అమ్మో అమ్మాయిలు 17
“నా పేరు ధర్మరాజు" అంటూ లోపలికొచ్చాడు లూజు లాల్చీ.
“ఎవరికోసం వచ్చారండీ" అన్నాడు వ్యాకర్ణ .
“ఏముండేదా కుడి నుంచి ఎడమకు తిరిగిమళ్ళీ కుడికి తెరిగితే వచ్చే వాటాలో మేముంటున్నాము"
మీ పేరు అన్నాడు ధర్మరాజు.
“ఒరేయ్ కుంతీ పుత్రా కర్ణా ఈయన ధర్మారాజురా"
“నే అనుకున్నాను. బామ్మగారి పేరు ద్రౌపది కదా. ధర్మరాజు అంటే అని పొరపడి వెంటనే గ్రహించాను. ఈ ధర్మరాజు చెవిటి మాలోకం అని. ఏం చేద్దాం" అన్నాడు అబ్బులు.
“ఏం చేద్దాం అంటే ఏం చెప్తాను. ఏదో ఒకటి చేద్దాం" అన్నాడు వ్యాకర్ణ.
“వీళ్ళు మాట్లాడుకుంటున్నది ఏమిటో వినబడని ధర్మరాజు "మీ పేర్లు బాగున్నాయి. అబ్బాయిలూ. నాకు పేర్లు పెట్టి పిలవటం ఇష్టం లేదు. అబ్బాయి..... అంటాను. అలా పిలిపించుకోవటం మీకు ఇష్టమా? సంతోషం సంతోషం" ఆన్నాడు బోలెడు సంతోషంతో.
అబ్బులు వ్యాకర్ణ ముఖ ముఖాలు చూసుకుని ఆపై ధర్మరాజు ముఖం చూశారు. ఇంటివాళ్ళు మీకు దూరపు బంధువులా. అహ ఏం లేదు మీరు ఈ ఇంటికి రాగానే బామ్మగారు. జయచిత్రమ్మ వచ్చి మాట్లాడటం చూసి అనుకున్నాను" అన్నాడు ధర్మరాజు
“బంధువులు కాదండీ" మర్యాదగా చెప్పాడు అబ్బులు.
“అద్గదీ సంగతి. బంధువులు కాబట్టే ఆ అది ఆ ఇది" అన్నాడు ధర్మరాజు.
“ఈయనెక్కడ దొరికాడురా మనకి" విసుకున్నాడు వ్యాకర్ణ.
“అదేంట్రా అబ్బాయ్. అప్పుడే మరిచిపోయావా? జయచిత్ర చెప్పాలా. తూర్పునుంచి పడమరకి తిరిగి ఆపై ఎడమవైపు తిరిగితే చెవిటి మారాజు తగులుతాడు జిడ్డు అని... లెట్రిన్ కెళ్ళే రూట్ లో వుందా బాత్ రూంకి వెళ్ళే రూట్ లో వుందా ఈయనగారి కొంప?”
“ఆయన్నే అడుగు"
“సరాసరి నోరు విప్పకపోతేనే ఈయన అరగంట మాట్లాడుతున్నాడు. నోరు తెరిస్తే ఈ మహానుభావుడు ఇక్కడనుంచి కదలడు. అన్నిటికీ మనం చిరాగ్గా మొఖం పెడదాం. వెళ్ళిపోతాడు"
"లెస్స పలికితివి కర్ణా”.
“బామ్మగారు మీకేమవుతారు" అని అడిగాడు ధర్మరాజు.
“బామ్మగారే" అన్నాడు భూతద్దాల్లోంచి బోలెడు కోపంగా చూస్తూ అబ్బులు.
“అలా చెప్పరా అబ్బాయ్. సాక్షాత్తూ మీ బామ్మకి తోడికోడలి చెల్లెలన్నమాట" అన్నాడు ధర్మరాజు.
“ఈయన పెళ్ళాం ఈయనతో ఎలా కాపురం చేస్తోందిరా? ఈయన్నడిగే బదులు ఈయన పెళ్ళాన్నడుగుదాం బాత్ రూంకి వెళ్లినప్పుడు"
“ఆవిడకి చెవుడు లేదు. తాట వలిచేస్తుంది"
“అయితే ఈయన్నాడుదాం"
“అడిగి చూడు"
“వీళ్ళ దోవన వీళ్ళు మాట్లాడుకుంటుంటే ధర్మరాజు అడిగేది అడిగేస్తున్నాడు.