వీరశైవాగ్రేసరుడు పాల్కురికి సోమనాధుడు

 

వీరశైవాగ్రేసరుడు పాల్కురికి సోమనాధుడు

 

 

శివుడే ఆదిదేవుడని ప్రతిపాదించిన మతం వీరశైవమతం. శివుడొక్కడే దేవుడని ప్రగాఢంగా విశ్వసించేవాళ్లు వీరశైవులు. వీళ్లు అవధుల్లేని భక్త్యావేశంతో శివయ్యను కొలుస్తారు. శివయ్య తప్ప ప్రపంచంలో తమకేదీ పట్టదన్నంత పట్టుదలతో ఆయన్ని సేవించుకునే భక్తుల మతం వీరశైవమతం. వీరశైవాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన కవుల్లో పాల్కురికి సోమనాథుడు ప్రథముడు. ఈయన సాక్షాత్తూ నందీశ్వరుడి అంశ అని చాలామంది బలంగా నమ్ముతారు. అందుకే దేవదేవుణ్ణి అంతగా ప్రేమించి, తన సర్వస్వాన్నీ స్వామిసేవకే అంకింతం చేయగలిగాడని చెబుతారు. సర్వజ్ఞ బిరుదాంచితులైన తెలుగుకవులలో పాల్కురికి సోమనాథుడు శిఖామణి వంటివాడు. సాక్షాత్తూ తనను తాను నందిగా భావించుకుని శివయ్యకు సారస్వత సేవను చేసుకున్న మహనీయుడు పాల్కురికి సోమన. పదిరకాలుగా ఆయన కవితారంగంలో ప్రథమగణ్యుడు.


 

బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించిన ప్రథమాంధ్రవీరశైవకవిగా, జైనపురాణ లక్షణాలతో తెలుగులో దేశిపురాణాన్ని రచించిన ప్రథమకవిగా, కన్నడ సాహిత్యంలోని 'చరిత్రె' కావ్యానికి తెలుగులో ప్రక్రియాగౌరవాన్ని కల్పించిన ప్రథమకవిగా, ద్విపదకు కావ్య, పురాణగౌరవాన్ని కలిగించిన మొదటికవిగా, ఒక మత విజ్ఞానానికీ, ప్రచారానికీ, సాధనకూ కావలసిన ప్రక్రియలన్నింటినీ రచించి మతసాహిత్య సర్వజ్ఞత్వాన్ని ప్రదర్శించిన ప్రథమకవిగా, లిఖిత సంప్రదాయానికీ, మౌఖిక సంప్రదాయానికీ వారధి కట్టిన మొదటికవిగా, ధ్వన్యనంతర యుగంలో మూలరసవాద ప్రస్థానానికి తెలుగులో మూలపురుషుడైన మొదటికవిగా, భరతాదులంగీకరించని భక్తిరసానికి పట్టం కట్టిన ప్రథమకవిగా, సంస్కృతాంధ్రాలలోనే కాక దేశభాషలలో కూడా పాండిత్యాన్ని ప్రదర్శించిన మొదటికవిగా, సామాజిక స్పృహతో సాహిత్యాన్ని సృష్టించిన భక్తి ఉద్యమ ప్రథమకవిగా పాల్కురికి సోమన గడించిన అప్రతిహతమైన పేరుప్రఖ్యాతుల్ని మరే కవీ పొందలేదంటే అతిశయోక్తి ఏమాత్రం లేదు.

 చాలామంది ప్రాచీన కవులలాగానే పాల్కురికి సోమనాథుడు కూడా తననుగురించి తన కావ్యాలలో తక్కువ చెప్పుకొన్నాడు. అందువల్ల ఆయన అతని జీవిత విశేషాలు పూర్తిగా తెలియవు. తెలిసిన వాటితోనే పాల్కురికి సోమనాథకవి కథను చెప్పుకోవలసివస్తోంది. ఆయన రాసిన కృతులే కాక, ఏకామ్రనాథుడి ప్రతాప చరిత్ర మనే వచన గ్రంథం, పిడపర్తి సోమనాథుడి పద్య బసవపురాణం, ఒక శైవకవి రచించిన అన్యవాదకోలాహలమనే సీసపద్య శతకం, తుమ్మలపల్లి నారనాధ్యుని ద్విపద బసవవిజయం, తోంటదసిద్ధ లింగకవి కన్నడంలో రచించిన పాలకురికి సోమేశ్వర పురాణం, 

ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని స్థానికచరిత్రలు, కైఫియత్తులు మొదలైనవి పాల్కురికి చరిత్రను తెలుసుకునేందుకు కొంత తోడ్పడుతున్నాయి. తెలంగాణంలోని ఓరుగల్లుకు పన్నెండు క్రోసులదూరంలో జనగామ తాలూకాలో ఉన్ననేటి 'పాలకుర్తి' పాల్కురికి సోమనాథుడి జన్మస్థాన మని విమర్శకులు బలంగా నమ్ముతున్నారు. మైసూరు రాష్ట్రంలోని తుముకూరు జిల్లాలో ఉన్న 'హాలుకురికె' అనే గ్రామం 'పాలకురికి' ఆయి ఉండవచ్చననీ, కన్నడంలోని 'హ' వర్ణం తెనుగున 'ప' గా మారటం సహజమని మరికొందరంటున్నారు. పాల్కురికి సోమనాథకవి తాను వీరశైవాన్ని అవలంబించాడని చెప్పడంకంటే తానే వీరశైవంగా భాసిల్లాడని చెప్పడమే సబబేమో.

- మల్లాది వేంకటగోపాలకృష్ణ