హనుమంతునికి మరణదండనా!
హనుమంతునికి మరణదండనా!
రామాయణంలో రామరావణ యుద్ధాన్ని మించిన రసవత్తరమైన ఘట్టాలు చాలానే ఉన్నాయి. పెద్ద కథలు వాటి మాటున పిట్టకథలు భక్తులను అలరిస్తూ, ఏదో ఒక సందేశాన్ని అందిస్తూనే ఉన్నాయి. కొన్ని మూలరామాయణంలోనూ, కొన్ని జానపదాలలోనూ కనిపించే ఈ అసంఖ్యాక కథలలో ఒకటి...
రామరావణ సంగ్రామం ముగిసింది. సీతాసమేత శ్రీరాములు అయోధ్యకు పట్టాభిషిక్తులయ్యారు. రాముని విజయంతో అయోధ్యాపురి నిరంతరం సందడి సందడిగా ఉంది. అలాంటి ఓ శుభసందర్భంలో వశిష్ట, విశ్వామిత్ర వంటి మహర్షులెందరో ఒక చోట చేరి సంభాషించుకోవడం మొదలుపెట్టారు. మాటల సందర్భంలో రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అన్న సందేహం దిశగా సంభాషణ సాగింది. కొందరు సాక్షాత్తూ శ్రీరాముని మించి అతని నామం ఎలా గొప్పదవుతుందని ప్రశ్నించారు. నారదుడు మాత్రం రామునికంటే రామనామమే గొప్పదన్నాడు. అనడమే కాదు! ఆ విషయాన్ని నిరూపిస్తానంటూ సవాలు విసిరాడు. నారదుని మాటలతో చర్చ వేడెక్కింది. కాసేపటికి ఎవరి మానాన వారు వెళ్లిపోయారు. నారదుడు మాత్రం తన సవాలుని నిజం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
నారదుడు నిదానంగా హనుమంతుడు ఉండే చోటుకి బయల్దేరాడు. అతని చెంతకు చేరి ‘హనుమంతా! రేపు రాముని దర్బారుకి గొప్ప గొప్ప మునీశ్వరులు రానున్నారు. వారికి నువ్వు పేరుపేరునా ప్రణామాలు అందించాలి,’ అన్నాడు. ‘అదేంటి! విశ్వామిత్రులను ఎందుకు పట్టించుకోకూడదు?’ అన్నాడు హనుమంతుడు ఆసక్తిగా. ‘విశ్వామిత్రడు రాజర్షి కదా! రాజైన రాముని ముందు మరో రాజుకి నువ్వు ప్రణమిల్లాల్సిన అవసరం లేదు!’ అని ఓ వివరణను అందించాడు.
నారదుడు చెప్పిన వివరణ హనుమంతునికి సబబుగానే తోచింది. మర్నాడు ఆయన చెప్పిన విధంగానే దర్బారులో ఉన్న రుషులందరికీ పేరుపేరునా ప్రణమిల్లి విశ్వామిత్రుని దాటవేశాడు. విశ్వామిత్రుడూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ నారదుడు ఊరుకుంటాడా! వెళ్లి పదేపదే ‘హనుమంతుడు నిన్ను కావలనే నిర్లక్ష్యం చేశాడు. తన ప్రవర్తనతో నిన్ను అవమానించాడు’ అంటూ రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు.
తొలుత నారదుని మాటలను వినీవిననట్లు ఉన్న విశ్వామిత్రుడి అహంకారం మీద నిదానంగా ఆ మాటలు ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. వెంటనే శ్రీరాముని వద్దకు పోయి జరిగిన అవమానాన్ని చెప్పుకొచ్చాడు. హనుమంతుని కఠినంగా శిక్షించమని శాసించాడు.
విశ్వామిత్రుడంటే మాటలా... రాముడు యుక్తవయసుకి చేరుకోగానే తనతో అడవులకు తీసుకుపోయి సకల అస్త్రవిద్యాలనూ అందించాడు. ఆపై సీతమ్మతో వివాహాన్ని దగ్గరుండి జరిపించాడు. అలాంటి గురుతుల్యులకు అవమానం జరిగితే దాన్ని చూసీ చూడనట్లు ఉండటమంటే... తాను కూడా ఆయనను అవమానించినట్లు అవుతుంది. అందుకని హనుమంతునికి మరణదండను విధించాడు రాముడు. అంతేకాదు. ఆ దండనలో భాగంగా తానే తొలి బాణాన్ని వదులుతానని చెప్పాడు. విషయం తెలిసిన హనుమంతుడు బిత్తరపోయాడు. అయినా రామనామాన్ని జపిస్తూ నిశ్చలధ్యానంలో మునిగిపోయాడు.
దండనకు సమయం ఆసన్నమైంది. రాముడు తన విల్లంబులతో హనుమంతుని ఎదుటకు చేరుకున్నాడు. మనసు చంపుకుని విల్లుని ఎక్కుపెట్టి హనుమంతుని గుండెకేసి రామబాణాన్ని వదిలాడు. చిత్రం! ఆ బాణం హనుమంతుని తాకకుండానే నేలకొరిగిపోయింది. మరో బాణం, ఇంకో బాణం... ఇలా ఎన్ని బాణాలు విడిచినా ఇదే పరిస్థితి! ఇలా కొంతసేపు జరిగిన పిమ్మట రాముడికి విషయం బోధపడింది. చిరునవ్వుతో నారదుని వంక చూశాడు.
"ప్రభూ! దైవం కంటే దైవం పట్ల విశ్వాసమే ప్రబలమైనదని నిరూపించేందుకే ఈ నాటకాన్ని ఆడించాను. భగవంతుడు అన్నప్పుడు దైవశక్తి ఒక్కటే ఉంటుంది. కానీ దైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించేటప్పుడు దైవశక్తీ, ఆ దైవం పట్ల విశ్వాసం కలిగిన మానవుని ఇచ్ఛాశక్తీ రెండూ కలిసి అపాయాన్ని ఎదుర్కొంటాయి. ఈ విషయం మీకు తెలియనిది కాదు. కానీ లోకానికి కూడా ఈ సత్యాన్ని చాటేందుకు ఈ పని చేశాను. క్షమించండి!’ అంటూ వేడుకున్నాడు. రాముడు తన విల్లంబులను పక్కన పెట్టి హనుమంతుని దిశగా అడుగులు వేశాడు.
- నిర్జర.