శ్రీ జగన్నాధ - వేంకటేశ్వరస్వామి ఆలయం, అనంతాద్రి

 


శ్రీ జగన్నాధ - వేంకటేశ్వరస్వామి ఆలయం, అనంతాద్రి

 

 

మన రాష్ట్రంలో సుభద్ర, బలరాముడు, జగన్నాధుడి ఆలయాలు తక్కువగానే వున్నాయి.  వారు ముగ్గురూ కొలువైన ఆలయం వరంగల్ జిల్లాలోని మహబూబూబాద్ కి 2 కి.మీ. ల దూరంలో వున్న అనంతాద్రిలో వున్నది.  ఈ మహబూబాబాదు పూర్వం పేరేమిటో తెలుసా మీకు  మానుకోట.

 

పూర్వం ఇక్కడి గుహల్లో  అనేకమంది మహనీయులు తపస్సు చేసుకునేవారు.  వారిలో ఒకరైన అనంతుడనే మహాత్ముని తపస్సుకి మెచ్చి జగన్నాధుడు, బలరామ, సుభద్రల సమేతంగా ప్రత్యక్షమయ్యాడు.  భక్తుని కోరిక ప్రకారం ప్రతి నిత్యం మనుష రూపాల్లో వచ్చి అనంతుని ఆరాధన అందుకుని వెళ్ళిపోయేవారు.  ఆ పరిసర ప్రాంతాల్లోవుండేవారంతా ఆ ముగ్గురినీ దివ్య పురుషులుగా భావించి సేవించేవారు.  వారి అనుగ్రహంతో ఎన్నోప్రయోజనాలు పొందిన భక్తులు, వివాహమయిన కొత్త దంపతులను పసుపు బట్టలతో స్వామి దర్శనానికి తీసుకొచ్చి, కొంగు ముడంత బంగారాన్ని సమర్పించేవారు.  అట్లా వారు సమర్పించిన బంగారమంతా ఈ కొండపైనే ఒక చెక్క పెట్టెలో భద్రపరిచేవారు.

 

 

ఈ విషయం కనిపెట్టిన ఇద్దరు దొంగలు భక్తులవలె నటించి ఒకసారి ఈ బంగారాన్ని దొంగిలించే ప్రయత్నం చేశారు.  ఆ సమయంలో దొంగలు జగన్నాధస్వామిని గాయపరచటానికి కూడా ప్రయత్నించారు.  అది గమనించిన జగన్నాధస్వామి, సుభద్ర, బలరాముడు కళ్ళు మిరుమిట్లుగొలిపే కాంతులు విరజిమ్మతూ శిలా విగ్రహాలుగా మారిపోయారు.  ఆ అద్భుతాన్ని చూసిన దొంగలిద్దరూ భయంతో పరుగులు తియ్యటం మొదలుపెట్టారు.  అలా అరుస్తూ వాళ్ళు ఒక చోట బండరాళ్ళగా మారిపోయారు.  వారి స్పర్శ తగిలిన బంగారంమంతాకూడా బండరాయిగా మారింది.  ఆ ఇద్దరు దొంగల శిలలు, స్వర్ణ శిల,  ఆలయానికి సమీపంలోవున్న కట్టమైసమ్మ గుడికి దక్షిణంవైపున నేటికీ చూడవచ్చు.

 

శిలా విగ్రహాలుగా మారిన జగన్నాధ, సుభద్ర, బలభద్రులు అనంతాద్రి గుహలోనే అర్చామూర్తులుగా వుండిపోయారు.  సిధ్ధులు, మహాయోగులు మాత్రమే సేవించగలిగేటట్లు ఏకాంతంగా యోగముద్రాంకితులై వుండిపోయారు.  చాలాకాలం తర్వాత ఒక గోవులకాపరి అక్కడ తన గోవులను మేపుతుండగా ఒక నల్ల గోవు అనంతారం గుట్ట ఎక్కింది.  గోవుని వెదుకుతూ కాపరికూడా ఆ గుట్ట ఎక్కి అక్కడ గుహలో పులి కళ్ళవంటి మెరుపును చూసి భయంతో పరుగు తీశాడు.  ఆ సంగతి విన్నవారు ఆ ప్రాంతాలలో పులి తిరుగుతున్నదని భయపడి అటువైపు రావటం మానేశారు.  దానితో ఆ ప్రాంతమంతా కీకారణ్యంలాగా తయారయింది.

 

చాలాకాలం తర్వాత స్వామికి మళ్ళీ భక్తులనాదుకోవాలనిపించిందేమో.  కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిగా అదే కొండపై వెలిసాడు.  కొండగుహలో యోగంలో వున్న జగన్నాధునిగా, సమీపంలోనే భక్తుల భోగాలను అందుకునే వేంకటేశ్వరస్వామిగా రెండు అద్భుతమైన స్వయంభూ రూపాలతో భక్తులనాదరిస్తున్నాడు.  ఇక్కడ జగన్నాధుడు యోగమూర్తి, వేంకటేశ్వరుడు భోగమూర్తి.  అలా ఈ క్షేత్రం భక్తుల పాలిటి ఉభయరూపాల అభయ క్షేత్రంగా వెలిసింది.

