శ్రీ నారసింహ క్షేత్రాలు – 9

 


శ్రీ నరసింహ క్షేత్రాలు – 9


నవ నారసింహ క్షేత్రం అహోబిలం

 

 

వైష్ణవులకి 108 దివ్య క్షేత్రాలు వున్నాయని అందరికీ తెలుసు.  అన్ని ఆలయాలలో దేవతా విగ్రహాలుండగా కేవలం కొన్నింటినే దివ్య క్షేత్రాలని ఎందుకన్నారో తెలుసా?  వైష్ణవ ఆళ్వారులు దర్శించి, అక్కడి దేవదేవుని స్తుతించిన వైష్ణవ క్షేత్రాలు వైష్ణవులకు దివ్య క్షేత్రాలు. వాటిలో ప్రముఖమైనది అహోబిలం. నల్లమల అడవులలో వున్న ఈ క్షేత్రం భక్తి ప్రపతులకేకాదు ప్రకృతి రామణీయకతకు కూడా ఆలవాలం.  ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి సంతోషించిన ఆది శేషుడు వయ్యారంగా పవళించాడా అన్నట్లుండే పర్వత శ్రేణి.  ఈ పర్వతాల తలభాగంలో శ్రీ వెంకటేశ్వరస్వామి, నడుముపై నరసింహస్వామి, తోకపై మల్లికార్జునస్వామి ఆవిర్భవించారని భక్తుల నమ్మకం.  వీరు కొలువైన ఈ మూడు క్షేత్రాలు, తిరుమల, అహోబిలం, శ్రీశైలంలలో స్వామి స్వయంవ్యక్తుడే. ఈ క్షేత్రాన్ని గురించి బ్రహ్మాండ పురాణంలో 10 అధ్యాయాలలో 1046 శ్లోకాలలో వ్రాయబడింది.

రాక్షస రాజైన హిరణ్యకశిపుని రాజ్యం ఇది.  తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడటానికి హరి స్తంభంనుండి నరసింహుని రూపంలో వెలువడి హిరణ్యకశిపుని వధించింది ఇక్కడే.  ఈ కధ అందరికీ తెలుసుగనుక నేను ఈ క్షేత్ర విశేషాలు మాత్రం చెబుతాను. నరసింహస్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుని తన గోళ్ళతో చీల్చి చంపినప్పుడు ఆయన బలాన్ని, శక్తిని దేవతలు “అహో బలం”  “అహో బలం” అని ప్రశంసించారుగనుక ఈ స్ధలానికి వారు కీర్తించినట్లు   అహోబలం అన్నారు.  ఎగువ అహోబిలంలో ప్రహ్లాదుని తపస్సుకి మెచ్చి నరసింహస్వామి బిలంలో స్వయంభూగా వెలిశాడుగనుక “అహో బిలం” అన్నారు. అహోబిలంలో నరసింహస్వామి ప్రముఖ ఆలయాలు రెండు వున్నాయి.  ఎగువ అహోబిలంలో, దిగువ అహోబిలంలో.  ఎగువ అహోబిలంలో స్వామి ప్రహ్లాద వరదుడై స్వయంభూగా అవతరించగా, దిగువ అహోబిలంలో శ్రీ వెంకటేశ్వరస్వామి చేత ప్రతిష్టింపబడి లక్ష్మీ నరసింహుడై భక్తులకు కోరకుండానే వరాలిస్తున్నాడు.  ముందుగా ఎగువ అహోబిలం గురించి తెలుసుకుందాము.

