Read more!

హనుమంతుడు లంకను ఎందుకు కొట్టాడు?

 

హనుమంతుడు లంకను ఎందుకు కొట్టాడు?

ధృతి-దృష్టి-మతి-దాక్ష్యం అనే ఈ నాలుగింటిని ఎవరు తమ పనులలో కలుపుకుంటున్నారో వారికి జీవితంలో ఓటమి అన్నది లేదు అని వాల్మీకి మహర్షి చెప్పారు. ధృతి అంటే పట్టుదల, దృష్టి అంటే మంచి బుద్ధితో ఆలోచించగల సమర్ధత, మతి అంటే బుద్ధితో నిర్ణయించవలసినది, దాక్ష్యం అంటే శక్తి సామర్ధ్యాలు.

సముద్ర ప్రయాణం చేసి లంబగిరి పర్వతం మీద దిగిన హనుమంతుడు విశ్వకర్మచే నిర్మితమైన లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ లంకా పట్టణాన్ని సొంతం చేసుకోవడం ఆ దేవతల వలన కూడా కాదు అని అనుకొని, "నేను ఈ రూపంతో సీతమ్మని వెతకడం కష్టం కాబట్టి  పిల్లి పిల్లంత రూపంలోకి మారిపోయి లోపలికి వెళ్ళి సీతమ్మని వెతుకుతాను. అలా అయితేనే నా పని కొంచెం సులభమవుతుంది" అనుకున్నాడు. చీకటి పడ్డాక ఆయన పిల్లి పిల్లంత స్వరూపాన్ని పొంది లంక యొక్క రాజద్వారము దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి వికటాట్టహాసం చేస్తూ పర్వతం అంత ఆకారంతో ఒక రాక్షస స్త్రీ కనపడింది. 

హనుమంతుడు పిల్లి పిల్లంత రూపంలోకి మారిపోయినా ఆమె హనుమంతుడిని చేసేసింది. ఆమె హనుమంతుడిని చూడగానే "నువ్వు ఎవరు?. అరణ్యములలో తిరిగే కోతివి, నీకు ఇక్కడ పనేంటి? ఇక్కడికి ఎందుకొచ్చావు?" అని అడిగింది.

హనుమంతుడు తెలివిగా ఆలోచించి "ఓ వికృతమైన కన్నులున్న దాన! నేను ఎందుకు వెళుతున్నానో తెలుసా? ఒకసారి ఆ పనాలని, ఉపవనాలని, చెట్లని, భవనాలని, సరస్సులని చూడాలని ఉంది. నేను లోపలికి వెళ్ళి వాటిని చూసి వచ్చేస్తాను. నాకు అనుమతి ఇవ్వు" అన్నాడు.

అప్పుడు ఆవిడ  "నేను అనుమతి ఇవ్వడం కాదు, నన్ను గెలిచినవాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు. నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలులేదు" అని పలికింది.

"సరే ఇంతకీ నువ్వు ఎవరు?" అని హనుమంతుడు ఆ స్త్రీని ప్రశ్నించాడు.

అప్పుడామె "నేను లోపలున్న మహాత్ముడైన రావణుడి పలుకున ఈ లంకా పట్టణానికి కాపలా కాస్తుంటాను" అని చెప్పి చట్టుక్కున్న హనుమంతుడిని తన చేతితో ఒక దెబ్బ కొట్టింది.

ఆ దెబ్బకి హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. కుడి చేతితో కొడితే ఈమె చనిపోతుందని, తన ఎడమ చేతితో ఆమెని ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి ఆమె కళ్ళు తేలేసి కిందపడిపోయింది.

అప్పుడామె ఇలా పలికింది "నన్ను లంక అంటారు. నువ్వు నన్ను గెలిచావు. నేను ఈ రావణాసురుడి బాధ భరించలేకపోతున్నాను. కొన్ని వేల సంవత్సరాల నుండి నన్ను విసిగిస్తున్నాడు. ఒక వానరుడు వచ్చి నిన్ను గెలిచిన రోజు, నీకు ఈ రావణుడి గొడవ వదిలిపోతుంది" అని బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్ధమయ్యింది, బ్రహ్మగారు చెప్పిన ఆ వానరుడివి నువ్వే, ఈ లంకలోని రాక్షసుల పని, రావణుడి పని అయిపోయింది. ఇక నువ్వు లోపలికి వెళ్ళి సీతమ్మని కనిపెట్టు" అని రాజద్వారం తెరిచింది.

                               ◆వెంకటేష్ పువ్వాడ.