కళల కాణాచి రామప్ప దేవాలయం

 



కళల కాణాచి రామప్ప దేవాలయం

 

 

వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం కళల కాణాచి అని చెప్పవచ్చు.  ఇది కాకతీయుల కళా తృష్ణకి మరో కలికితురాయి.  కాకతీయ గణపతి దేవ చక్రవర్తి యొక్క సేనాని రేచర్ల రుద్రయ్య 800 సంవత్సరాల క్రితం నిర్మించిన  దేవాలయం  ఇది.  కాల గర్భంలో అనేక ఢక్కా మొక్కీలు తిన్నది.  అయినా నేటికీ ఆ ఆలయం అపూర్వంగానిల్చింది. ఇప్పటికీ  ఈ ఆలయాన్ని దర్శించిన ప్రతివాళ్ళూ  నాటి మనవారి నిర్మాణ కౌశలాన్నీ, శిల్ప కళా చాతుర్యాన్నీ మెచ్చుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.

 

కాకతీయుల రాజ్య పతనానంతరం 600 ఏళ్లపాటు ఆదరణ లేక కళా విహీనమైన ఈ దేవాలయాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చినది హైదరాబాదుకు చెందిన అసిఫ్ జాహి రాజవంశమువారు.  వారీ ప్రాంతానికి వేటకై వచ్చినప్పుడు ఈ ఆలయం, రామప్ప చెరువు చూసి, ఆ కళా ఖండాలు అలా శిధిలమయిపోకూడదని వాటి పునరుధ్ధరణ కార్యక్రమాలు చేబట్టారు.  ఆ ప్రాంతపు పెద్దలుకూడా తమ పంటపొలాలను ఆలయ పోషణకు దానముగా ఇచ్చి తోడ్పడ్డారు. ఈ ప్రఖ్యాత ఆలయ నిర్మాత కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రయ్య.  గుడి ఆవరణలో ఈయన వేయించిన శాసనము ప్రకారం గుడి నిర్మాణం క్రీ.శ. 31-3-1213 నాటికి పూర్తయినట్లు వున్నది.  ఈ ఆలయానికి రామప్ప దేవాలయం అనే పేరు రావటానికి కారణం తెలియదు.  ముఖ్య శిల్పి పేరు రామప్ప అయివుండచ్చని ఒక కధనం.

గుడి ఆవరణలో నంది మంటపంతోపాటు మరో 3 ఆలయాలున్నాయి.  అవి కాటేశ్వరాలయం, కామేశ్వరాలయం, ఇంకొకటి బహుశా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.  వీటిలో కొన్ని శిధిలావస్ధలో వున్నాయి.  ప్రధాన ఆలయం, రుద్రేశ్వరాలయంలో తప్ప మిగతావాటిలో పూజలు జరగటంలేదు.

 

 

ఇక్కడ ఆలయం వెలుపల ప్రత్యేక మండపంలో వున్న నంది విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.  నల్లరాతిలో చెక్కబడి, జీవకళ వుట్టి పడుతున్నట్లుండే  ఈ నంది గంటలు, ఆభరణాలు చెక్కటానికి శిల్పి ఎంత శ్రమించాడో అనిపిస్తుంది.  శిల్పకళలో ఆసక్తి లేనివారయినా సరే ఆ నందీశ్వరుణ్ణి చూస్తూ కొంచెంసేపు అన్నీ మరచిపోతారు. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ వుండే గైడ్ సహాయం తీసుకోండి.  ఆయనకి ముందే మీ ఆసక్తి చెప్పి, అన్నీ వివరించి చెప్పాలి అని చెప్పండి.  అప్పుడే ఎన్నో అద్భుత శిల్పాలను వదలకుండా, వివరాలతో చూడవచ్చు.  మీ అంతట మీరు చూస్తే కొన్ని అర్ధం కాకపోవచ్చు, కొన్ని వదిలెయ్యవచ్చు.

గుడి గోడపై చెక్కబడ్డ శిల్పాలను శ్రధ్ధగా చూడండి.  ప్రదక్షిణ ఎక్కడ మొదలు పెట్టాలో మనకు దారి చూపిస్తూ చిన్న ఏనుగుల వరస చెక్కబడివుంది.  ఈ వరసలో మొదట ఒక వ్యక్తి కత్తి పట్టుకుని వుంటాడు.  చివరి ఏనుగు దేవుని ముందు భక్తితో తలవంచుకుని వుంటుంది.  ఈ ఏనుగుల వరసపైన రెండు విప్పారిన తామర పువ్వుల వరస చెక్కబడ్డది. వీటి మధ్య, గుడి కప్పులోవున్న సుందరీమణుల విగ్రహాల సూక్ష్మ రూపాలు చెక్కబడివున్నాయి.  అంతేకాదు..ఈ గోడలను పరిశీలించి చూస్తే శైవ, వైష్ణవ, బౌధ్ధ, జైన మతాల దేవతలు, మహనీయుల శిల్పాలున్నాయి.  ఇవి ఆనాటి రాజుల సర్వమత సమైక్యతను తెలియజేస్తోంది. 

