బెంగాలీ దుర్గాపూజ బహు రమ్యం
బెంగాలీ దుర్గాపూజ బహు రమ్యం
బెంగాలీలు దసరా ఉత్సవాలను ఎంత వైభవోపేతంగా జరుపుతారో ప్రపంచం మొత్తానికీ తెలుసు. శక్తి ఉపాసనలో బెంగాలీయులకే అగ్ర తాంబూలం. దుర్గా మాతను బెంగాలీలు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. శివుడు తన భార్య అయిన దుర్గను మూడు రోజులపాటు పుట్టింటికి పంపిస్తాడని, అలా దుర్గాదేవి తన కుమారులైన వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, లక్ష్మి, సరస్వతులతో తమ ఇళ్ళకు వస్తుందని బెంగాలీలు భావిస్తారు. దసరా సమయంలోనే దుర్గ తమ ఇళ్లకు వస్తుందని విశ్వసిస్తారు. అందుకే బెంగాలీలు దసరా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడంతోపాటు దుర్గాపూజను విశేషంగా నిర్వహిస్తారు. దుర్గాదేవిని తమ ఇళ్ళలోకి ఆహ్వానిస్తూ ‘‘ఆగమని గీతిక’’ను ఆలాపిస్తారు. తమ ఇంటికి వచ్చిన ఆడపడుచును ఎలా ప్రేమగా చూసుకుంటారో, దుర్గాదేవిని కూడా తమ ఆడపడుచులాగానే భావిస్తూ పూజిస్తారు. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన అష్టమి, నవమి తిథుల మధ్య వేళలో దుర్గాదేవికి సంధ్య పూజ చేసి దశమి నాటికి ఆమెని మళ్ళీ మెట్టినింటికి సాగనంపుతారు. ఈ సందర్భంగా ‘‘నిగమనీ గీతిక’’ అనే వీడ్కోలు పాట పాడతారు.
పశ్చిమ బెంగాల్ మొత్తమూ భక్తిశ్రద్ధలతో దుర్గాపూజ జరుపుకుంటుంది. తొమ్మిది రోజులపాటు దుర్గను ఆరాధించి పదవ రోజున దుర్గామాత విగ్రమాలను నిమజ్జనం చేస్తారు. పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కోల్‌కతాలో దుర్గాదేవి మరో రూపమైన కాళికను పూజిస్తారు. కోల్‌కతాలో కాళీపూజ అత్యంత వైభవంగా జరుగుతుంది. చెడును సహరించే దేవత అయిన కాళికామాత ఒక చేత్తో రక్తసిక్తమైన ఖడ్గాన్ని ధరించి, మరోచేత్తో రాక్షసుడి ఖండిత శిరస్సును పట్టుకుని, కపాల మాల వేసుకుని, శివుడి రూపంలో వచ్చిన రాక్షసుడి మీద నిల్చుని అరివీర భయంకరంగా ఆమె వుంటుంది.
కలకత్తాలో శుక్లపక్షం మొదటిరోజు అర్థరాత్రి కాళీపూజ జరుపుతారు. ప్రతి ఇంట్లో దివ్వెలు దేదీప్యమానంగా వెలుగుతాయి. భారీ స్థాయిలో టపాకాయలు వెలిగించి వేడుకలు చేసుకుంటారు. కాళీపూజ పురాణం భారతీయ సంస్కృతిలో ఓ ముఖ్యాంశం. అనంత విశ్వ చైతన్యానికి ప్రతీకగా శక్తి స్వరూపిణిగా కాళీమాత మనముందుంది. ఆమెకు అనంత శక్తులున్నాయని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కలకత్తాలో రెండు ప్రముఖ కాళీ ఆలయాలు వున్నాయి. అవి దక్షిణేశ్వర్, కాళీఘాట్. ఈ రెండు ఆలయాల్లో కాళీపూజ మహాద్భుతంగా జరుగుతుంది.
దసరా నవరాత్రులు బెంగాలీలు ఆనందోత్సాహాలతో కుటుంబ వేడుకలా జరుపుకుంటారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన బెంగాలీలు విజయదశమి సందర్భంగా స్వస్థలాలకు వెళ్తారు. పురుషులు, మహిళలు సంప్రదాయమైన దుస్తులు ధరించి వేడుకలలో పాల్గొంటారు. దసరా వేడుకలు బెంగాలీయుల జీవితంలో అంతర్లీనంగా పెనవేసుకుపోయిన ఒక ప్రధాన ఘట్టం.