అమ్మో అమ్మాయిలు 14

 

జయచిత్ర ఆలోచిస్తూ కూర్చుంది. వ్యాకర్ణతో చాలాకష్టం. మొండి శిఖండి. ఈ వ్యాకర్ణ కూడా ఆ బాపతు జాతివాడిలాగానే వుంది. తెల్లగా బొద్దుగా మెడలదాకా వేలాడే గిరిజాల క్రాపు.... పూల బుష్ కోటు, మీసాలు నున్నగా చెక్కేశాడు. సైడ్ లాక్స్ మాత్రం జానెడు పెంచాడు. అబ్బబ్బబ్బ ఈ మగాళ్లకేం ఫ్యాషన్లో? మనిషి అందంగా వున్నాడు చాలాదూ. పెద్ద హిందీ యాక్టర్ లాగా తయారయ్యాడు.

అలంకరణ ఎక్కువైంది. మొగాడు అచ్చం మొగాడిలాగానే వుంటే చాలదేమిటి? ఆడవాళ్ళ బట్టలు తొడుక్కుని అడవిరాముడు లాగానూ, దసరా బుల్లోడు లాగానూ తయారవుతూన్నారు. మగాడు గోచీ పెట్టుకుంటే సరిపోతుంది. మరే వ్యాకర్ణ గోచీ పెట్టుకుంటే ఎలా వుంటాడో? ఛీ సిగ్గు లేకుండా ఇదేమిటమ్మా? ఆడపిల్లని కాదా? సిగ్గు సిగ్గు అని ఆలోచించి.... వ్యాకర్ణణి గోచీలోఉన్న ఆకారంలో ఊహించుకుని సిగ్గుపడి తన్ను తాను కోప్పడుకుంది. ఆ పై ఆలోచన అబ్బులు వైపు మళ్ళింది.

అబ్బులు.... పేరు ఎంత ముద్దుగా వుందో? అబ్బూ అని పిలవచ్చు. చందమామ కథల్లోలాగా ఏడిపించాలంటే అబ్బూ సిరి గిరి అని పిలవచ్చు. మనిషి చూడబోతే జైంట్ వీల్ లా ఇంతెత్తున్నాడు. వైట్ ఫ్యాంట్ లో వైట్ షర్ట్ టక్ చేశాడు. చాలా వైట్ గా వున్నాయి దుస్తులు. సర్ఫ్ పెట్టి రాణీపాల్ లో ముంచాడేమో? వచ్చిన తరువాత కన్నుకోవాలి.

క్రాఫ్ నున్నగా వుంటే ఏం. అమితాబ్ అడిగి అరువు తెచ్చుకున్నాడేమో? పాపం భూతద్దాలే... ఆ అవి బాగానే వున్నాయి. అల్లరి పిల్లాడిలా లేడు అమాయకుడిలా వున్నాడు. మాటకు ముందు భయపడేలా వున్నాడు. నిజంగా భయమా ఉత్తుత్తి భయమా? ఏమో గానీ ఇద్దరూ మంచివాళ్లలాగానే వున్నారు. నిజంగానే మంచివాళ్ళో...... ఉత్తుత్తి ఫోజో. వస్తారు గాని అనుకుని తలెగరేసి ఇంట్లోకి నడిచింది జయచిత్ర.

అన్నట్టుగానే శనివారం వ్యాకర్ణ, అబ్బులు 4.40 కి మూటాముల్లె పెట్టే బేడాతో, రెండు బామ్మగారింటికి రిక్షాల మీద వచ్చి బామ్మగారింటిలోకి దిగారు. జయచిత్ర చెప్పిన ప్రకారం కుడికాలు ఒకటి వ్యాకర్ణది రెండవది అబ్బులుది గదిలో ముందుగా పెట్టి గృహ ప్రవేశం చేశారు. బామ్మగారు సంతోషిస్తుందని 1.25 కొబ్బరికాయ గుమ్మంలో కొట్టారు. ఖాళీ వాటాలోకి ఇద్దరు అబ్బాయిలు వచ్చి దిగటం, ఆ అబ్బాయిలతో బామ్మగారు, బామ్మగారి మనవరాలు జయచిత్ర గల గలా మాట్లాడటం చూసి ఆ కాంపౌండ్ లో అన్ని వాటాల వాళ్ళూ పలకరింపుగా పలకరించి పోదామని వచ్చారు.

