సుబ్రహ్మణ్య స్వామి సర్ప రూపంలో ఎందుకుంటారో తెలుసా..
సుబ్రహ్మణ్య స్వామి సర్ప రూపంలో ఎందుకుంటారో తెలుసా..
సుబ్రహ్మణ్య స్వామి శివుడి దివ్య తేజస్సు నుండి పుట్టిన వాడు. ఈయనకు కార్తికేయుడు, షణ్ముకుడు, కుమారస్వామి, స్కందుడు అని వివిధ పేర్లు కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి షష్టి తిథిన జన్మించాడు. అందుకే షష్టి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలామంది సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ప్రతి నెలా వచ్చే షష్టి తిథి రోజున ఉపవాసం ఉండి స్వామిని సేవించుకుంటారు. అయితే చాలా చోట్ల సుబ్రహ్మణ్య స్వామి సర్ప రూపంలో దర్శనం ఇస్తుంటాడు. దీని వెనుక చాలా ఆసక్తికరమైన కథనం ఉంది. అదేంటో తెలుసుకంటే..
శివుడి దగ్గర గణాలు ఉంటాయి. ఆ గణాలకు అధిపతిగా తన కుమారులలో సమర్థుడిని ఉంచాలని పరమేశ్వరుడు సంకల్పించాడు. సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకుడికి మధ్య పరీక్ష పెట్టే పరిస్థితి వచ్చింది. ఎవరైతే ముల్లోకాలలో ఉన్న నదులలో స్నానం చేసి మొదటగా నా దగ్గరకు వస్తారో వారికే గణాధిపత్యం ఇస్తానని చెబుతారు. ఈ పరీక్షలో వినాయకుడే గెలుస్తాడు. ఈ గణాధిపత్య విషయంలో అలిగి శ్రీశైలం ప్రాంతానికి వెళ్లాడట సుబ్రహ్మణ్య స్వామి. అక్కడ ఆదిశేషువు మనవరాలు అయిన వల్లీని చూసి ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే తను సర్పరూపంలో ఉంటాను కనుక సుబ్రహ్మణ్య స్వామి కూడా సర్ప రూపంలో ఉండాలని ఆమె కోరగా.. ఆమె కోరిక మేరకు సర్పరూపం ధరించినట్టు ఒక పురాణ కథనం చెబుతోంది.
మరొక కథనం ప్రకారం.. సనక సనందాదులు ఒక సారి కైలాసానికి వచ్చారట. నగ్నంగా ఉన్నవారిని చూసి సుబ్రహ్మణ్య స్వామి నవ్వారట. అప్పుడు పార్వతీ దేవి సుబ్రహ్మణ్య స్వామిని మందలించారట. తల్లి మందలించిన తరువాత సుబ్రహ్మణ్య స్వామి మోపిదేవి ప్రాంతానికి వెళ్లి అక్కడ సర్ప రూపంలో తపస్సు చేశారని మరొక పురాణం కూడా వ్యాప్తిలో ఉంది.
సుబ్రహ్మణ్య స్వామి చక్రాధిష్టాన స్వరూపం. మనిషిలో కుండలినీ శక్తి సర్పరూపంలోనే చుట్ట చుట్టుకుని ఉంటుంది. ఈ కుండలినీ శక్తి యోగ, ధ్యానం, మంత్ర, తంత్ర, యంత్ర.. వంటి వివిధ పద్దతులలో జాగృతం చేస్తారు. ఇలా జాగృతం చేసిన తరువాత బ్రాహ్మి స్థానాన్ని ఆవహించి అందులో బ్రహ్మతత్వాన్ని అనుగతం చేయడమే సుబ్రహ్మణ్య తత్వం అని చెబుతారు. అర్థమయ్యేలా చెప్పాలంటే సుబ్రహ్మణ్య తత్వం మనిషిలో కుండలినీ శక్తిని జాగృతం చేసి బ్రహ్మతత్వం అర్థమయ్యేలా చేయడమే.. మనిషిలో బ్రహ్మజ్ఞానాన్ని మేల్కొలపడమే.
ఇలా సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉండటం వెనుక వివిధ కథనాలు.. కారణాలు ఉన్నాయి.
*రూపశ్రీ.