ఎగువ అహోబిలము
ప్రహ్లాదుని కధ జరిగిన ప్రదేశమిది.  హిరణ్యకశిపుని శిక్షించటానికి, ప్రహ్లాదుని రక్షించటానికి ఉగ్రరూపంలో హరి ప్రత్యక్షమయిన స్ధలమిది. హిరణ్యకశిపుని వధానంతరం ఉగ్రరూపంలో వున్న  స్వామిని శాంతింప చేయటానికి పరమశివుడు నృసింహ మంత్రాన్ని “మంత్రరాజ పద స్తోత్రం”గా స్తుతించి నృసింహుని శాంతింపజేసినట్లు బ్రహ్మాడ పురాణంలో వున్నది.  అందుకే ఎగువ అహోబిలంలో గర్భగుడి పక్క గుహలో జ్వాలా నరసింహస్వామిని పరమ శివుడు ఆరాధించినట్లుగా మనం దర్శించవచ్చు. విష్ణుపురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు దండకారణ్యంలో సీతాన్వేషణకి వెళ్ళినప్పుడు అహోబిల నరసింహస్వామిని దర్శించి  “నృసింహ పంచామృత స్తోత్రం” తో ఆరాధించినట్లు వున్నది. ఇక్కడ శ్రీరామచంద్రులవారి దర్శనం కూడా అవుతుంది. అలాగే శ్రీమద్భాగవతము ప్రకారం ద్వాపర యుగంలో పంచపాండవులచే పూజలందుకున్న స్వామి ఈయన.

వైష్ణవ సాంప్రదాయాన్ని అభివృధ్ధి చేయటానికి 11 వ శతాబ్దంలో రామానుజాచార్యులవారు, ఇంకా అనేక ప్రముఖ ఆళ్వారులు ఈ స్వామిని దర్శించారు.  అన్నమాచార్యుడీ స్వామిని దర్శించి కీర్తించాడు. వీరేకాక వివిధ సామ్రాజ్యాలకు చెందిన రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు శాసనాలున్నాయి.  కాకతీయ వంశంలో చివరి రాజైన ప్రతాప రుద్రడు ఈ స్వామిని దర్శించి ముఖ్యమైన బంగారు విగ్రహాలు, చెంచు లక్ష్మి శిల్పాన్ని, అంతరాలయము, వెలుపలి మంటపాలు, ద్వారపాలకులను  నిర్మించి, ఉత్సవాలకోసం తగు నిధిని ఏర్పాటు చేశారు.  అందుకే ఉత్తర ద్వారంలో వున్న ద్వార పాలకుల పీఠభాగంలో ప్రతాపరుద్ర మహారాజు తన పట్టపు రాణితో వందనం సమర్పిస్తున్నట్లు దర్శనమిస్తారు.  ఈ దేవాలయం, ప్రాకారాలు, గోపురాలు నిర్మించటానికి 13 సంవత్సరాలు పట్టినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఆది శంకరాచార్యులవారు పరకాయ ప్రవేశం చేసినపుడు తన చేతులు లేకుండా పోయినందున, ఉగ్ర నరసింహస్వామిని కరావలంబ స్తోత్రము చేయగా ఆయనకి చేతులు తిరిగి వచ్చాయి.  ఈ సన్నివేశం అహోబిలంలో జరిగింది. ఎగువ అహోబిలంలో భవనాశి అనే నది జ్వాల నుంచి ఉద్భవించి ఎగువ అహోబిలం వరకు ప్రవహిస్తూవుంటుంది.

ఎగువ అహోబిలంలోనే నరహరి తన అవతారాన్ని భక్తులకోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కనుక దీనిని నవనారసింహక్షేత్రం అటారు.  ఈ నవ నారసింహ క్షేత్ర దర్శనానికి కొంత ప్రయాస పడవలసివస్తుంది.  ఇదివరకు గైడ్ లేకుండా వెళ్ళవద్దనేవారు, అరణ్య ప్రదేశం, దోవ కనుక్కోక ఇబ్బంది పడతారని.  ప్రస్తుతం సౌకర్యాలు మెరుగుపడి వుండవచ్చు.

