అజామిళుడి వృత్తాంతం తెలుసా!
అజామిళుడి వృత్తాంతం తెలుసా!
అజామిళుడు బ్రాహ్మణుడు. సంప్రదాయరీతిలో శాస్త్రాధ్యయనం చేశాడు. మంచి స్వభావం కలవాడు, సదాచార సంపన్నుడు, సద్గుణరాశి, మృదు స్వభావి, సత్యం సంధుడు, శుచిగా ఉండేవాడు, అహంకార శూన్యుడు. గురువు లనూ, అగ్నినీ, అతిథులనూ, వృద్ధులనూ ఆరాధించి సేవలు చేసేవాడు. సమస్త ప్రాణులనూ ఆదరించేవాడు. మితభాషి, సాధుస్వభావి. ఏ ప్రాణినీ, వ్యక్తినీ హింసించేవాడు కాదు.
మొదట్లో అలాంటి సద్గుణ సంపన్నుడైన అజామిళుడు చెడు సావాసాల వల్ల పతనమయ్యాడు. ఒక దాసి ద్వారా పదిమంది కొడుకులకు తండ్రి అయ్యాడు. వారిలో కట్టకడపటి వాడికి నారాయణ అని నామకరణం చేశాడు. ఆ ఆఖరి కొడుకు, తండ్రికి గారాలపట్టి. కొడుకుకు నారాయణ అనే పేరు పెట్టడం వల్ల మనకు ఒక సంగతి తెలుస్తుంది. ఎన్ని చెడు సావాసాలు పట్టి, ఎంత దుర్మార్గపు పనులు చేసినా అజామిళుడిలో తొలినాటి భగవన్నిష్ఠ పూర్తిగా తుడిచిపెట్టుకు పోలేదన్నమాట.
మరణశయ్యపై ఉన్నప్పుడు కొడుకు పేరు పిలుస్తూ నారాయణ స్మరణ చేశాడు. మొదట యమకింకరులు వచ్చారనీ, 'నారాయణ' అని పిలవగానే విష్ణుదూతలు వచ్చారనీ భాగవతంలో చెప్పబడింది. ఇప్పుడు ఆలోచించ వలసింది ఏమిటంటే 'నారాయణా' అని పిలిచినప్పుడు అజామిళుడి హృదయంలో భగవద్భావం కించిత్తయినా ఉదయించలేదా? 'లేదు' అనుకొందాం.
మరి, మనం కూడా ఎన్నో సందర్భాలలో దేవుడి పేరు ఎత్తుతాం కదా! మరి మన దగ్గరకు విష్ణుదూతలు రారు. ఎందుకని? కొడుకును తలచుకొని నారాయణ నామోచ్చారణ చేసినా భావానుబంధం మూలంగా, శ్రీమన్నారాయణుడి గురించి ఆలోచన కూడా వచ్చి ఉండవచ్చు. రోగం కారణంగా ఈ రెండు భావాలూ కింకర, దూతల రూపాలు దాల్చినట్లు తోచడమూ సంభవమే. 'అజామిళుడు చాలా అన్యాయాలు చేశాడు. అతడికి తగిన శాస్త్రి జరిగి తీరవలసినదే' అని యమదూతలు, 'భగవంతుని నామాన్ని స్మరించాడు కాబట్టి అతడి సర్వపాపాలు నాశనమయ్యాయి' అని విష్ణుదూతలు వాదులాడుకున్నారు.
మరణించిన అజామిళుణ్ణి విష్ణులోకానికి తీసుకెళ్ళారని అందరూ అనుకుంటారు. కానీ భాగవతంలో వేరొక విధంగా చెప్పారు. రోగం తగ్గి ఆయన సాధారణ స్థితికి వచ్చాడట. కానీ యమకింకరులు, విష్ణుదూతల సంవాదం మనస్సులో మెదులుతూనే ఉంది. తాను ఇంతకాలం చేసిన దుర్మార్గపు పనులను తలచుకొని ఆయన అమితంగా పశ్చాత్తాపం చెందాడు. 'కొడుకును తలచి, పేరు పెట్టి పిలిస్తేనే ఈ మహాపురుషుల దర్శనం, వారి మాటల శ్రవణం జరిగింది. కదా! భగవంతుణ్ణి నిజంగానే శ్రద్ధతో ఉపాసిస్తే ఎంత ఉన్నతి పొందుతానో అని తలపోశాడు.
ఇకపై పాపకార్యాలు చేయను. ఇంద్రియాలనూ, మనస్సునూ, దేహాన్నీ అదుపులో పెట్టుకొంటాను. అజ్ఞానం, కామం మూలంగా కలిగిన ఈ బంధనాలను తెంపుకొని సర్వజీవుల పట్ల సౌహార్థం, శాంతం, దయలను ప్రదర్శిస్తాను. మాయాగ్రస్థమైన ఆత్మకు విముక్తి కల్పిస్తాను. ఇప్పుడు నా బుద్ధి సత్యవస్తువులో ప్రవేశించింది. దేహం పట్ల ఉన్న 'నేను, నాది' అనే అభిమానాన్ని విసర్జిస్తున్నాను. చిత్తాన్ని కీర్తనాదుల ద్వారా శుద్ధం చేసి, ఆ శుద్ధచిత్తాన్ని భగవంతుడిలో స్థాపన చేస్తాను' అని నిశ్చయించుకున్నాడు.
అజామిళుడు సర్వాన్నీ త్యజించి, హరిద్వారం వెళ్ళి, యోగసాధనలో నిమగ్నమయ్యాడు. ఇంద్రియాలను విషయ వస్తువుల నుండి నివృత్తం చేసి మనస్సును ఆత్మలో నిలిపాడు. ఆ పైన ఏకాగ్రతతో ఆత్మ నుండి ఇంద్రియాలను విడదీసి జ్ఞానమయమైన పరబ్రహ్మంతో సంయోగం చెందాడు. అదే సమయానికి విష్ణుదూతలు వచ్చి ఆయనను వైకుంఠానికి తీసికొనిపోయారు. ఇదీ అజామిళుడి వృత్తాంతం.
*నిశ్శబ్ద.