గురువుకి, ఆచార్యుడికి భేదం వుందా...
గురువుకి, ఆచార్యుడికి భేదం వుందా...
చాలామందికి ఓ సందేహం వస్తూ వుంటుంది. గురువు, ఆచార్యుడు ఒక్కటేనా... రెంటికీ భేదం వుందా? ఈ సందేహానికి ప్రముఖ ఆధ్మాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ఇచ్చిన సమాధానమిది.
గురువు, ఆచార్యుడు... తత్వతః గురువుకు, ఆచార్యుడికి ఏ విధమైన భేదమూ వుండదు. కానీ, ఒక్క సున్నితమైన భేదం మాత్రం వుంటుంది. గురువు పరబ్రహ్మ తత్వాన్ని అనుభవించిన వాడు... ’’బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి’’ అని. బ్రహ్మమును ఎవరు అనుభవిస్తాడో వాడే బ్రహ్మము అవుతాడు. గురువు కూడా అలాంటి స్థాయికి చేరిన వ్యక్తి. ఆయన పరబ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకున్న కారణం చేత ఆయనే పరబ్రహ్మం. అందుకే గురువును ‘‘గురుబ్రహ్మ... గురుర్విష్ణుః... గురుదేవో మహేశ్వరః.. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః’’ అంటారు. ఆ గురువే పరబ్రహ్మ స్వరూపుడు... ఆయనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే మూడు రూపములను పొందినవాడు. అటువుంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నత స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యులైన వారు శాస్త్రాన్ని ఎలా ఆచరించారో ఆయన కూడా అలా ఆచరించాలని నియమం లేదు. ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన స్థాయిని తక్కువగా అంచనా వేయకూడదు.
ఒక ఉదాహరణ చెప్పాలంటే, భగవాన్ రమణులు మహాపురుషులు, ఆయన బ్రహ్మం స్థాయిని పొందినవారు. ఒక అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిలో ఓలలాడుతూ వుండేవారు. అసలు ఎప్పుడూ కూడా ఆ స్థాయి నుంచి ఒక్కక్షణం కూడా కిందకి వచ్చేవారు కాదు. శరీరాన్ని చూపించి ‘ఇది.. ఇది’ అంటూ దాని నుంచి వేరుగా వుండేవారు. అసలు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురు స్వరూపమైన రమణ మహర్షి సంధ్యావందనం చేయాలని, యజ్ఞోపవీతం వేసుకోవాలని, గోసెపోసి పంచె కట్టుకోవాలనే నియమాలేవీ ఆచరించలేదు. వేదం ఎలా చెబితే ఆయన అలా ప్రవర్తించాలని, అలా ప్రవర్తించకపోతే ఆయనకు దోషం వస్తుందని చెప్పలేం. రమణుల వంటి గురువులు అగ్నిహోత్రం లాంటివారు. ఆ స్థాయికి చేరిన మహాపురుషులు కర్మాచరణాన్ని శాస్త్రీయంగా చేశారా, చేయలేదా అనే విషయంతో సంబంధం వుండి. వారు ఎప్పుడూ జ్ఞానంలో ఓలలాడుతూ వుంటారు. అందుకే ఎప్పుడూ రెండు విషయాలను జ్ఞాపకంలో పెట్టుకోవాలి. జ్ఞానిని అనుకరించే ప్రయత్నించే ప్రయత్నం చేయకూడదు. అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు. ఎందుకంటే, ఆ స్థాయికి చేరుకున్న వ్యక్తి సంధ్యావందనం చేయరు. రమణ మహర్షి సంధ్యావందనం చేయలేదు కాబట్టి నేనూ చేయను అనడం మహా పొరపాటు. ఆ స్థాయికి చేరిపోయిన తర్వాత ఇక చేశారా, చేయలేదా అనే దానితో నిమిత్తం లేదు.