ఎగువ అహోబిలంలోని నవనారసింహ క్షేత్రాలు
1. జ్వాలా నరసింహ క్షేత్రము ..  ప్రధాన ఆలయానికి 4 కి.మీ. ల దూరంలో వుంటుంది.  స్తంభంనుంచి ఉద్భవించిన నరసింహుడు క్రోధాగ్ని జ్వాలలతో ఊగి పోతూండటంతో జ్వాలా నరసింహుడన్నారు.  ఇక్కడే ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుని వధించినట్లు చెప్పబడుతోంది. ఇక్కడి ఆలయంలో అష్టభుజ, చతుర్భుజ నరసింహులు, హిరణ్యకశిపుని వెంటాడుతున్న నరసింహుడు .. ఈ మూడు విగ్రహాలు ప్రతిష్టింపబడి వున్నాయి. ఇదివరకు ఇది హిరణ్యకశిపుని రాజప్రాసాదంగా భావింపబడుతోంది.  ఇక్కడే భవనాశనీ నది ప్రారంభం అవుతుంది.
2. ఆహోబల నరసింహస్వామి .. ముక్కోటి దేవతలు స్తోత్రము చేసినా కోపము తగ్గని నరసింహస్వామి ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభువుడిగా వెలిశాడు.
3. మాలోల నరసింహస్వామి  ..  ఎగువ అహోబిల ఆలయానికి ఒక కిలో మీటరు దూరంలో వున్నది.  ఇక్కడ స్వామి లక్ష్మీ సమేతుడై ప్రసన్నంగా సాక్షాత్కరిస్తారు.
4. క్రోడా (వరాహ) నరసింహస్వామి ..  భూదేవిని ఉధ్ధరించిన వరాహ నరసింహ రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు.
5. కారంజ నరసింహస్వామి  ..  కరంజ వృక్షంకింద ఆదిశేషుని పడగల కింద ధ్యాన నిమగ్నుడై దర్శనమిస్తారు.  ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చెయ్యగా ఆయనకి శ్రీరాముడు ధరించినట్లు ధనస్సుతో దర్శనమిచ్చారని ఆ పేరు అంటారు. ఈ స్వామికి మూడో కన్ను వున్నది.  అందుకే అన్నమయ్య “ఫాల నేత్రానల ప్రబల విద్ద్యులత కేళీ విహార లక్ష్మీనరసింహ” అని పాడారు.
6. భార్గవ నరసింహస్వామి  ..  పరశురాముడికి స్వామి దర్శనమిచ్చిన ప్రదేశం.
7. యోగానంద నరసింహస్వామి  ..  ఇక్కడ స్వామి యోగపట్టంతో విలసిల్లాడు.  ప్రహ్లాదుడు ఈయన అనుగ్రహంతో యోగాభ్యాసం చేశాడట.  ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం.
8. ఛత్రవట నరసింహస్వామి  ..  పద్మాసనంతో, అభయ హస్తాలతో వున్న ఈ మూర్తి చాలా అందమయిన మూర్తి.  హాహా   హువ్వా  అనే ఇద్దరు గంధర్వులు అతి వేగంగా గానంచేసి నృత్యం చేయగా నృసింహస్వామి సంతోషించి వారికి శాప విమోచనం గావించారుట.
9. పావన నరసింహస్వామి  ..  ఏడు పడగల ఆదిశేషుని క్రింద తీర్చి దిద్దిన ఈ మూర్తిని పూజిస్తే సకల పాపాలూ పోతాయి.  భరద్వాజ మహర్షి ఇక్కడ తపస్సు చేయగా స్వామి మహాలక్ష్మీ సమేతంగా దర్శనమిచ్చారు కనుక ఈయనకి పావన నరసింహస్వామి అని పేరు.

ఇవికాక ఉగ్రస్తంభం (ఇది అహోబిలంలోని ఎత్తైన కొండ, దీనిని దూరం నుండి చూస్తే ఒక రాతి స్థంబం మాదిరిగా ఉంటుంది. ఇక్కడే నరసింహస్వామి ఉద్భవించాడని ప్రతీతి

దీనిని చేరుకోవడం కొంచెం కష్ష్టం, కానీ ఒకసారి దీనిని చేరుకుంటే మంచి ట్రెక్కింగు చేసిన అనుభూతినిస్తుంది.

