లంకలో హనుమంతుడు చూసిన రాక్షసులు ఎవరు?

 

లంకలో హనుమంతుడు చూసిన రాక్షసులు ఎవరు?

లంక హనుమంతుడిని లోపలికి వెళ్ళమని తలుపు తెరవగానే హనుమంతుడు అక్కడున్న గోడమీద నుండి ఎగిరి లోపలికి ఎడమకాలు పెట్టి దూకాడు. లోపలికి వెళ్ళి ఆ లంకా పట్టణాన్ని చూడగా, ఇది గంధర్వ నగరమా అన్నట్టుగా ఉంది. అక్కడున్న మేడలు, స్తంభాలు బంగారంతో చెయ్యబడి ఉన్నాయి. అన్నిటికీ నవరత్నాలు తాపడం చెయ్యబడి ఉన్నాయి.

స్ఫటికములతో మెట్లు కట్టబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా దిగుడుబావులు, సరోవరాలతో ఆ ప్రాంతం శోభిల్లుతుంది. ఆ ప్రాంతం చెట్లతో, పక్షులతో, పళ్ళతో, నెమళ్ళ అరుపులతో, ఏనుగులతో, బంగారు రథాలతో అత్యంత రమణీయంగా ఉంది. ఆ రాత్రి పూట ఆకాశంలో ఉన్న చంద్రుడు వెన్నెల కురిపిస్తూ, లోకములో ఉన్న పాపం పోగొట్టేవాడిలా ఉన్నాడు. ఆ చంద్రుడి ప్రకాశంతో హనుమంతుడు ఆ లంకా పట్టణంలోని వీధులలో సీతమ్మ కోసం వెతుకుతూ వెళ్తున్నాడు.

అలా వెళ్తున్న హనుమంతుడికి లంకలో ఉన్న ప్రజలు అందరూ కనిపించసాగారు. ఆ లంకా పట్టణంలో ఉన్నవాళ్లు దీక్షితులు, కొంతమంది తల మీద వెంట్రుకలన్ని తీయించుకున్నారు. కొంతమంది ఎద్దు చర్మాలు కట్టుకొని ఉన్నారు, కొంతమంది దర్భలని చేతితో పట్టుకొని ఉన్నారు. కొంతమంది అగ్నిగుండాలని చేతితో పట్టుకొని ఉన్నారు. ఒకడు పక్కవాడికి తన ఛాతిని చూపిస్తున్నాడు. కొంతమంది తమ శరీరాలని కనపడ్డ స్త్రీల మీద పడేస్తున్నారు.

కొంతమంది ఎప్పుడూ తమ చేతులలో పెద్ద పెద్ద శూలాలు పట్టుకొని ఉన్నారు. కొంతమంది పరస్పరం ఒకడిని ఒకడు తోసుకుంటూ ఉన్నారు. తమ భుజాల బలాలని చూపించుకుంటూ ఉన్నారు, ఒకడిని మరొకడు అధిక్షేపించుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ లంకలో ఒకడు శూలం పట్టుకొని, ఒకడు ముద్గరం, ఒకడు పరిఘ, అలా రకరకాల ఆయుధములు పట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ అవకాశం వస్తే చాలు ఎవడితో అయినా గొడవ పడి అవతలి వాళ్ళను చంపి తినేద్దామ అన్నట్టుగానూ, వాళ్లలో ఉన్న రాక్షసత్వాన్ని బయటకు చూపించి తమ ప్రతాపం బయటపెడదామా అని ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్టున్నారు.

అక్కడున్న రాక్షసుల పేర్లను రామాయణంలో ఇలా ప్రస్తావించారు. 

ప్రహస్త,

కుంభకర్ణ, 

మహోదర, 

విరూపాక్ష, 

విద్యున్మాలి, 

వజ్రదంష్ట, 

సుఖ, 

సారణ, 

ఇంద్రజిత్, 

జంబుమాలి, 

సుమాలి, 

రస్మికేతు, 

సూర్యకేతు, 

వజ్రకాయ, 

ధూమ్రాక్ష, 

భీమ, 

ఘన, 

హస్తిముఖ, 

కరాళ, 

పిశాచ, 

మత్త, 

ధ్వజగ్రీవ, 

సుకనాస, 

వక్ర, 

శట, 

వికట, 

బ్రహ్మకర్ణ, 

దంష్ట్ర, 

రోమస.

హనుమంతుడు ఆ రాక్షసులు అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి సీతమ్మ కోసం వెతికాడు. ఆ సమయంలో రాక్షస స్త్రీలు తమ భర్తలతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారు.

ఆ స్త్రీలందరినీ చూసిన హనుమంతుడు "మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు. మా సీతమ్మ కనిపించి కనపడకుండా ఉండే చంద్రరేఖలా ఉంటుంది, మట్టిపట్టిన బంగారు తీగలా ఉంటుంది, బాణపు దెబ్బ యొక్క బాధలా ఉంటుంది, వాయువు చేత కొట్టబడ్డ మేఘంలా ఉంటుంది" అంటూ, ఆ లంకా పట్టణాన్ని వెతుకుతూ ముందుకు సాగిపోయాడు.

                              ◆వెంకటేష్ పువ్వాడ