ముందుగా వచ్చింది వృద్ధ కన్య. పేరు సుకన్య, ఆమెతో పాటు ఆమె తల్లి తండ్రి. “చూడండి అల్లుడూ మీరు ఏ పేటలో ఏ ఇల్లు ఖాళీ చేసి వచ్చారు" అని అడిగాడు సుకన్య తండ్రి సుందర రామయ్య.

“నా పేరు అల్లుడు కాదు అబ్బులు. వీడి పేరు వ్యాకర్ణ" ఒళ్ళుమండి గట్టిగా అన్నాడు అబ్బులు.

“అట్లా పెట్టంది" అంది జయచిత్ర సామాన్లు సర్దుతున్న వ్యాకర్ణ వేపు ముఖం పెట్టి సుందర రామయ్యకి తగిలేట్టు. “చూడండి అల్లుడూ ఏదో వరసకి పెద్ద ముండావాడ్ని కాబట్టి పిలిచాను. నీపేరు అబ్బులా. బాగుందండోయ్" అన్నాడు సుందర రామయ్య.

“ముందా అండీ ఆ తరువాత అల్లుడూ తీసిపారేయండి. చిన్నవాళ్ళని పేరు పెట్టి పిలిస్తే ఆయు క్షీణం. ఆ మాత్రం తెలియదాండీ. పైగా పెద్ద ముండావాడ్నని చెప్పుకుంటున్నారు" .

“మామయ్యగారికి ఏమి తెలియదు బాబూ. నే చెబుతాలే" అంది సుకన్య తల్లి తులశమ్మ. తులశమ్మ వెనకే నుంచుని నోట్లో వేలు పెట్టుకుని చీకుతున్న సుకన్య వేలు తీసి బోలెడు సిగ్గుపడుతూ వుంది.

“అల్లుళ్ళకి పెళ్ళి కాలేదనుకుంటాను" అన్నాడు సుందరరామయ్య.

“అదిగో మళ్ళీ అల్లుళ్ళు అంటున్నారు" అన్నాడు అబ్బులు.

“అననులేవోయ్ అబ్బులు. వరస కలిపితే తప్పు. ఏం మనుషులో ఏమిటో".

“మీకు వరసలు కలపటం తప్ప మరేం పన్లేదు. మీకు మా ఆవిడకు అందరూ అల్లుళ్ళే. సుకన్యకి అందరూ పతి దేవుళ్ళే. వీళ్ళు ఇప్పుడే కదా వచ్చింది. కాసేప్పు వాళ్ళని సర్దుకోనిస్తారా. తరువాత పంచ భక్ష్య పరమాన్నాలతో అల్లుళ్ళని ఆహ్వానిద్దురుగాని. వెళ్ళండి" అంది జయచిత్ర.

“అల్లుడుని చూడబోతే ఈ అమ్మాయే వచ్చి ముందే గెద్దలా వాలుతోందాయే. పద పద" కోపంగా జయచిత్రని చూసి పెళ్ళాన్ని కన్నె పిల్లని తోలుకెళ్ళాడు సుందరరామయ్య. జయచిత్ర ముఖ్కం కోపంతో సిగ్గుతో ఎర్రబడింది.

“డోంట్ వర్రీ" అన్నాడు అబ్బులు భూతద్దాల్లోంచి. జయచిత్ర ముఖం మరింత కందిపోయింది. అప్పుడే ఈనిన ఆడపులిలా గుర్రుమని చూసింది అబ్బులు వైపు.