దీని పైన ఒక జండా (కాషాయం), నరసింహస్వామి పాదాలు ఉంటాయి.

ప్రహ్లాద బడి (ఇక్కడ బండలమీద తెలుగు అక్షరాలు వుంటాయి), భవనాశిని నదులు దర్శనీయ ప్రదేశాలు.

దిగువ అహోబిలము

ఇక్కడ స్వామిని శ్రీ వెంకటేశ్వరస్వామి పద్మావతితో తన కళ్యాణం సందర్భంగా ప్రతిష్టించి పూజించారు.  అందుకనే ఇక్కడ శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధి, కళ్యాణ మంటపాలు కూడా వున్నాయి. స్వామి కళ్యాణానికి తిరుమలనుండి పట్టు పీతాంబరాలు ఇప్పటికీ వస్తాయి.   గర్భగుడిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూర్మాసనం మీద సుదర్శన చక్రము, సుదర్శన పీఠం మీద గరుత్మంతుడు, ఆయన పైన స్వామి వున్నట్లు వుంటుంది.  తూర్పు ముఖంగా కొలువైన స్వామి చతుర్భుజుడు.  రెండు హస్తాలలో శంఖ, చక్రాలను ధరించగా, ఒక చేత్తో భక్తులకు అభయమిస్తూ, ఇంకొక చేతితో లక్ష్మీదేవిని పట్టుకుని వుంటారు.  శిరస్సు మీద ఆదిశేషుడు, మెడలో సాలగ్రామమాలతో స్వామి శాంతమూర్తిగా దర్శనమిస్తారు.  అమ్మవారు అమృతవల్లి.  ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పకళని చూడవచ్చు.

దిగువ అహోబిలంలో అంతరాలయం, గర్భగుడి, అమృతవల్లి సన్నిధి, ఆండాళ్ సన్నిధి వరకు ప్రతాప రుద్ర మహారాజు కట్టించినట్లు, బయట రంగ మంటపము, ప్రాకారాలు, రాజగోపురం, శ్రీ కృష్ణ దేవరాయలు కట్టించినట్లు, మిగతా మంటపాలను సదాశివరాయలు, రంగరాయలు కట్టించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఈ క్షేత్రం అభివృధ్ధికి ఎందరో రాజులు కృషి చేస్తే 15వ శతాబ్దంలో తురుష్కల దండయాత్రకు పాల్పడింది ఈ క్షేత్రం.   రంగరాయల ప్రభువు తురుష్కలమీద విజయం సాధించి జియరుగారికి అహోబిల క్షేత్రాన్ని అప్పగించి, ఆ  విజయానికి గుర్తుగా రాతి ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టించారు.  విజయస్తంభంగా పిలువబడే దీనిని ఇప్పుడూ చూడవచ్చు.

ప్రతాప రుద్ర మహారాజు బంగారంతో ప్రతిరోజూ ఒక శివలింగాన్ని పోతపోయించి, దానిని పూజించి బ్రాహ్మణునికి దానమిచ్చేవారట.  ఒకసారి కంసాలి ఎన్నిసార్లు పోతపోసినా శివలింగంబదులు  నృసింహాకృతి వచ్చిందట.   ఆ విగ్రహాన్ని మొదటి అహోబల పీఠాధిపతికి అప్పగించి జీవితాంతం నరసింహుని పూజించాడు.

చరిత్ర

క్రీ.శ. 1830లో వెలువడిన మొదటి యాత్రా రచన శ్రీ ఏనుగుల వీరాస్వామిగారు రచించిన కాశీయాత్రలో కూడా ఈ క్షేత్రం గురించి వర్ణించారు.  దాని ప్రకారం 1830 నాటికి దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం నడుమ దట్టమైన అడవి వుండేది.  ఆ స్ధలం కుంభకోణం వద్ద వుండే అహోబళం జియ్యరువారి అధీనంలో వుండేది.

