అమ్మో అమ్మాయిలు 16
వ్యాకర్ణ కి ముచ్చెమటలు పోసేశాయి. ముందుగా చెమట తుడుచుకుని తెప్పరిల్లింది అబ్బులే. “జయచిత్ర మా వాడి ఫేవరేట్ అండి ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడల్లా జయచిత్రకికి మెల్లకన్ను గొగ్గి పళ్ళు కొంగ ముక్కు కొరివి కారం అంటూ వెరిక్కిస్తుంటాను. అది విని మా వాడు ఉడుక్కుంటూ వుంటాడు. మీరు వచ్చే ముందే జయచిత్రని ఏడిపించాలని. ఆ........కాదు కాదు మా వాడిని ఏడిపించాలని. జయచిత్రది ఏడుపు ముఖం అన్నాను.
అలా కోపంగా చూస్తున్నరేంటి? మిమ్మల్ని కాదండీ మా వాడి ఫేవరేట్ జయచిత్ర ముఖం"
“ఆపండి" జయచిత్ర గట్టిగా అంది.
అబ్బులు అబద్ధాలు కట్టిపెట్టి గట్టిగా నోరు మూసేశాడు. పంపింకా రాలేదనీ మంచి నీళ్ళు తన ఇంట్లోంచి ఒక బిందె ఇస్తానని వెళ్తూ వెళ్తూ బామ్మగారు జయచిత్రకి చెప్పి వెళ్ళింది. స్టీలు బిందెనిండా మంచి నీళ్ళతో జయచిత్ర గదిలోకి వేచ్చేటప్పటికి వ్యాకర్ణ అబ్బులు జయచిత్ర గురించి మాట్లాడుకుంటున్నారు. అదే జయచిత్ర వింది.
నడుంకి స్టీలు బిందె ఎత్తుకుని, చీర కొంగు దోపి, వాలు జడ ముందుకేసుకుని, ముంగురులు ముఖాన దోబూచులాడుతుండగా, కళ్ళల్లో కోపం తొణికిసలాడుతుండగా వ్యాకర్ణకి జయచిత్ర ఎంతగానో నచ్చింది. ఉపాయం తోచింది. ఒక్క ఉదుటున లేచి, జయచిత్ర నడుం కి అంటి పెట్టుకుని వున్న నీళ్ళ బిందెను అందుకుని" అరేరే మా కోసం మీరు కష్టపడి మీ ఇంటి నుంచి బిందె మోసుకుని రావాలా? మేమొచ్చి తెచ్చుకోలేమా? మా కాళ్ళు నొచ్చేనా? మా చేతులు నొచ్చేనా? మా నోరు పిడచకట్టుకు పోయేనా?” అని అన్నాడు
ఆ పై జయచిత్రని కిందనుంచి పైకి, పై నుంచి కిందకు చూసి " మీకు కోపం రాదంటే చిన్న మాట జయచిత్రగారూ" అన్నాడు.
“ఆ మాటేంటో తెలుసుకోవాలన్న కుతూహలంతో నాకు కోపం రాదులెండి చెప్పండి" అంది జయచిత్ర.
“మరండీ మీరండీ అచ్చం జయచిత్రలా వున్నారండీ, అరె మీరు కోపగించుకోనని చెప్పారు. మళ్ళీ కోపంగా చూస్తున్నారు. అర్థం........... ఓహో. జయచిత్ర కన్నా అందంగా వున్న మిమ్మల్ని జయచిత్రతో పోల్చానని కోపమా?”.
“సారీ. అబ్బ సారీ చెప్పాను కదండీ. అందమైన అమ్మాయిలకు అంత కోపం పనికిరాదండీ. అన్నట్లు కాళిదాసు ఏం చెప్పాడో తెలుసాండీ. కోపం వల్ల అందం తరిగిపోతుందని చెప్పాడండీ. ఇంతెందుకు కన్యాకుమారిలో దాసరి అంటాడు కన్య కైనా, కుమారికైనా శాంతం భూషణం అన్నాడండీ.”
అబ్బులు అడ్డుతగిలి "ఒరే కర్ణా దాసరి ఆ మాట అనలేదు అసలు మాట అంటూ ఏది చెప్పబోయాడు.
వెంటనే వ్యాకర్ణ కోపంతో తాటి చెట్టు ప్రమాణాన లేచి "అబ్బూ ఆ మాట దాసరి కాకపొతే మరో గడసరి అన్నాడు. పోనీ, సోగ్గాడులో జయచిత్రతో రామానాయుడు ఏమన్నాడు ఆడపిల్లకు కోపం కూడదు అన్నాడా లేదా. ఆలు మగలులో హలం....”
అబ్బులు చటుక్కున వ్యాకర్ణ నోరు మూసేశాడు. మూసి "మావాడు నోరు తెరిస్తే మనిషి కాడండీ" అన్నాడు.
జయచిత్ర ఇంకా నవ్వు ఆపుకోలేక పడీపడీ నవ్వింది. నవ్వు ఆపుకోలేక గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది. జయచిత్ర వెళ్ళిపోయిందని, ప్రస్తుతం తిరిగిరాదని రూఢిచేసుకున్నాక వ్యాకర్ణ అబ్బులు నోరు తెరిచారు. “మనం పిచ్చి పిచ్చిగా వాగరాదు . బహు డేంజర్" అన్నాడు వ్యాకర్ణ.
“నాది కాదు పిచ్చివాగుడు. ఎక్కువైంది నీకు. జయచిత్రను చూసిన తర్వాత నీ ఒళ్ళు నీకు తెలియటం లేదురా సమయానికి నేను ఆదుకోబట్టి సరిపోయింది. లేకపోతే మళ్ళీ టులెట్ బోర్డ్ వెతుక్కుంటూ వీధిన పడేవాళ్లం. నీ....” అంటూ గదిలోకి వస్తున్న మాసిన లూజు లాల్చిని చూసి నోరు మూసుకున్నాడు అబ్బులు.