సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని ప్రసాదించే ఆడి కృత్తిక.. దీని విశిష్టత, ప్రాముఖ్యం ఏమిటంటే..!

 

సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని ప్రసాదించే ఆడి కృత్తిక.. దీని విశిష్టత, ప్రాముఖ్యం ఏమిటంటే..!

ఆడి కృత్తిక దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావించబడుతుంది. తమిళ క్యాలెండర్‌లోని ఆడి మాసం అంటే.. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాడంలో వచ్చే కృత్తిక నక్షత్రం రోజున ఈ ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ రోజు ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు.

ఆడి కృత్తిక ప్రత్యేకత..

హిందూ పురాణాల ప్రకారం, శివుని నుండి వెలువడిన దివ్య తేజస్సు ఆరు కృత్తిక దేవతల సంరక్షణలో పెరిగాయి. అనంతరం పార్వతీదేవి ఆ బిడ్డను  ఆశీర్వదించగా.. ఆరు ముఖాలతో కూడిన షణ్ముఖ స్వరూపుడు అవతరించాడు. అందువల్ల కృత్తిక నక్షత్రానికి సుబ్రహ్మణ్య స్వామితో చాలా సన్నిహితమైన సంబంధం ఉంది.

ఆడి మాసంలో దేవీ శక్తి ఆరాధన కూడా విశేషంగా జరుగుతుంది. ఈ కాలంలో శివశక్తుల అనుగ్రహం అధికంగా ఉంటుందని, ఆ శక్తి సుబ్రహ్మణ్య స్వామి ద్వారా భక్తులకు లభిస్తుందని విశ్వాసం. అందుకే ఈ రోజున స్వామివారిని ఆరాధించడం ద్వారా ధైర్యం, విజయం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తి కలుగుతాయని నమ్ముతారు.

ఆడి కృత్తిక పురాణ ప్రాముఖ్యత..

కృత్తిక నక్షత్రం అగ్నితో సంబంధం కలిగిన నక్షత్రంగా వేదాలలో పేర్కొనబడింది. అగ్ని స్వచ్ఛతకు, జ్ఞానానికి, శక్తికి ప్రతీక. సుబ్రహ్మణ్య స్వామి కూడా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే దేవతగా భావించబడతాడు. తమిళ సంప్రదాయంలో ఆడి కృత్తిక రోజున సుబ్రహ్మణ్య ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ముఖ్యంగా ఆరుపడై వీడు గా పిలుచుకునే ఆరు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశేష పూజలు, అభిషేకాలు, అలంకారాలు, ఉత్సవాలు జరుగుతాయి.

ఈ రోజును ఎలా ఆచరించాలి?

ఆడి కృత్తిక రోజున భక్తులు తెల్లవారుజామునే స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి స్వామివారిని ఆరాధిస్తారు.

ముఖ్యంగా..  ఉపవాసం లేదా ఒక్కపొద్దు  ఉండటం చేస్తారు. 

సుబ్రహ్మణ్య స్వామికి పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి లతో.. పంచామృత అభిషేకం..  చందనం అభిషేకం చేయడం ఎంతో మంచిది.

ఎరుపు లేదా పసుపు రంగు పుష్పాలతో అర్చన చేయడం స్వామికి ఎంతో ప్రీతి.

"ఓం శరవణభవాయ నమః", "ఓం సుబ్రహ్మణ్యాయ నమః", "స్కంద షష్టి కవచం", "సుబ్రహ్మణ్య భుజంగం", "కంద శష్టి కవచం" వంటి స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల స్వామి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.

ఆలయ దర్శనం చేసి దీపారాధన చేయడం మరింత పుణ్యప్రదం.  అన్నదానం లేదా దానధర్మాలు చేస్తే స్వామి సంతోషిస్తాడు.

కొంతమంది భక్తులు ఈ రోజున కావడి సేవ, పాలకుండ సమర్పణ వంటి ప్రత్యేక మొక్కుబడులు తీర్చుకుంటారు.

ఆడి కృత్తిక ఎవరు ఆచరించాలి?

ఆడి కృత్తిక ముఖ్యంగా.. సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు ఎంతో విశిష్టమైనది.  కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారికి, 
కుజ గ్రహ సంబంధిత దోషాలు ఉన్నవారికి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే..  ధైర్యం, విజయం, విద్య, ఉద్యోగం, సంతానం లభిస్తాయని పురాణాలు, పండితులు చెబుతున్నారు.  నాగదోష నివారణ కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే వారికి కూడా ఈరోజు చాలా ముఖ్యమైంది.

అయితే ఈ రోజున స్వామిని భక్తితో ఆరాధించడానికి ప్రత్యేక అర్హత అవసరం లేదు. ఏ భక్తుడైనా శ్రద్ధతో పూజించవచ్చు.

                         *రూపశ్రీ.