అమ్మవారితో ఆజన్మ బ్రహ్మచారి ఆలయం
అమ్మవారితో ఆజన్మ బ్రహ్మచారి ఆలయం
ఆ జన్మ బ్రహ్మచారి అయిన ఆంజనేయుడి ఆలయం ప్రతి ఊరిలో ఒక్కటైనా ఉంటుంది. అలా ఆయన ఆలయాల్లో మూలవిరాట్ ఆంజనేయుడు ఒక్కడే కనిపిస్తాడు. లేదా శ్రీరామ దూతగా దర్శనమిస్తాడు. కానీ బహు అరుదుగా సువర్చల సహిత ఆంజనేయస్వామి ఆలయాలు ఉంటాయి. లంకను చేరేందుకు ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించు సమయంలో ఆయన స్వేదాన్ని గ్రహించి, గర్భం దాల్చిన మత్స్యం సువర్చల. సువర్చల గర్భం నుంచి జనించిన ఆంజనేయ పుత్రుడు మత్సవల్లభుడు. సువర్చల హనుమాన్ దేవాలయాలు చాలా అరుదు. అలాంటి ఒక దేవాలయం కృష్ణాజిల్లాలో ఉయ్యూరు మండలంలోని ఉయ్యూరు గ్రామంలో రావిచెట్టు బజారు చివర పుల్లేరు కాలువకు సమీపంలో ఉన్నది. ఈ ఆలయంలో వెలిసిన స్వామి కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు.
ఈ అరుదైన దేవాలయాన్ని గుండు లక్ష్మీ నరసింహావధానులుగారు సుమారు 200 సంవత్సరాల క్రితం తన స్వంతధనంతో నిర్మించి, ఆలయంలో ఉత్సవ ముర్తులను ధ్వజస్తంభమును ప్రతిష్టించి, ధూప ధీప నైవేద్యాలను కొనసాగించినట్లు తెలియుచున్నది. ఆ తర్వాత 23`6`1988వ సంవత్సరంలో శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్‌గారి ఆధ్వర్యంలో వైఖానస ఆగమవిధానాలతో స్వామి వారిని పున: ప్రతిష్టించారు. 13`06`1993న ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు.
ఆలయంలో స్వామివార్లకు నిత్యపూజలతో పాటు అభిషేకాలు, హోమాలు, సహస్రనామార్చలు, పండుగ పర్వదినాలలో విశేష అర్చనలు, తమలపాకుల పూజ, పండ్లతో పూజ, గంధసింధూరంతో అర్చనాదులు, హనుమాన్ చాలీసా పారాయణం, విష్ణు, లలితా పారాయణ, సామూహిక కుంకుమపూజ, ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. వైశాఖ బహుళ దశమి నాడు ఆంజనేయస్వామి జన్మదినం. భోగినాడు శాంతికల్యాణం, ఊరేగింపు జరుగుతుంది. ఈ సందర్భంగా ఒంటె వాహనం మీద జరిగే ఊరేగింపు, లడ్డులతో ప్రత్యేకపూజ, కాయగూరలతో విశేష అర్చనలు చూడముచ్చటగా ఉంటాయి. ఈ ఆలయాన్ని దర్శించడానికి నిత్యం ఎంతో మంది భక్తులు తరలివస్తుంటారు.ఆ రోజున శ్రీ హనుమజ్జయంతిని సువర్చలాంజనేయ కళ్యాణాన్ని చాలా వైభవంగా జరుపుతారు.