ఇంకా ముఖ్యమైనవి, ఆకాలంలో స్త్రీల విలువని తెలియజెప్పే విగ్రహాలు, జంధ్యం ధరించిన స్త్రీ.. ఆ కాలంలో స్త్రీలు వేదాధ్యయనం చేసేవారని తెలియజేస్తుంది.   స్త్రీలు ధర్మ ప్రచారం చేసేవారనటానికి గుర్తుగా రుద్రాక్ష మాలను జంధ్యముగా ధరించిన స్త్రీ మూర్తిని  చూడవచ్చు.  అలాగే, స్త్రీలు యుధ్ధ విద్యలలో ఆరితేరారనటానికి రెండు ఏనుగులతో పోరాడే యువతి, కత్తి ధరించిన యువతి  వగైరా.  ప్రతి బొమ్మలవరుస మొదలు, చివర మానవుడి ప్రారంభ దశ,  చేరవలసిన గమ్యాలను తెలియజేస్తాయి.

ఆలయం స్తంబములకు, పై కప్పుకు మధ్యగల ప్రదేశంలో ప్రస్తుతం 26 ఏనుగు పైన సింహము వున్న విగ్రహాలున్నాయి.    కాకతీయ రాజుల బిరుదాలయిన రాయగజకేసరి, అరిగజకేసరిలకు గుర్తుగా ఇవి చెక్కబడి వుండవచ్చు.  ఇవికాక ఆలయానికే పేరు తెచ్చిపెట్టిన 12 సాలభంజికలు  మూర్తులు అపురూపాలు.  ఒక్కొక్కటి ఒక్కొక్క విలక్షణమైన హావభావాలతో చెక్కబడ్డాయి.   ఈ సుందర మూర్తులే రామప్ప దేవాలయానికి ప్రధాన ఆకర్షణ.  ఇవ్వన్నీ నల్లరాతి శిల్పాలు.  ఈ విగ్రహముల వస్త్రములు, ఆభరణములు, హావ భావాలు, భంగిమలు, కేశములు ఆ నాటి శిల్పుల కళానైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి.  ఒక మదనికి ఎత్తయిన పాదరక్షలు ధరించింది.  ఈనాడు స్త్రీలు వాడుతున్న హైహీల్స్, ప్లాట్ ఫారమ్ చెప్పులు ఆ కాలంలోనే వున్నాయనటానికి రుజువులివ్వి.

ఆలయంలోపలకి ప్రవేశించగానే రంగమంటపం కనబడుతుంది.  ఇక్కడ దైవారాధనలో నృత్యప్రదర్శనలు జరుగుతుండేవి.  మంటపానికి స్తంభములకు, దూలాలకి, కప్పుకు నల్లరాళ్ళు వాడబడ్డాయి.  ఆ చుట్టుపక్కల ఎక్కడా ఇలాంటి రాయి దొరకదు.  మరి ఇంతపెద్ద నల్లరాళ్ళు ఎక్కడనుంచి, ఏ వాహనాలలో తెచ్చారో, వాటిని పైకి ఎత్తి ఎలా అమర్చారో ఆశ్చర్యం వేస్తుంది.  ఈ మంటపంలో కొన్ని రాళ్ళు విరిగి ఎత్తుపల్లాలుగా తయారయ్యాయి.  భూకంపాలవల్ల అలా అయినాయన్నారు.  ఈ మంటపం కప్పు మధ్యలో నటరాజు పదిచేతులతో వున్నాడు.  ఆయనకి ఎనిమిది దిక్కులలో దిక్పాలకులు వారి వాహనాలతో వున్నారు.  ఎంతటి ఎండాకాలమైనా ఈ మండపంలో చల్లగా వుంటుంది.

 


గర్భగుడి ద్వారమునకు ఆనుకుని వున్న రెండు శిలాఫలకాల మీద నాట్య, మృదంగ వాద్యకారుల బొమ్మలు రకరకాల భంగిమలలో ఆద్భుతంగా మలచబడ్డాయి.  వీటిని చూసే ప్రముఖ నాట్య విద్వాంసులు శ్రీ నటరాజ రామకృష్ణ, పేరిణి నాట్యాన్ని పునరుధ్ధిరించారు. ఇంత గొప్ప శిల్ప సంపదతోకూడిన ఈ ఆలయాన్నిప్రతి ఒక్క తెలుగువారూ తప్పక దర్శించాలి. ఈ దేవాలయం వరంగల్ జిల్లా, వెంకటాపూర్ మండలం, పాలంపేట గ్రామంలో, వరంగల్ కు 60 కి.మీ. ల దూరంలో వున్నది.  బస్సు సౌకర్యం వున్నది.


 

.... పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)