నవరాత్రి ప్రాముఖ్యత

 

 

నవరాత్రి ప్రాముఖ్యత

 

హైందవ మతంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఉందో, దేవతకి అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు! అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటాము. మన దృష్టిలో శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు... అది చలనానికి ప్రతీక! ఆ శక్తిని భిన్నరూపాలలో, భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు.

శక్తి ఆరాధన

విశ్వంలోని స్త్రీ తత్వాన్ని ఆరాధించేందుకు నవరాత్రులు ఓ గొప్ప సందర్భం. ఆ స్త్రీ మనకు మాతృమూర్తిగా (దుర్గ), ఆయురారోగ్యాలను ప్రసాదించే తల్లిగా (లక్ష్మి), జ్ఞానాన్ని అందించే తొలిగురువుగా (సరస్వతి) సుపరిచితమే! అందుకనే కొందరు నవరాత్రులో మూడు మూడు రోజుల చొప్పున ఈ దేవతలను ఆరాధిస్తారు. మరికొందరు బాలపూజ, సువాసినీ పూజ పేరుతో చిన్న పిల్లలనీ, ముత్తైదువలనూ సాక్షాత్తూ అమ్మవారిగా భావించి పూజచేస్తారు. సృష్టిలోని శక్తికి స్త్రీలంతా ప్రతిరూపాలే అని భావించి, వారిని భౌతికంగా పూజించే అరుదైన ఆచారం ఒక్క నవరాత్రుల సందర్భంలోనే కనిపిస్తుంది.

కుండలిని

మనం కుండలిని కూడా శక్తి అనే పిలుస్తాము. మనిషి మనిషిలోనూ ఉన్న ఆ షట్చక్రాలను ఛేదించిన రోజున తనకీ, ఈ సృష్టికీ మధ్య ఉన్న అభేదాన్ని గ్రహిస్తాడు. అమ్మవారి కటాక్షంతోనే ఆ కుండలినీ శక్తి జాగృతం అవుతుందని భక్తుల నమ్మకం. అందుకేనేమో అమ్మవారి చుట్టూ ఉన్న దైవాలు కూడా పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపాలుగా కనిపిస్తారు. శివుడు దక్షిణామూర్తిగా, ఆదిగురువుగా ప్రసిద్ధుడు. ఇక గణపతి సిద్ధి, బుద్ధులను ప్రసాదిస్తాడని ప్రతీతి. మరోవైపు కుమారస్వామిని కూడా జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు. కుండలినీ సంబంధమైన ప్రక్రియలు సాగించేవారు తమలోని కుండలినిని జాగృతం చేసేందుకు ఈ నవరాత్రులను మరింత అనువైనవిగా భావిస్తారు. ఈ కాలంలో చేసే సాధన మరిన్ని సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తారు.

పదో రోజుతో సార్ధకత

ఒకప్పుడు పాశ్చాత్యులకు కేవలం తొమ్మిది అంకెల వరకే తెలుసు. వారి దృష్టిలో తొమ్మిది పరిపూర్ణమైన సంఖ్య. నిజమే! అందుకనే తొమ్మిదితో ఏ సంఖ్యను హెచ్చించినా తిరిగి అదే సంఖ్య వస్తుంది. కానీ ఆ తొమ్మిది తరువాత ఏమిటన్నదే ప్రశ్న! లక్ష్యం కోసం ఎంత గొప్పగా పోరాడినా విజయం సాధిస్తేనే కదా దానికి సార్ధకత. జీవితాన్ని ఎంత గొప్పగా సాగించినా పరమార్ధం తెలుసుకుంటేనే కదా దానికి విలువ. అందుకే నవరాత్రులు పోరాడిన దుర్గ ‘విజయదశమి’ నాడు జయం పొందింది. మనలోని దుర్గుణాల మీద పోరాడటమే కాదు. అవి తిరిగి మేల్కొనకుండా అణగదొక్కేయాలన్నదే ‘దశమి’ చెప్పే మాట.
 

దేశమంతటా

దైవశక్తిని స్త్రీ స్వరూపంగా కొలుచుకోవడం ఏదో ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. వేల సంవత్సరాలుగా భారతదేశంలోని గ్రామగ్రామానా అమ్మవారిని ఏదో ఒక రూపంలో పూజిస్తూనే వస్తున్నాం. ఎల్లమ్మ, పోలేరమ్మ, గంగమ్మ, పోచమ్మ, మైసమ్మ.... ఇలా పేర్లు ఏవైతేనేం ప్రకృతిని పాలించే ఆ చల్లని తల్లి చూపు తన మీద ఉండాలని ధార్మికుడైన ప్రతి హిందువూ వేడుకుంటేనే వస్తున్నాడు. కాళీమాత మొదలుకొని లలితాత్రిపురసుందరి వరకూ ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారిని ఆరాధిస్తున్నారు. అందుకోసం నవరాత్రులకు మించిన పండుగ మరేముంటుంది!

 

- నిర్జర.