడింది. ఇక్కడి లింగం మహా ఓషధీ సంస్కారం పొందిన మహిమాన్విత రస లింగం.
క్షేత్ర పురాణం ప్రకారం అలంపూరులోని దేవాలయాలను రససిధ్ధుడు కట్టించాడు. సిధ్ధుడు కాశీ విశ్వేశ్వరుని ప్రేరణతో ఈ క్షేత్రానికి వచ్చి క్షేత్రపాలకుల గురించి తపస్సు చేశాడు. బ్రహ్మేశ్వరుడు తలపైనుండి, జోగులాంబ నోటినుండి, గణపతి బొడ్డునుండి రసాన్ని ఇచ్చారట. వాటితో పరుసవేదిని చేసుకొని సిధ్ధుడు ఇక్కడి ఆలయాలను కట్టిస్తూ వున్నాడు. విసలద్రాజు అనే రాజు పరుసవేదిని సిధ్ధుడినుండి లాక్కోవడంకోసం దండెత్తి వచ్చాడు. దానితో సిధ్ధుడు ఆలయ నిర్మాణం పూర్తి కాకముందే గర్భాలయంలోకి ప్రవేశించి బ్రహ్మేశ్వరునిలో లీనమైపోయాడు. సిధ్ధుని శాపంవలన విలసద్రాజు రాజ్యం పోగొట్టుకుని ఎన్నో కష్టాలు అనుభవించి, ఒక జింక చేత ఉపదేశంపొంది, చివరికి శివసాన్నిధ్యం పొందాడట. ఈ కధ ప్రవేశ ద్వారం ముందు వున్న తోరణ స్తంభంపైన చెక్కబడివుంది. పాల్కురికి సోమనాధుడు తన పండితారాధ్య చరిత్రలో ఈ క్షేత్ర మహిమ, ఇక్కడి తీర్ధాలను వర్ణించాడు.
ఇక్కడి నవ బ్రహ్మాలయాల్లో ప్రతిష్టించబడినవి శివలింగాలే. వాటి పేర్లు .. బాలబ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ, పద్మబ్రహ్మ. అన్ని పేర్లకీ బ్రహ్మ ఎందుకు చేర్చారో తెలియలేదు. అన్ని పేర్లూ బ్రహ్మతో వచ్చినాయిగనుకే వీటిని నవబ్రహ్మాలయాలని వుండవచ్చు. బాల బ్రహ్మేశ్వర ఆలయ ప్రాగణంలో వున్న రేణుకామాతని సంతానం లేని స్త్రీలు సంతానం కోసం పూజిస్తారు.
పురావస్తు సంగ్రహాలయం
బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయ ప్రవేశద్వారం బయట వున్న ఈ పురావస్తు సంగ్రహాలయంలో అలంపూరు పరిసరాలలో దొరికిన విగ్రహాలను, శిలా శాసనాలను భద్రపరచారు. ఇందులో ఎన్నో అపురూపమైన శిల్పాలున్నాయి.
కూడలి సంగమేశ్వర ఆలయం
ఈ ఆలయాలకి ఒక కిలో మీటరు దూరంలో వున్న కూడలి సంగమేశ్వరాలయంలోని అద్భుత శిల్పాలను కూడా దర్శించండి. మీరు అడిగితే, అక్కడ వున్న పూజారిగారు వాటి గురించి వివరంగా చెబుతారు.
పాపనాశేశ్వరం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపుకు గురయిన అలంపూరు సమీపములోని పాపనాశనీ తీర్ధములో వున్న ఆలయాలను ఇక్కడ పునః ప్రతిష్టించారు. వీటికి వెళ్ళే దోవలో పాపనాశనీ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అనే బోర్డు కనబడుతుంది. జోగులాంబ ఆలయంనుంచి సుమారు రెండు కిలోమీటర్ల లోపే ఎడమవైపు వెళ్తే వస్తాయి ఈ ఆలయాలు. (ఆలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు హరిత రెస్టారెండు ఇవతల కనబడే చిన్న సందు) నవ బ్రహ్మల ఆలయాల తర్వాత నిర్మింపబడిన ఈ ఆలయాల నిర్మాతలుకూడా చాళుక్యులే. ఈ ఆలయాలలో ముఖ్య దైవం శివుడు పాపనాశేశ్వరుడు పేరుతో పూజలందుకుంటున్నాడు. మనుషులు తమ స్పర్శ, దర్శనాలతో తెలిసీ తెలియక చేసిన పాపాలను నాశనం చేసే శక్తిగల స్వామి ఈయన. ఒక చిన్న ఆలయంలో విష్ణుమూర్తి చేతిలో పిండంతో వున్నాడు. ఈ అరుదైన మూర్తిగురించి విశేషాలు తెలియలేదు. ఇంకా మహిషాసురమర్దని, సాక్షి గణపతి, సప్తమాతృకలు, విద్యా గణపతులకు చిన్న చిన్న ఆలయాలున్నాయి. పాపనాశనీ తీర్ధంనుంచి తీసుకువచ్చి పునర్నిర్మాణంగావింపబడిన ఆలయాలుగనుక రోడ్డు మొదట్లో పాపనాశనీ గ్రూప్ ఆఫ టెంపుల్స్ అని బోర్డు వుంటుంది.
వసతులు
బాలబ్రహ్మేశ్వరాలయంలోవున్న సత్రాలలో ముందు చెప్తే బ్రాహ్మణులకు భోజనం పెడతారు. ఈమధ్య ఆలయానికి వెళ్ళే త్రోవలో పున్నమి రెస్టారెంటు పెట్టారు. ఇక్కడ భోజన, వసతి సౌకర్యాలు వున్నాయి.
మార్గం
హైదరాబాదు నుంచి సుమారు 200 కి.మీ., లు, మహబూబ్ నగర్ నుంచి 90 కి.మీ. లు, కర్నూలు నుంచి 27 కి.మీ. ల దూరంలో వున్నది ఈ క్షేత్రం. హైదరాబాదునుంచి కర్నూలు వెళ్ళే దోవలో ఎడమవైపు శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలకు దోవ చూపే బోర్డు కనబడుతుంది. అక్కడనుంచి సుమారు 13 కి.మీ. లు లోపలకి వెళ్ళాలి. హైదరాబాదునుంచీ సొంత వాహనంలో ఉదయం బయల్దేరి, అలంపూర్ లోని అన్ని ఆలయాలూ చూసి అదే రోజు తిరిగి హైదరాబాదు వచ్చెయ్యచ్చు.
గమనిక ... ఈ వ్యాసాలకి, నవరాత్రిలో అమ్మవారి అలంకరణలకు సంబంధం లేదు.
---- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)