 

 

 

అంతేకాదు ఈ క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయస్వామికూడా స్వామి సమీపంలో ఒక రాతి పలకపై స్వయంభువుగా అవతరించాడు.  ఈ విగ్రహాన్ని గురించి రెండు కధలు చెప్తారు.  చాలాకాలంక్రితం ఈ ఆంజనేయస్వామికి ఇంకొక గ్రామంలో విడిగా ఆలయాన్ని నిర్మించుదామని విగ్రహాన్ని రెండెడ్ల బండిలో అక్కడికి తరలించారుట.  ఆ గ్రామానికి చేరగానే బండి ఎద్దులు రెండూ కుప్పకూలి పడిపోయాయిట.  ఆ గ్రామమంతా కూడా అనేక ఉపద్రవాలతో నిండిపోయిందట.  దీనిని గుర్తించిన పెద్దలు స్వామిని అక్కడనుంచీ కదిలించటం స్వామికి ఇష్టంలేదని గ్రహించి వెంటనే స్వామిని అనంతాద్రికి చేర్చారుట.

 

ఇంకొకసారి కొందరు గుజరాతీ భక్తులు, ఇంత మహిమగల ఆంజనేయస్వామిని మానుకోటలో (మహబూబాబాదులో) ఒక ధర్మ సత్రంలో వుంచి, మందిరాన్ని నిర్మించుదామని అనుకున్నారు.  ఆంజనేయస్వామి వారికి కలలో కనబడి, తాను అనంతాద్రిపెనే వుంటానని, అక్కడే ప్రతిష్టించమని ఆదేశించారుట.

 

ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి అయినా, క్షేత్ర స్వామి మాత్రం జగన్నాధుడే.  తిరుపతిలో ముందుగా వరాహ నరసింహస్వామిని దర్శించుకుని తదుపరి వేంకటేశ్వరస్వామిని దర్శించినట్లు, ఇక్కడ ముందు జగన్నాధ స్వామిని తదుపరి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శిస్తారు.

 

కీకారణ్యంలో వున్న ఈ స్వామి ఆలయాన్ని పునరుధ్ధరించినది శ్రీ నూకల రామానుజులుగారు.  ఒకసారి స్వామి ఆయనకు కలలో కనబడి తానుఅనంతుడనే మహర్షి తపస్సువలన సుభద్రా, బలరాముల సమేతంగా అక్కడ వెలిసినట్లు, తన యోగ శక్తితో శ్రీదేవీ భూదేవీ సమేతంగా వేంకటేశ్వరస్వామికూడా అక్కడ స్వయం వ్యక్తమయినట్లు, తమ ఆలయాన్ని పునరుధ్ధరించి పూజాదికాలు చేయమని ఆదేశించాడు.  రామానుజులుగారు గ్రామ పెద్దలతో అక్కడ అన్వేషించి స్వామిని కనుగొని, పూజాదికాలు చేయసాగారు.  అక్కడికి రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవటంవల్ల  జనం రావటంతగ్గి మళ్ళీ వైభవం కోల్పోయిన ఈ ఆలయాన్ని నూకల వంశస్తులే 1885 సం. నుండి నేటిదాకా అనేక మంది అనేక అంచలలో పునరుధ్ధరించి నేడు వైభవోపేతంగా తీర్చిదిద్ది కళ్యాణ మంటపం, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఆలయానికి వచ్చేవారికి 36 అడుగుల అభయాంజనేయస్వామి, 30 అడుగుల గరుక్మంతుడు  దర్శనమిస్తారు.

 

శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయర్ స్వామివారు యావద్భారతదేశం తిరుగుతూ  శ్రీరాముడు సంచరించిన ప్రాంతాలలో శ్రీరామ క్రతువు నిర్వహించి, ఆ క్రతు విజయ చిహ్నంగా 108 శ్రీరామ క్రతు స్ధూపాలను ప్రతిష్టించారు.  వారు భద్రాచలంలో 100వ శ్రీరామ క్రతువును నిర్వహించి, మార్గమధ్యంలో వున్న ఈ క్షేత్ర ప్రశస్త్యాన్ని తెలుసుకుని ఇక్కడ పునర్వసు దీక్షతో 27 రోజులపాటు శ్రీరామమహా క్రతువును నిర్వహించి, ఇక్కడ 102వ స్ధూపాన్ని 13.5.1968న ప్రతిష్ఠిచారు.

దర్శన సమయాలు

 

ఉదయం 6 గం.లనుంచి 12 గం.లవరకు
సాయంత్రం 4-30నుంజి 8.00 గంటలవరకు.

 

... పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)