Read more!

కాళికాదేవి వెలసిన చోటు దిల్లీలో ఉందా!

 

 

 

కాళికాదేవి వెలసిన చోటు దిల్లీలో ఉందా!

 

 


దిల్లీ అనగానే ఎర్రకోట, లోటస్‌ టెంపుల్‌, కుతుబ్ మీనార్ వంటి కట్టడాలే గుర్తుకువస్తాయి. కానీ వేల సంవత్సరాలుగా ఇక్కడ ఓ కాళికా దేవి ఆలయం తన ఉనికిని చాటుకుంటున్న విషయం తెలుసా! అదే కల్కాజీ మందిర్‌. నవరాత్రులు మొదలవగానే దిల్లీవాసులకు ఈ కల్కాజీ మందిరమే గుర్తుకువస్తుంది.

 

కాళిక అవతారం

దుర్గాదేవికీ శుంభనిశుంభులు అనే రాక్షసులకీ జరిగిన పోరులో, రాక్షసుల తరఫున రక్తబీజుడు అనేవాడు కూడా ఉన్నాడట. ఆ రక్తబీజునికి ఓ వింత వరం ఉంది. అతని రక్తం కనుక నేలమీద పడితే, అలా పడిన ప్రతి రక్తపు బొట్టులోంచి మరో రక్తబీజుడు ఉద్భవిస్తాడు. కాబట్టి దుర్గాదేవి అతన్ని ఎంతగా గాయపరిచినా మరింతమంది రక్తబీజులు పుట్టుకురాసాగారు. ఇక ఆ రాక్షసుని రక్తం నేల మీద పడకుండా ఉండేందుకు దుర్గాదేవి నుంచి కాళిక అనే అవతారం వెలువడింది. ఆమె తన బ్రహ్మాండమైన ఆకారంతో, కొండంత నాలుకతో ఆ రాక్షసుని రక్తం నేల మీద పడకుండా చూసుకుంది. ఆ ఘట్టం జరిగిన ప్రాంతమే కల్కాజీ మందిర్‌ అని భక్తుల నమ్మకం. కాళిక మందిరం అన్న పేరు కాలక్రమేణా కల్కాజీ మందిరంగా మారింది.

 

 

వేల ఏళ్ల చరిత్ర

కల్కాజీ మందిరానికి దాదాపు మూడువేల ఏళ్ల చరిత్ర ఉందంటారు. యుద్ధానికి ముందు విజయాన్ని ప్రసాదించమనీ, యుద్ధం పూర్తయిన తరువాత కృతజ్ఞతాపూర్వకంగానూ పాండవులు ఈ మందిరంలో ప్రార్థనలు చేశారని చెబుతారు. శ్రీకృష్ణుడు సైతం పాండవులకు తోడుగా ఈ ఆలయంలో పూజలు నిర్వహించాడట. ఇక్కడి కాళిక కోరిన వరాలను తీరుస్తుంది కాబట్టి ఈ ఆలయానికి ‘మనోకామ్న సిద్ధిపీఠం’ అన్న పేరు కూడా ఉంది.

 

 

ఔరంగజేబు కన్నుపడిందా?

స్థానికులలో కల్కాజీ ఆలయం పట్ల ఉన్న భక్తిశ్రద్ధలను ఓర్చుకోలేని ఔరంగజేబు దీనిని కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా కొన్ని కథనాలు ఇంటర్నెట్లో ప్రచారంలో ఉన్నాయి. అవి ఎంతవరకు నిజమో కానీ, ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని ఔరంగజేబు కాలం తరువాత పునర్నర్మించనట్లు ఆధారాలు ఉన్నాయి. 18వ శతాబ్దంలోని మరాఠా రాజులు ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించినట్లు రాతపూర్వకమైన వివరాలు లభ్యమవుతున్నాయి.

 

 

అమ్మవారి మహత్తు

ఇక్కడి కాళికా అమ్మవారు గొప్ప మహత్యం కలదని భక్తుల నమ్మకం. అందుకు అనుగుణంగా చాలా కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఉదాహరణకు ఒకానొక రాజు ఏదో ఘోర యుద్ధంలో తన సైన్యం యావత్తునీ కోల్పోయి ఒంటరిగా మిగిలాడట. ఆ రాజు అలసటతో అటుతిరిగీ ఇటుతిరిగీ చివరికి కల్కాజీమందిరం ఉన్న ప్రాంతానికి వచ్చి సొమ్మసిల్లిపోయాడట. ఆ రాత్రి రాజుగారి కలలో కాళికా దేవి కనిపించి ‘దైర్యాన్ని కోల్పోవద్దనీ, మరోసారి ప్రయత్నించి చూడమనీ’ ఆదేశించిందట. రాజు ఉదయాన్నే లేచి చూస్తే ఏముంది. పోయిందనుకున్న సైన్యమంతా కళ్ల ఎదురుగా కనిపించింది. ఆ సైన్యంతో రాజు యుద్ధాన్ని కొనసాగించి విజయాన్ని సాధించాడు. ఇంత మహిమాన్వితమైనది కాబట్టే యోగులు ఈ క్షేత్రాన్ని దర్శించేందుకు, కొంతకాలం ఇక్కడే నివసించేందుకు తపించేవారు. ఇక్కడి కాళికా దేవిని ఆరాధించేందుకు తాంత్రికుల సంచారం కూడా ఎక్కువగా ఉండేదట.

 

 

చెదరని వైభవం

శతాబ్దాలు గడిచినా, చుట్టూ దిల్లీ నగరం విస్తరించినా కల్కాజీ మందిరానికి ఉన్న ప్రభ తగ్గలేదు. దక్షిణ దిల్లీలోని లోటస్ టెంపుల్‌కి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు వెల్లువలా వస్తూనే ఉంటారు. ముఖ్యంగా కాళికను కొలుచుకునే నవరాత్రుల సందర్భంలో ఈ ఆలయంలో ప్రజలతో పోటెత్తిపోతుంది. పురాతనమైన కట్టడాలు, చిత్రమైన మూలవిరాట్టుతో ఉన్న ఈ మందిరాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి ప్రజలో ఆసక్తి చూపుతారు. ఈ మందిరాన్ని చేరుకునేందుకు ప్రత్యేకంగా కల్కాజీమందిర్‌ పేరుతో ఒక మెట్రో స్టేషన్ కూడా ఉంది.

 

- నిర్జర.