అమ్మో అమ్మాయిలు 15
వాతావరణం వేడిగా వుందని గ్రహించిన వ్యాకర్ణ వేడి గాల్పు వీచకముందే తెలివి తెచ్చుకుని, నోట్లో వేలు వుంచుకుని గట్టిగా వేలు కొరుకుని 'అబ్బా' అన్నాడు. ఏమైందేమైందంటూ అబ్బులు జయచిత్ర, ఆదుర్దా పడి వ్యాకర్ణ వద్దకు వచ్చారు.
ఏదో చెప్పేశాడు వ్యాకర్ణ. వ్యాకర్ణ అబ్బులు వున్న కొద్ది సామాను నీటుగా గదిలో నీటుగా సర్దు కున్నారు. ఓ పది నిముషాలు అక్కడే నిలుచుని ఆ తరువాత బామ్మతో కలిసి బయటకు నడిచింది జయచిత్ర.
“ఎలా వుందిరా అబ్బాయ్ మనిల్లు" తీరుబడిగా చాపమీద జార్లలపడి వ్యాకర్ణ అడిగాడు.
“ఒరేయ్ వ్యాకర్ణం మాటలు సరిగ్గా రానీ. బతికి బట్ట కట్టాలని లేదా. నాలుగు కాలాలపాటు బతకాలని లేదా?” అంటూ కోప్పడ్డాడు అబ్బులు.
“కారణం చెప్పి కళ్ళెర్రజేయరా అబ్బూ"
“బుర్ర లేకుండా మాట్లాడుతూ ఇంకా కారణం చెప్పాలా...... మనిల్లట మనిల్లు నీ తాతా నా తాతా కలిసి కట్టించినట్లు మాట్లాడుతున్నావ్. ఆ పిల్ల రాక్షసి విన్నదంటే వీళ్ళెవరో తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకం అనుకుని వెంటనే ఇల్లు ఖాళీ చేయమంటుందిరా బాబూ"
వ్యాకర్ణ మొఖంలో చిరునవ్వు చిందులాడింది అబ్బులు మాటలు విని. “చూడమ్మా మనిల్లంటే తప్పొచ్చిందా? ఇప్పుడు నువ్వన్నమాట ఆ జయచిత్రదే విన్నదంటే మక్కెలు కొంకెలు బొమికలు విరగ్గొట్టి విధి గుమ్మానికి తోరణంలా తగిలిస్తుంది" అన్నాడు వ్యాకర్ణ.
“నేనేమన్నాకాని మాటన్నారా కర్ణా" అన్నాడు అబ్బులు అయోమయంగా.
“నేను మనిల్లు అన్నాను. ఆ మాటని ఎలాగోలాగ సమర్ధించుకోవచ్చు. నీవేమన్నావ్ జయచిత్రను పిల్ల రాక్షసి అన్నావు బాగుందా"
అబ్బులు నాలుక కరుచుకుని 'తప్పే" అని ఒప్పేసుకున్నాడు.
“ఊ అలా ఒప్పుకో బాగుపడిపోతావ్. మనం ఈ ఇంట్లో నాలుగు కాలాల పాటు చల్లగా వుండాలంటే ముందు కాకా పట్టాల్సింది బామ్మగారిని కాదు జయచిత్రని. అవునా?”
“ఎస్" అని ఇంగ్లీష్ లో ఒప్పేసుకున్నాడు అబ్బులు.
“నీవు ఒప్పుకున్నావు కాబట్టి ఉపాయం చెబుతాను విని ఆచరించు. నీ అంతటివాళ్లు లేరంటే ఎవరైనా బూరెలా పొంగి బుట్టలో పడతారు. మనం జయచిత్రను అప్పుడప్పుడు మాటల మధ్యలో జయచిత్ర కళ్ళు ఒళ్ళు వగైరా వర్ణిస్తూ పొగుడుదాం. ఎలా అంటే జయచిత్ర నీ మాటలు భలే బాగుంటాయ్. నీవు నవ్వితే ముత్యాలు రాలినట్టే వుంటాయ్ అలా అన్నమాట"
“అర్థమైందిరా కర్ణా. జయచిత్రా..... నీ కళ్ళు లేడిని పోలి వుంటాయి. నీ నడుం పిడికెడే వుంది. అలాగేనా"
“అలాగే సందర్భాన్ని బట్టి మన పొగడ్త మారుతూ వుండాలి".
“ఎలాగో చెప్పు"
“మీ మాటలు ముత్యాల మూటలు. మీ నవ్వు చిలక నవ్వు జయా. మీ నడక హంస నడక. మీ చూపులు మన్మథ బాణాలు"
“ఛ ఛ వున్నట్టుంది మన్మథ బాణాలదగ్గరికి వెళ్ళావేంట్రా. తప్పు జయచిత్ర వింటే...”
“నిజమేరోయ్ వింటే మన్మథ బాణాలు కాదు నిప్పు రవ్వలు కురిపిస్తుంది. జయచిత్ర చూపుల్లో చురుకు వుంది. జయ జ..” గుమ్మం దాటబోయితున్న జయచిత్రను చూసి కంగారు పడ్డాడు వ్యాకర్ణ. అబ్బులు జయచిత్ర ని చూడలేదు"జ...జ... ఏమిట్రా జయచిత్ర జపం చేస్తున్నావా ఏమిటి?” అన్నాడు. గుమ్మం దాటుతూ లోపలికి అడుగు పెడుతున్న
జయచిత్ర అబ్బులు మాటలు విననే వింది. “ఏవండోయ్ నేను లేకుండా నా పేరెత్తుతున్నారు" అంటూ వురుములా గర్జించింది.