కానీ ఆ స్థాయికి వెళ్ళకుండా రమణ మహర్షిని ఆదర్శంగా తీసుకుని నేను గోచీ పెట్టుకుంటాను... రమణ మహర్షి సంధ్యావందనం చేయలేదు కాబట్టి నేనూ చేయను... రమణ మహర్షి లౌకికమైన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించలేదు కాబట్టి నేనూ అలాగే ప్రవర్తిస్తానండీ అంటే అనుకరించడం చేత రమణ మహర్షి స్థాయిని ఎవరూ చేరలేరు. పరమ భక్తితో కర్మాచరణం చేయగా చేయగా అనుగ్రహించిన భగవంతుడి కారుణ్యమే జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఒక్కసారి జ్ఞానం కలిగితే అదే మోక్షానికి హేతువవుతుంది. జ్ఞానము కలిగిన జ్ఞాని శరీరం ఉన్నప్పటికీ శరీర భ్రాంతి వదిలి నేను శరీరం కాదు ఆత్మ అనే జాగరూకత కలిగి వుండి అద్వైతానుభూతిలో ఓలలాడుతూ వుంటాడు. అలా ఓలలాడుతుండే వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు కూడా శరీరంతో తాదాత్మతత పొందకుండా సాక్షిగా చూస్తాడు. అందుకే గురువు అందరూ ఎలా ప్రవర్తిస్తున్నారో, వైదికమైన ప్రవర్తనకు కట్టుబడి వున్నారో అలా కట్టుబడి వుండాలని అని మనం భావించడం పొరపాటు. కానీ గురువు లీల, గురువు మాట పరమ శక్తివంతం. గురువు ఎప్పుడు నోరు విప్పినా లోకోద్ధరణ కోసమే నోరు విప్పుతారు. లేకపోతే అసలు ఆయనకు నోరు విప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గురువు సహజ స్థితి మౌనం. తనలో తాను రమిస్తూ మౌనంగా వుంటారు. అందుకే భగవాన్ రమణులకు మౌనయోగి అని పేరు. ఆయన నోరు విప్పి మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నట్టు? రెండో వస్తువుతో మాట్లాడుతున్నారంటే అద్వైతంలోంచి కిందకి వచ్చినట్టే కదా... అందుకనే ఆయన ఎప్పుడూ అలా కిందకు దిగరు. ఎప్పుడూ మౌనంగా వుంటారు. మౌనంగా వుంటూ పరబ్రహ్మంగా అనుభవంలో ఎప్పుడూ రమిస్తూ వుంటారు. అలాంటి స్థాయి పొందిన మహానుభావులను ‘గురువు’ అని పిలుస్తారు.
ఇక రెండోవారు ఆచార్యుడు. ఆచార్యుడు అన్నమాటకు అర్థం ఏమిటంటే, ఆయన కూడా గురువే. ఆయన కూడా పరబ్రహ్మాన్ని తెలుసుకున్నవాడే, పరబ్రహ్మాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నవాడే. పరబ్రహ్మముగా నిలిచినవాడే. కానీ, ఆచార్యుడు వేదం ఎలా చెప్తే అలా ప్రవర్తిస్తూ వుంటాడు. లోకానికి మార్గదర్శకత్వం వహించడం కోసమే ఆయన కట్టుబడి వుంటారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మహాజ్ఞాని. ఆయన చాలా గొప్ప సద్గురువు. కానీ, సన్యాసాశ్రమ నియమాలను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఆచరించేవారు. ఆశ్రమ ధర్మాలను అనుసరించేవారు. అవి పాటించకపోయినంత మాత్రం చేత ఆయన స్థాయేమీ దిగిపోదు. కానీ ఆయన ఎందుకు పాటిస్తారంటే... మనందరికోసం.. నేను సన్యాసాశ్రమంలో వుండి ఆశ్రమ నియమాలు ఇలా పాటిస్తున్నాను. నువ్వు బ్రహ్మచారివైతే బ్రహ్మచార్య నియమాలను ఇలా పాటించు. గృహస్తువైతే గృహస్తాశ్రమ ధర్మాలను ఇలా పాటించు. వానప్రస్థువైతే వానప్రస్థ ధర్మాన్ని ఇలా పాటించు అని ఆయన మనకు చెప్పకుండానే చెప్పారు. ధర్మం వర్ణం, ఆశ్రమం అనే వాటిమీద ఆధారపడుతుంది. ఆ ఆశ్రమం మీద ఎలా ఆధారపడాలో వేదం ఎలా చెప్పిందో అలా పాటిస్తూ ఎక్కడా ఒక్క విషయాన్ని తప్పకుండా ఆచరించిన గురు స్వరూపాలకు పేరు చివర బిరుదునామం కలుపుతారు. అదే ‘ఆచార్య’. అదే చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య, ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య, వ్యాసాచార్య. అంటే, వీళ్ళందరూ గురు స్వరూపాలే... బ్రహ్మమును అనుభవించిన వారే. వారే పరబ్రహ్మ స్వరూపులు.
పరబ్రహ్మం కంటితో కనిపించదు. అది మనసుతో అనుభవించాల్సింది. అదే పరబ్రహ్మం కాళ్ళూ చేతులతో మన కళ్ళముందు కదిలితే ఆయనే గురువు. అటువంటి స్థాయి కలిగి, మనం ఎలా వుండాలో, ఏ విషయాన్ని ఎలా ఆచరించాలో అనుగ్రహ భాషణం చేసే గురువులను ఆచార్యులు అంటారు. తత్వతః ఈ ఒక్క భేదం మినహా గురువుకి, ఆచార్యుడికి పెద్దగా భేదం వుండదు. ఇద్దరూ రగిలిపోతున్న జ్ఞానాగ్నిహోత్రాలు.
-అంతర్యామి