ఈ ప్రదేశము నివాస యోగ్యము కాకపోవటంతో అహోబిలానికి 2 క్రోసుల దూరంలో వున్న బాచపల్లెలో వుండవారు కార్యనిర్వాహకులు.  ఆ సమయంలో ఇక్కడ ఏమీ దొరికేవికాదు.  ఉప్పుకోసమైనా 2 క్రోసుల దూరంలో వున్న బాచపల్లెకు వెళ్ళాల్సి వచ్చేది.  దిగువ అహోబిలం దగ్గర కొన్ని పేదల గుడిసెలు వుండేవిగానీ ఎగువ అహోబిలంలో అవీ లేవు.  గుడి ఖర్చులకు జియ్యరు పంపే డబ్బులుతప్ప వేరే ఆధారం ఏమీ లేదు.  అక్కడ ప్రతిఫలించియున్న పరమాత్మ చైతన్యము, స్వ ప్రకాశము చేత లోకులకు భక్తిని కలుగజేయుచున్నదిగానీ, అక్కడ నడిచే యుపచారములు దానికినేపాటికీ సహకారిగా నుండలేదు అని తన గ్రంధంలో వ్యాఖ్యానించారు.

ఉత్సవాలు

అన్ని వైష్ణవ ఉత్సవాలతోబాటు ఫాల్గుణ శుధ్ద పంచమి మొదలు పౌర్ణమి వరకు ఎగువ, దిగువ అహోబిలాలలో 10 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.  శ్రీ అహోబిల పీఠాధిపతుల ఆధ్వర్యంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.  ఈ ఉత్సవాలకి ముందు పార్వేట ఉత్సవాలు 45 రోజులు జరుగుతాయి.  స్వామి తన వివాహ మహోత్సవానికి భక్తులను తనే స్వయంగా ఆహ్వానిస్తానని అన్నారుట.  అహోబిలం పరిసరాలలోవున్న 34 గ్రామాలలో ఈ 45 రోజులూ స్వామి తన వివాహానికి భక్తులను ఆహ్వానించటానికి సంచరిస్తారు.  దీనినే పార్వేట ఉత్సవమంటారు.  ఈ 45 రోజులూ ఆ గ్రామాలలో పండగ వాతావరణం నెలకొంటుంది.  ఎన్నో వేడుకలు జరుగుతాయి.  స్వామి పల్లకి మోసే బాధ్యత ఇక్కడి కొన్ని కుటుంబాలవారికి తరతరాలుగా వంశ పారంపర్యంగా వస్తున్న సంప్రదాయం.  600 సంవత్సరాల క్రితం ఆనాటి ప్రధమ పీఠాధిపతి శ్రీ శఠగోప యతీంద్ర మహదేశికన్ ఈ బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టినప్పటినుంచి ఇప్పటివరకు వైభవంగా జరుగుతున్నాయి.

మార్గము

కర్నూలు జిల్లాలో వున్న ఈ క్షేత్రం నంద్యాల కు 68 కి.మీ. ల దూరంలో, ఆళ్ళగడ్డకు 24 కి.మీ. ల దూరంలో వున్నది.  అన్ని ప్రధాన ప్రదేశాలనుంచి ఈ ఊరు చేరటానికి రవాణా సౌకర్యం వున్నది.

వసతి

ఇక్కడ వుండటానికి సత్రాలు వున్నాయి.  భోజన సదుపాయాలకు సత్రాలలో ముందు చెప్పాలి.  దిగువ అహోబిలంలో ఎ.పి.టూరిజం వారి రెస్టారెంటు వున్నది.  అడవి ప్రదేశంగనుక మొదటిసారి వెళ్ళేవారు వెలుతురు వుండగానే వెళ్తే ఇబ్బంది పడకుండా వుంటారు.

దైవ భక్తి వున్నవారేకాక, ప్రకృతి సౌందర్యారాధకులు, ట్రెక్కింగ్ ప్రియులు తప్పక సందర్శించవలసిన క్షేత్రం ఇది.

- పి.యస్.యమ్.లక్ష్మి